Let's talk: editor@tmv.in
కల్యాణ లక్ష్మి ప‌క్క‌దారి.. కాగ్ సంచలన నివేదిక

కల్యాణ లక్ష్మి ప‌క్క‌దారి.. కాగ్ సంచలన నివేదిక

Gaddamidi Naveen
2 ఏప్రిల్, 2026

తెలంగాణలో పేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం ఆర్థిక సాయం అందించే 'కల్యాణ లక్ష్మి' పథకం అమలులో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో వెల్లడించింది. పారదర్శకత లేకపోవడం, సరైన పర్యవేక్షణ లోపించడం వల్ల కోట్లాది రూపాయల నిధులు అర్హత లేని లబ్ధిదారులు కూడా పథకం ప్రయోజనాలు పొందినట్లు గుర్తించింది.

కల్యాణ లక్ష్మి పథకాన్ని 2014లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పేద తల్లిదండ్రులపై పెళ్లి భారాన్ని తగ్గించడానికి రూ. 1,00,116 ఆర్థిక సాయంతో ప్రారంభించింది. 2022 మార్చి నాటి వరకు ఉన్న గణాంకాలను విశ్లేషించిన కాగ్, నివేదికలో, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల రికార్డులను పరిశీలించినప్పుడు పథకం అమలులో సరైన నియంత్రణలు లేవని పేర్కొంది. అర్హులైన వారికి మాత్రమే ప్రయోజనం చేరేలా వ్యవస్థలో తగిన భద్రతా చర్యలు లేకపోవడం గమనించబడింది.

ఈ లోపాల కారణంగా బాల్య వివాహాలు జరిగిన సందర్భాల్లో, ఆదాయ పరిమితిని మించిన కుటుంబాలు, అలాగే పథకం ప్రారంభానికి ముందే వివాహం జరిగిన వధువులు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందినట్లు కాగ్ గుర్తించింది. మొత్తం 5,522 కేసులను పరీక్షించిన ఆడిట్‌లో రూ.55.12 కోట్ల మేర నిధులు అర్హత లేని వారికి వెళ్లినట్లు వెల్లడైంది. అదనంగా, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వివిధ సంక్షేమ పథకాల డేటాబేస్‌లను పరస్పరం సమన్వయం చేసే వ్యవస్థ లేకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు ఏర్పడ్డాయని నివేదిక పేర్కొంది. దీంతో ఒకే వ్యక్తి పలు పథకాల ప్రయోజనాలను పొందే అవకాశం పెరిగింది.

లబ్ధిదారులతో సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ లేకపోవడం, ఫిర్యాదు పరిష్కార విధానం బలహీనంగా ఉండటం వల్ల దరఖాస్తుల స్థితి తెలుసుకునేందుకు ప్రజలు తహసీల్దార్ కార్యాలయాలకు పలుమార్లు వెళ్లాల్సి వచ్చినట్లు నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా, నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో సాయం జమ చేసే ఆన్‌లైన్ విధానం లేకపోవడంతో చెక్కుల పంపిణీలో ఆలస్యం జరిగినట్లు తెలిపింది. అయితే, ప్రస్తుతం వెల్లడైన లోపాలను సరిదిద్దకపోతే ప్రభుత్వ లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉందని కాగ్ హెచ్చరించింది. ప్రభుత్వం వెంటనే ఆన్‌లైన్ నగదు బదిలీ విధానాన్ని అమలు చేయాలని పర్యవేక్షణను కఠినతరం చేయాలని సూచించింది.