Let's talk: editor@tmv.in
కల్తీ మద్యానికి కర్త, కర్మ, క్రియ జగనే

కల్తీ మద్యానికి కర్త, కర్మ, క్రియ జగనే

FL - SUNL
8 అక్టోబర్, 2025

పురాణాల్లో దేవుళ్లు మంచి పనులు చేస్తుంటే రాక్షసులు అడ్డుపడినట్టు.. సీఎం చంద్రబాబు మంచి పనులు చేస్తుంటే జగన్ అడ్డుపడుతున్నాడని మాజీ మంత్రి, ఏపీ డబ్ల్యూసీఎఫ్‌సీ ఛైర్ పర్సన్ పీతల సుజాత మండిపడ్డారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లోనే సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ లకి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని, 2.42 కోట్ల మంది మహిళల కోసం స్త్రీ శక్తి పథకాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 10 కోట్ల మంది మహిళలు, విద్యార్థినులు ఉచిత బస్సులో ప్రయాణించారని తెలిపారు. ఇప్పటివరకు రూ.400 కోట్లకుపైగా వారికి ఆదా అయిందని, ప్రతి ఇంటికి స్త్రీ శక్తి పథకం ద్వారా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు లబ్ధి చేకూరుతుందని వివరించారు.

కల్తీ మద్యం వల్ల అనేక మంది చనిపోయారు

కల్తీ మద్యంపై విమర్శించే హక్కు వైసీపీకి, జగన్‌కు లేదని పీతల సుజాత విమర్శించారు. కల్తీ మద్యాన్ని పట్టుకున్నదే టీడీపీ ప్రభుత్వమని స్పష్టం చేశారు. నిందితుల్లో టీడీపీకి చెందిన వారు ఉన్నారని తెలిసిన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. కానీ జగన్ ఐదేళ్ల పాటు వైసీపీ నేతలు ఎన్ని నేరాలు చేసినా ఒక్కరినీ కూడా సస్పెండ్ చేయలేదని గుర్తు చేశారు. కల్తీ మద్యాన్ని ప్రోత్సహించి జే బ్రాండ్స్‌ను ప్రమోట్ చేసిందే జగన్ అని ఆరోపించారు. కల్తీ మద్యానికి కర్త, కర్మ, క్రియ అంత జగన్ అని, జంగారెడ్డిగూడెంలో 27 మంది అన్యాయంగా కల్తీ మద్యం తాగి చనిపోయారని విమర్శించారు. ఆ కల్తీ మద్యం తయారు చేసింది వైసీపీ వాళ్లు అని.. సీఎంగా ఉన్న జగన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. దళిత డ్రైవర్ ను ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేస్తే అతనిపై చర్యలు తీసుకున్నారా జగన్ అని ప్రశ్నించారు. 15 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని సుజాత పేర్కొన్నారు.

కల్తీ మద్యానికి కర్త, కర్మ, క్రియ జగనే - Tholi Paluku