

కళాకారుల కోసం క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు.. ఆరు క్లస్టర్లలో ఏర్పాటుకు చర్యలు
అటవీ సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తూనే సంప్రదాయ హస్తకళాకారుల జీవనోపాధికి భరోసా కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తొలిదశలో ఆరు ప్రధాన కళా క్లస్టర్ల పరిధిలో వుడ్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం వీటిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించారు.
కొండపల్లి, ఏటికొప్పాక, శెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరి, బొబ్బిలి ప్రాంతాల్లోని చెక్క కళాకారులకు అవసరమైన నాణ్యమైన కలపను నిరంతరం అందుబాటులో ఉంచేందుకు ఈ బ్యాంకులు పనిచేయనున్నాయి. ఇప్పటికే గోదాముల గుర్తింపు, కలప సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. కళాకారులకు లాభాపేక్ష లేకుండా కలప సరఫరా చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల క్వార్టర్స్‌ను వుడ్ బ్యాంకుగా మార్చారు. కొండపల్లి బొమ్మల తయారీకి అవసరమైన తెల్లపొనికి కలపను సేకరిస్తున్నారు. ఏటికొప్పాకలో కళాకారులకు తక్షణ సేవలు అందించేందుకు ప్రైవేట్ భవనాన్ని అద్దెకు తీసుకుని వుడ్ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 1.5 ఘనపు మీటర్ల అంకుడు కలప సిద్ధం చేశారు.
శెట్టిగుంటలో లేపాక్షి హ్యాండ్‌క్రాఫ్ట్ సొసైటీ కామన్ ఫెసిలిటీ సెంటర్‌ను వుడ్ బ్యాంకుగా గుర్తించి 50 ఘనపు మీటర్ల టేకు, 150 ఘనపు మీటర్ల నాన్-టేకు కలప సిద్ధం చేశారు. మాధవమాలలో పాత ఎర్రచందనం డిపోను వుడ్ బ్యాంకుగా అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ నారియేపి, ఆకేసియా కటేచు కలపను సమీకరించారు.
ఉదయగిరిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ క్వార్టర్స్‌ను వుడ్ బ్యాంకుగా మార్చగా, బొబ్బిలి వీణల కళాకారుల కోసం గొల్లపల్లి క్రాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఎంపిక చేశారు. అక్కడ పనస, రోజ్‌వుడ్ కలప సిద్ధంగా ఉంది.
రాజమహేంద్రవరం ధవళేశ్వరం సమీపంలోని సామిల్ వద్ద సెంట్రల్ వుడ్ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో వెదురు బొంగులు, రోజ్‌వుడ్, టేకు అందుబాటులో ఉంటాయి. ఏలూరు జిల్లా కాపవరంలో ఎడ్లబండ్ల తయారీ కళాకారులకు అవసరమైన టేకు, ఇతర కలపను అందించే వుడ్ బ్యాంకును కూడా ఏర్పాటు చేయనున్నారు.
క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల పురోగతిపై పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్షించారు. అటవీ వనరులను పరిరక్షించడంతో పాటు సంప్రదాయ కళలను, కళాకారుల జీవనోపాధిని కాపాడేలా ఈ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు.
