
కల్వకుంట్ల కవిత “జాగృతి జనం బాట” పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అక్టోబర్ 25 నుండి ఫిబ్రవరి 13 వరకు మొత్తం నాలుగు నెలల పాటు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం, బీజేపీ ఎంపీలపై విమర్శలు
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపైనా కవిత విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఏ ఒక్క రంగం కూడా సంతృప్తికరంగా లేదని, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచినా, కేంద్రం నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి అదనంగా తీసుకురాలేకపోయారని విమర్శించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఫలాలు ఇప్పుడు ప్రజలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కవిత మాట్లాడుతూ, జాగృతి సంస్థ ఎప్పటి నుంచీ ప్రజల సమస్యల పట్ల కట్టుబడి ఉందని, ఇటీవల గ్రూప్-1 అభ్యర్థుల సమస్యపై కూడా పోరాటం చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతోందని, గ్రామాల్లో యూరియా కొరత నుండి పట్టణాల వరకు అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదని విమర్శించారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణకు ఏ సహాయం చేయలేదని, 8 ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు.
నైతికతతోనే ఆ నిర్ణయం
కేసీఆర్ ప్రభుత్వ కాలంలో ప్రజలకు చేరిన పథకాలు, ఫలితాలు ఇప్పుడు అందడం లేదని, కేసీఆర్ కిట్స్ వంటి పథకాలు నిలిచిపోయాయని తెలిపారు. “ప్రత్యేక తెలంగాణ ఫలితాలు ప్రజలకు అందని పరిస్థితికి బాధ్యులు ఎవరు?” అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత తాను స్వతంత్రంగా ముందుకు సాగుతున్నానని, జాగృతి సంస్థలో కేసీఆర్ ఫోటో లేకుండా యాత్ర చేయడం నైతికంగా సరైన నిర్ణయమని కవిత స్పష్టం చేశారు. “కేసీఆర్ కూతురుగా పుట్టడం నా అదృష్టం. కానీ నేను పార్టీ సభ్యురాలు కాదన్న కారణంగా ఆయన ఫోటో పెట్టడం సరికాదు” అని ఆమె వివరించారు.
సామాజిక తెలంగాణ కోసమే ‘జనం బాట’
సామాజిక తెలంగాణ సాధనమే తన యాత్ర లక్ష్యమని కవిత చెప్పారు. “సామాజిక, ఆర్థిక, రాజకీయంగా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు రావాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓసీ వర్గాల పేదలు, మహిళలు, యువత కూడా అభివృద్ధి చెందాలి” అని ఆమె అన్నారు. ఈ యాత్రలో ప్రతి జిల్లాలో రెండు రోజులు గడుపుతూ రైతులు, మహిళలు, యువత, మేధావులతో చర్చలు జరిపి ప్రజల ఆలోచనలు తెలుసుకుంటానని తెలిపారు. తెలంగాణలో జరిగిన త్యాగాలు వృథా కాకుండా, ఆ ఆశయాలకు అనుగుణంగా సామాజిక తెలంగాణ సాధన కోసం తాను కృషి చేస్తానని కవిత హామీ ఇచ్చారు.
జాగృతితోనే
తెలంగాణ ఉద్యమానికి మూలంగా ఉన్న “ఆత్మగౌరవం” అనే భావనను తిరిగి ప్రేరేపించడం కూడా ఈ యాత్రలో ప్రధాన లక్ష్యం. రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసిన ఆ చైతన్యాన్ని ప్రజల్లో మళ్లీ రగిలించి, ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో తెలంగాణ గర్వాన్ని గుర్తుచేయడమే ఆమె ప్రయత్నం. ఈ దిశగా జాగృతి వేదికను ఉపయోగిస్తూ, యువత, మహిళలు, రైతులు, కార్మికులు వంటి వర్గాలకు దగ్గర కావాలని ఆమె సంకల్పించారు. కవిత యాత్ర మరో ముఖ్య ఉద్దేశ్యం ప్రజల మధ్యలో తన స్వీయ గుర్తింపును బలపరచుకోవడం. “జాగృతిని మళ్లీ బలపరుస్తాం. కొత్త సభ్యులను చేర్చుకుంటాం. జాతీయ పార్టీల వైఫల్యం స్పష్టమైంది. ప్రజలే గురువులు, ప్రజలే దారి చూపించే శక్తి. అందుకే ప్రజల మధ్యకే వెళ్తున్నాం.” జాగృతి జనం బాట యాత్ర అక్టోబర్ 25న నిజామాబాద్ నుంచి ప్రారంభం కానుంది.
