Let's talk: editor@tmv.in
కల్తీ మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం రేవంత్‌రెడ్డి

కల్తీ మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం రేవంత్‌రెడ్డి

Gaddamidi Naveen
31 మార్చి, 2026

రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే ఆహార కల్తీ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆహార కల్తీని పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈగల్, హైడ్రా తరహాలోనే ఆహార భద్రత కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా అమలవుతున్న కల్తీ నిరోధక చట్టాలను అధ్యయనం చేసి, మరింత పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో 3.39 కోట్ల మందికి పంపిణీ అవుతున్న సన్నబియ్యం పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో శాసనసభ సెంట్రల్ హాలులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు సన్నబియ్యంతో భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రేషన్ షాపుల ద్వారా దొడ్డు బియ్యం ఇచ్చేవారు. కానీ వాటిని తినేవారు లేకపోవడంతో, ఆ బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చి రీ-సైక్లింగ్ చేసే మాఫియా పెరిగిపోయింది. దీనివల్ల ప్రభుత్వానికి ఖర్చు తప్ప పేదలకు ఒరిగేదేమీ లేదు. అందుకే పేదలు కూడా నాణ్యమైన అన్నం తినాలనే ఉద్దేశంతో ఈ సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించాం అని వివరించారు.

రైతులను ప్రోత్సహించేందుకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించి సన్నవడ్లు పండించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అవసరమైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు జారీ చేసి, పథకాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఇదే విధంగా రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.

అదేవిధంగా పంట మార్పిడి విధానాలపై రైతుల్లో అవగాహన పెంచి, వాణిజ్య పంటల వైపు వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం సమగ్ర విధానాలతో ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. ఆహార భద్రతతో పాటు ఆహార స్వచ్ఛతను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన నొక్కి చెప్పారు.