Let's talk: editor@tmv.in
కళా వైభవానికి నిదర్శనం గుంటూరు అంతర్జాతీయ నాటకోత్సవాలు: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

కళా వైభవానికి నిదర్శనం గుంటూరు అంతర్జాతీయ నాటకోత్సవాలు: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Panthagani Anusha
9 ఫిబ్రవరి, 2026

గుంటూరు నగరం అంతర్జాతీయ స్థాయి కళా వైభవానికి వేదికైందని ప్రపంచ స్థాయి కళాకారుల ప్రదర్శనలతో నగరం ఒక అద్భుతమైన కళా పరిణామాన్ని ఆవిష్కరించిందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి కొనియాడారు. స్థానిక శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా,తెలుగు సమ్మేళన సంఘం నాటక పరిషత్తుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అంతర్జాతీయ నాటకోత్సవాలు” కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంతటి ప్రతిష్టాత్మక ఉత్సవాలను గుంటూరులో నిర్వహించేందుకు అహర్నిశలు కృషి చేసిన నిర్వాహకులు సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమం సందర్భంగా వేదికపై ప్రదర్శించిన నాటకాలు అత్యంత సహజసిద్ధంగా ఉన్నాయని, కళాకారులు తమ పాత్రల్లో జీవించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారని ఎమ్మెల్యే ప్రశంసించారు. రంగస్థలంపై వారు పండించిన భావోద్వేగాలు నేరుగా ప్రేక్షకుల హృదయాలను తాకాయని అద్భుతమైన ప్రతిభను కనబరిచిన కళాకారులకు పాదాభివందనం చేయాలనిపిస్తోందని ఆమె భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. కళాకారుల శ్రమ, అంకితభావం నాటక రంగానికి కొత్త ఊపిరి పోస్తున్నాయని పేర్కొన్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎల్లప్పుడూ కళలకు, కళాకారులకు పెద్దపీట వేస్తుందని వారికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కళ అనేది కేవలం వినోదానికే పరిమితం కాకుండా సమాజానికి విలువైన సందేశాలను అందించే గొప్ప శక్తివంతమైన మాధ్యమమని ఆమె గుర్తుచేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు,నైతిక విలువలు తరతరాలుగా నాటక, నృత్య, సంగీత వంటి కళారూపాల ద్వారానే ప్రపంచవ్యాప్త మయ్యాయని వివరించారు.

ఈ అంతర్జాతీయ నాటకోత్సవాల నిర్వహణ ద్వారా భారతదేశ ఖ్యాతితో పాటు తెలుగు భాషా–సంస్కృతుల ప్రతిష్టను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత నిర్వాహకులకే దక్కుతుందని ఆమె అభినందించారు. అదేవిధంగా దేశవిదేశాల నుంచి తరలివచ్చిన కళాకారులకు, అతిథులకు కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో అద్భుత ప్రదర్శనలను తాను ముందు వరుసలో ఉండి వీక్షించాలని ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు సాంస్కృతిక రంగ ప్రముఖులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.