Let's talk: editor@tmv.in
కల్తీ రాయుళ్లపై 'హై-ఫాస్ట్ ' ఉక్కుపాదం: హైదరాబాద్‌లో 60 మందికి పైగా అరెస్ట్

కల్తీ రాయుళ్లపై 'హై-ఫాస్ట్ ' ఉక్కుపాదం: హైదరాబాద్‌లో 60 మందికి పైగా అరెస్ట్

Gaddamidi Naveen
2 ఏప్రిల్, 2026

భాగ్యనగరంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ మాఫియాపై తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు సమరశంఖం పూరించారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి నగరానికి ఐకానిక్ అయిన ఉస్మానియా బిస్కెట్ల వరకు.. ప్రతి వస్తువులోనూ కల్తీకి పాల్పడుతున్న ముఠాలను కొత్తగా ఏర్పడిన 'హై-ఫాస్ట్ ' బృందం మట్టుబెట్టింది. మార్చి నెలలో నిర్వహించిన ఈ మెరుపు దాడుల్లో 60 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేశారు.

మార్చి 30 వరకు అందిన అధికారిక గణాంకాల ప్రకారం, నగరంలో ఆహార కల్తీపై మొత్తం 61 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 64 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, సుమారు 14,685 కిలోల ఘన పదార్థాలు, 400 లీటర్ల ద్రవ రూపంలో ఉన్న కల్తీ ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిత్యం మనం వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఐస్ క్రీములు, పనీర్, పాల ఉత్పత్తులు, టీ పౌడర్, చికెన్, మాంసం, పెరుగు, చిప్స్, సమోసాలు, నెయ్యి, నూనె వంటి వస్తువుల్లో భారీగా కల్తీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీటి తయారీలో అత్యంత నాసిరకం ముడి పదార్థాలను, హానికరమైన రసాయనాలను వాడుతున్నట్లు తేలింది.

హై-ఫాస్ట్ ఏర్పాటు - సీపీ సజ్జనార్ హెచ్చరిక

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ నేతృత్వంలో ఈ ప్రత్యేక హై-ఫాస్ట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లు కలిపి మొత్తం 28 మంది సిబ్బంది ఉంటారు. వీరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో కలిసి నిరంతరం నిఘా ఉంచుతారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ఆహార కల్తీ అనేది కేవలం నేరం మాత్రమే కాదు, ఇది ప్రతి ఇంటిపై జరుగుతున్న నిశ్శబ్ద దాడి. మన పిల్లలకు మనం ప్రేమతో ఇచ్చే బిస్కెట్లు, ఐస్ క్రీముల్లో విషం కలుపుతున్నారు. లాభాల కోసం పసిపిల్లల ప్రాణాలతో ఆడుకునే వారి విషయంలో సహించేది లేదు జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తాం అని తీవ్రంగా హెచ్చరించారు.

దాడుల్లో వెలుగుచూసిన భయంకరమైన నిజాలు

దాడుల సమయంలో అనేక యూనిట్లు అత్యంత అస్వచ్ఛ పరిస్థితుల్లో నడుస్తున్నట్లు బయటపడింది. ముఖ్యంగా కాటేదాన్ ప్రాంతంలో ఉన్న ఒక యూనిట్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి, రెస్టారెంట్లు, రిటైల్ దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అక్కడ సరైన ఆహార భద్రత ప్రమాణాలు లేకపోవడంతో పాటు నాసిరకం పదార్థాలు వినియోగిస్తున్నట్లు తేలింది.

మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన దాడుల్లో శాస్త్రీయ నిబంధనలు పాటించకుండా, హానికరమైన రంగులు వాడుతూ ఉస్మానియా బిస్కెట్లు, చిక్కీలు, నంకీన్ తయారు చేస్తున్నట్లు తేలింది. వీటిని స్థానిక మార్కెట్లకు సరఫరా చేస్తున్నారని అధికారులు తెలిపారు.

ముషీరాబాద్ ప్రాంతంలో ఉన్న ఒక ఐస్‌క్రీమ్ తయారీ యూనిట్‌లో పెద్ద ఎత్తున నాసిరకం ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్నట్లు బయటపడింది. వివిధ రుచులతో తయారు చేసిన ఈ ఐస్‌క్రీమ్‌లు నాణ్యత ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకో ఘటనలో ముసాపేట్ ప్రాంతంలో కుళ్లిపోయిన కోడిమాంసాన్ని నిల్వ చేసి, స్థానిక వ్యాపారులకు సరఫరా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. ఇది ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా భావించిన అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు.

ఇవే కాకుండా, కొబ్బరి పొడి, పచ్చళ్లు, బేకరీ వస్తువులను అత్యంత అసహ్యకరమైన పరిస్థితుల్లో తయారు చేస్తున్న పలు యూనిట్లను కూడా అధికారులు సీజ్ చేశారు. ఈ యూనిట్లు ఆహార భద్రత నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయని వెల్లడైంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహార కల్తీని అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో ఈ దాడులు మరింత ఉధృతం చేస్తామని, ప్రజలు కూడా అనుమానిత యూనిట్లపై సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు.

కల్తీ రాయుళ్లపై 'హై-ఫాస్ట్ ' ఉక్కుపాదం: హైదరాబాద్‌లో 60 మందికి పైగా అరెస్ట్ - Tholi Paluku