Let's talk: editor@tmv.in
కోవిడ్‌పై నిజాలు చెప్పిన‌ జ‌ర్న‌లిస్టుకు జైలు శిక్ష‌!

కోవిడ్‌పై నిజాలు చెప్పిన‌ జ‌ర్న‌లిస్టుకు జైలు శిక్ష‌!

Venkatesh Balusula
22 సెప్టెంబర్, 2025

చైనాలోని వుహాన్ నగరంలో కోవిడ్ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో రిపోర్టింగ్ చేసిన జర్నలిస్ట్ జాంగ్ ఝూన్‌కు ప్ర‌భుత్వం మ‌రో నాలుగేళ్లు శిక్ష‌ను పొడిగించింది. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ మీడియా సంస్థ రిపోర్ట‌ర్స్ వితౌట్‌ బోర్డ‌ర్స్ వెల్ల‌డించింది. కోవిడ్ మ‌హ‌మ్మారి విజృంభించిన మొద‌టి రోజుల్లో వుహాన్‌లో స్థానిక ప‌రిస్థితుల‌పై జాంగ్ ఝూన్ నిజాల‌ను నివేదిస్తూ వీడియోలు, ఫోటోలు, రాత‌పూర్వ‌కంగా సోష‌ల్ మీడియాలో త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించింది. ఈ కార‌ణంతో ఆమెకు 2020లోనే నాలుగేళ్ల పాటు జైలు శిక్ష వేశారు. గొడ‌వ‌లు పెంచ‌డం, ఇబ్బందుల‌ను రెచ్చ‌గొట్ట‌డం అనే కార‌ణాల‌తో ఆమెకు శిక్ష విధించారు. తాజాగా ఆమెకు మ‌ళ్లీ శిక్ష విధించ‌డంపై తీవ్ర‌ విమ‌ర్శ‌లు వ్య‌క్తమ‌వుతున్నాయి.

చైనా తీరుపై తీవ్ర విమర్శలు

కోవిడ్ వ్యాప్తి స‌మ‌యంలో చైనాలో వాస్తవ ప‌రిస్థితులు ప్ర‌పంచానికి తెలియ‌కుండా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. స్థానికంగా ప‌రిస్థితులు అదుపులో ఉన్నాయ‌ని, ఎలాంటి స‌మ‌స్య‌లు లేవ‌న్న‌ట్లు అధికారులు, ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో వాస్త‌వానికి చైనాలో ఏం జ‌రుగుతుంద‌న్న దానిపై ప్ర‌పంచ వ్యాప్తంగా ఆస‌క్తి ఉండేది. స్థానిక జ‌ర్న‌లిస్ట్ జాంగ్ ఝూన్ ఈ విష‌యాల‌ను ప్ర‌పంచానికి తెలిపేందుకు ముందుకొచ్చింది. కోవిడ్ వ్యాప్తితో ఆసుపత్రుల్లో జనం రద్దీ, రోడ్లు ఖాళీగా ఉన్న దృశ్యాలను వీడియోలు, ఫోటోల రూపంలో సోష‌ల్ మీడియాలో పోస్టు చేసి అధికారుల క‌ట్టుక‌థ‌ల‌ను చెరుపుతూ వాస్త‌వాల‌ను ప్ర‌పంచం ముందుంచింది. జాంగ్ జైలు శిక్షపై చైనా విదేశాంగ శాఖ నుంచి ఆదివారం వరకు ఎలాంటి స్పందన రాలేదు. ఆమెకు వ్యక్తిగ‌తంగా న్యాయవాది ఉన్నారా? లేదా? అనేది తెలియలేదు. వాస్త‌వాల‌ను నిర్భ‌యంగా బ‌య‌ట‌పెట్టిన‌ జాంగ్ ఝాన్‌ను ప్రపంచం గౌరవించాలి, కానీ ఆమెకు కఠిన జైలు శిక్ష విధించ‌డం స‌రికాద‌ని ఆర్‌ఎస్‌ఎఫ్ ఆసియా పసిఫిక్ విభాగం మేనేజర్ అలెక్సాండ్రా బియలాకోవ్‌స్కా అభిప్రాయ‌ప‌డ్డారు. ఆమె బాధలు ఆపడానికి ప్రపంచ దేశాలు చైనాపై ఒత్తిడి తీసుకురావాల‌ని, ఆమెను వెంటనే విడుదల చేయాల‌ని ఆమె కోరారు. జాంగ్ ఝాన్ అరెస్ట్ అయిన తర్వాత ఆమె ఆహారం తినడానికి నిరాకరించింది. పోలీసులు ఆమె చేతులు కట్టి, గొట్టం ద్వారా బలవంతంగా ఆహారం ఇచ్చారని ఆమె న్యాయవాదులు చెప్పారు. 2024 మేలో ఆమె జైలు నుంచి విడుదలైంది, కానీ మూడు నెలల తర్వాత మళ్లీ అరెస్ట్ చేశారు. ఆమెను షాంఘైలోని పుడాంగ్ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు.

తాజా జైలు శిక్ష ఆమె చైనా మానవ హక్కుల ఉల్లంఘనలపై నివేదించినందుకు వచ్చిందని ఆర్‌ఎస్‌ఎఫ్ చెప్పింది. ఆమె మాజీ న్యాయవాది రెన్ ఎక్స్ వేదిక‌గా ఓ పోస్ట్ చేశారు. విదేశీ వెబ్‌సైట్లలో ఆమె వ్యాఖ్యల కారణంగా కొత్త కేసు పెట్టారని, కానీ ఆమె ఎలాంటి నేరం చేయలేదన్నారు. చైనా అధికారులు ఈ శిక్ష‌పై ఖచ్చితమైన కారణాలు బహిర్గతం చేయలేద‌ని చెప్పారు. జాంగ్ ఝాన్‌పై రెండోసారి కారణం లేకుండా కేసు పెట్టార‌ని, ఆమె వృత్తిని నిర్భ‌యంగా నిర్వ‌హిస్తూ, వాస్త‌వాల‌ను బ‌య‌ట‌పెడుతున్నందుకే ఇలా హింసిస్తున్నార‌ని న్యూయార్క్‌లోని కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ ఆసియా పసిఫిక్ డైరెక్టర్ బెహ్ లిహ్ యి అన్నారు. చైనా అధికారులు త‌క్ష‌ణ‌మే ఆమెను విడుదల చేసి, కేసులను కొట్టేయాల‌న్నారు. చైనాలో జర్నలిస్టులను త‌ర‌చూ జైలులో పెడుతున్నార‌ని, కనీసం 124 మంది మీడియా కార్యకర్తలు జైలులో ఉన్నారని ఆర్‌ఎస్‌ఎఫ్ ఆరోపించింది. 2025 ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో 180 దేశాల్లో చైనా 178వ స్థానంలో ఉన్న‌ట్లు తెలిపింది. జాంగ్ ఝాన్ శిక్షకు ముందు వారం చైనా పార్లమెంట్ ఆరోగ్య ఎమర్జెన్సీలకు త్వరగా స్పందించడానికి ఒక బిల్లును ఆమోదించింది. దీని ద్వారా ప్రజలు అధికారుల అనుమతి లేకుండా ఎమర్జెన్సీల గురించి నివేదించవచ్చు.

జాంగ్ ఝాన్ శిక్ష చైనాలో మీడియా స్వేచ్ఛ, మానవ హక్కులపై తీవ్ర ఆందోళన లేవనెత్తుతోంది. నిజాలు చెప్పే వారిని లక్ష్యంగా చేసుకుని, వారి నివేదికలకు వ్య‌తిరేకంగా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. 2020లో వుహాన్ నుంచి జాంగ్ ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని ప్ర‌పంచానికి అందించింది. కానీ, చైనా ప్రభుత్వం దాన్ని అణచివేసింది. మళ్లీ ఆమెను జైలుకు పంపడం, ఆమె చేస్తున్న ప‌నుల‌ను అడ్డుకోవ‌డానికి చేస్తున్న కుట్ర‌గా తెలుస్తోంది. చైనాలో 124 మంది జర్నలిస్టులు జైలులో ఉండటం, ప‌త్రికా స్వేచ్ఛ‌లో దేశం 178వ ర్యాంక్‌లో ఉండటం స్థానికంగా అణ‌చివేత ధోర‌ణి ఏ స్థాయిలో ఉందో స్ప‌ష్టం చేస్తోంది. ప్రపంచ దేశాలు, సంస్థలు చైనాపై ఒత్తిడి తెస్తేనే ఇలాంటి వారి విడుదల సాధ్య‌మ‌వుతుంది. ఈ ఘటన చైనాలో మానవ హక్కుల విధానాలపై మ‌రోసారి చ‌ర్చ‌కు తెర‌లేపింది.

కోవిడ్‌పై నిజాలు చెప్పిన‌ జ‌ర్న‌లిస్టుకు జైలు శిక్ష‌! - Tholi Paluku