Let's talk: editor@tmv.in
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే

Gaddamidi Naveen
14 ఆగస్టు, 2026

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘కళ్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాలపై రాష్ట్ర హైకోర్టు బుధవారం మధ్యంతర స్టే విధించింది. ఈ పథకాల అమలుపై నాలుగు వారాల పాటు స్టే కొనసాగుతుందని న్యాయస్థానం ఆదేశించింది.

ఈ పథకాల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోల రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ న్యాయవాది విజయ్‌ గోపాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంతో కోర్టు స్టే విధించింది. రాష్ట్ర శాసనసభ రూపొందించిన ప్రత్యేక చట్టం ఆధారంగా కాకుండా ప్రభుత్వం కేవలం జీవోల ద్వారా ఈ పథకాలను అమలు చేస్తోందని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

తెలంగాణలో 2014లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ‘కళ్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్‌’ పథకాలను ప్రారంభించింది. వివాహ సమయంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన వధువులకు ప్రారంభంలో రూ.51,000 ఒకేసారి ఆర్థిక సాయం అందించేవారు. ఆ త‌రువాత‌ 2018 మార్చి నాటికి ఈ సాయాన్ని ఒకేసారి రూ.1,00,116కు పెంచారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులను తగ్గించడం ‘కళ్యాణలక్ష్మి’ లక్ష్యం కాగా, మైనారిటీ వర్గాల బాలికల వివాహాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ‘షాదీ ముబారక్‌’ను ప్రవేశపెట్టారు. బాల్య వివాహాలను నిరోధించడంతో పాటు పేద కుటుంబాల వివాహ ఖర్చులకు అండగా నిలవడం కూడా ఈ పథకాల ఉద్దేశం.