Let's talk: editor@tmv.in
క‌ల్తీ మ‌ద్యం కేసు వ‌దిలించుకోవ‌డం సాధ్యమేనా?

క‌ల్తీ మ‌ద్యం కేసు వ‌దిలించుకోవ‌డం సాధ్యమేనా?

FL - BRTH
8 అక్టోబర్, 2025

క‌ల్తీ మ‌ద్యం కేసు టీడీపీ మెడ‌కు చుట్టుకుంది. దానిని వ‌దిలించుకునేందుకు టీడీపీ తీవ్ర ప్ర‌య‌త్నం చేస్తోంది. కానీ వ‌ద‌లించుకోవ‌డం సులువు కాద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎందుకంటే సాక్షాత్తు టీడీపీకి సంబంధించిన ఒక నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ పాత్ర తెర‌మీద‌కి రావ‌డం, తెలుగుదేశం రాష్ట్రంలో అధికారంలో ఉండ‌టం స‌మ‌స్య టీడీపీకి చుట్టుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. ఇదంతా తెలుగుదేశానికి తెలియ‌కుండా జ‌రిగిందా ?. జ‌రుగుతోందా అన్న ప్ర‌శ్న‌లు సాధార‌ణంగానే వినిపిస్తాయి. టీడీపీ మాత్రం వైసీపీ మీదికి నెపం నెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. కానీ టీడీపీ వాద‌న చూడ్డానికి, విన‌డానికి.. ముచ్చ‌ట‌గా లేద‌ని ప్ర‌జ‌లు మాట్లాడుకుంటున్నారు.

తంబ‌ళ్ల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం, ముల‌క‌ల‌చెరువు స‌మీపంలో క‌ల్తీ మ‌ద్యం త‌యారీ కేంద్రం గుట్టు ర‌ట్ట‌వ్వ‌డంతో తెలుగుదేశం ఇరుకున‌ప‌డింది. ఇందులో తంబ‌ళ్ల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ జ‌య‌చంద్ర‌రెడ్డి పాత్ర ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ ఆయ‌న్ని స‌స్పెండ్ చేసింది. కానీ జ‌య‌చంద్ర‌రెడ్డి విష‌యంలో కొత్త వాద‌న తెర‌మీద‌కి తెచ్చింది. జ‌య‌చంద్రారెడ్డి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి శిష్యుడ‌ని ఆరోపిస్తోంది. ఇదంతా పెద్దిరెడ్డి, జ‌గ‌న్ కుట్ర అంటూ మాట్లాడుతోంది. కానీ వైసీపీ మాత్రం గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇస్తోంది. జ‌య‌చంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మ‌నిషి అయితే, టీడీపీలోకి ఎందుకు చేర్చుకున్నారు ?. 2024 ఎన్నిక‌ల్లో శంక‌ర్ యాద‌వ్ ను కాద‌ని జ‌య‌చంద్రారెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చారు ? . ఎన్నిక‌ల త‌ర్వాత తంబ‌ళ్ల‌ప‌ల్లి నియెజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇంచార్జీగా ఎందుకు నియ‌మించారు ? అన్న‌ది వైసీపీ ప్ర‌శ్న‌లు. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని వైసీపీ డిమాండ్ చేస్తోంది.

కానీ టీడీపీ నుంచి మాత్రం స‌మాధానం శూన్యం. ఎందుకంటే ఒక నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ, ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన అభ్య‌ర్థి వైసీపీ మ‌నిషి అంటే ఎవ‌రూ న‌మ్మ‌రు. ఒక‌వేళ వైసీపీ మ‌నిషి అని అనుకంటే.. అత‌ను వైసీపీ మ‌నిషి తెలికుండా పార్టీలోకి చేర్చుకున్నారా ?. పెద్దిరెడ్డి మ‌నిషి అని తెలిసాక చేర్చుకున్నారా?. అన్నీ తెలిసి 2024 ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చారా ?. ఎన్నిక‌ల త‌ర్వాత ఇంచార్జీ ప‌ద‌వి ఇచ్చారా ? అన్న ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. వైసీపీ వారికి టికెట్ ఇచ్చే సంప్రదాయం టీడీపీలో ఎప్పుడు మొద‌లైంద‌ని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

త‌ప్పు చేసి దొరికిపోతే వైసీపీ మ‌నిషి.. దొర‌క్క‌పోతే టీడీపీ నేతా అన్నది వైసీపీ ప్ర‌శ్న‌. వైసీపీ నుంచే కాదు. సామాన్యుల‌కు కూడా క‌లిగే ప్ర‌శ్న‌లు ఇవి. క‌ల్తీ మ‌ద్యం త‌యారీ జ‌రుగుతుంటే ఇంటిలిజెన్స్ స‌మాచారం ప్ర‌భుత్వం వ‌ద్ద ఉండదా ?. ఇంటిలిజెన్స్ వ్య‌వ‌స్థ అంత బ‌ల‌హీనంగా ఉందా ?. తెలిసి జ‌రిగిందా ?.. తెలియ‌క జ‌రిగిందా ? . వీట‌న్నింటిపై ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానికి ఉంది. కానీ వైసీపీ మీద నెపం నెట్ట‌డం న‌మ్మ‌శ‌క్యంగా లేద‌న్న వాద‌న ప్ర‌జ‌ల్లో వినిపిస్తోంది. త‌ప్పు జ‌రిగింది. దానిని స‌రిదిద్దుకోవాలి. బాధ్యుల‌ను శిక్షించాలి. కానీ టీడీపీ క‌ల్తీ మ‌ద్యంపై న‌మ్మ‌శ‌క్యం కానీ ఆరోప‌ణ‌లు వైసీపీపై చేయ‌డం మ‌రింత అనుమానానికి తావిస్తోంది. మ‌రోవైపు క‌ల్తీ మ‌ద్యం తెర‌మీద‌కి రావ‌డంతో వైసీపీపై చేస్తున్న‌ లిక్క‌ర్ స్కామ్ ఆరోప‌ణ‌లు కూడా మ‌రింత ప‌లుచ‌గా మారిపోతున్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది.

క‌ల్తీ మ‌ద్యం కేసు వ‌దిలించుకోవ‌డం సాధ్యమేనా? - Tholi Paluku