
కళ్యాణదుర్గంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం.. ప్రారంభించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు
కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజల చెంతకే అత్యాధునిక వైద్య సేవలను తీసుకురావాలనే సంకల్పంతో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో భారీ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. పట్టణంలోని 'ప్రజావేదిక' వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన ప్రఖ్యాత బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రి వైద్య నిపుణులు పాల్గొని మహిళలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు.
కాగా కళ్యాణదుర్గం ప్రాంతంలోని మహిళలు క్యాన్సర్ సంబంధిత ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షల కోసం అనంతపురం, బెంగళూరు వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఈ క్రమంలో వారు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు ఈ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయించారు. అయితే ఉదయం నుంచే నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలకు బసవతారకం ఆసుపత్రి వైద్య బృందం అత్యాధునిక పరికరాలతో స్క్రీనింగ్ నిర్వహించి క్యాన్సర్ లక్షణాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిస్థాయిలో నయం చేయవచ్చని భయం వీడి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.
మరోవైపు కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం పట్ల తమకు ఉన్న నిబద్ధతకు ఈ శిబిరమే నిదర్శనమన్నారు. చాలామంది మహిళలు ఆర్థిక ఇబ్బందులు, దూరభారం వల్ల ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే వారి ముంగిటకే ఈ సేవలను తీసుకొచ్చాం. ఇంత భారీ సంఖ్యలో మహిళలు స్పందించడం చాలా ఆనందంగా ఉంది అని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని ఆరోగ్య శిబిరాలను గ్రామస్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
