Let's talk: editor@tmv.in
కల్తీ పాల ఘటన… రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

కల్తీ పాల ఘటన… రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

Panthagani Anusha
27 మార్చి, 2026

తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ పాల ఘటన పెను విషాదాన్ని నింపింది. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలైన లాలచేరు, చౌడేశ్వరన్నగర్, స్వరూప్‌నగర్‌లలో ఫిబ్రవరి మధ్యకాలం నుంచి మొదలైన ఈ మరణాల పరంపర రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పటివరకు కలుషిత పాలు సేవించి 16 మంది ప్రాణాలు కోల్పోగా మరికొందరు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సువో మోటోగా స్పందించి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

కాగా పోలీసుల ప్రాథమిక విచారణలో భాగంగా నర్సాపురం గ్రామ పరిధిలోని 'వరలక్ష్మీ మిల్క్ డెయిరీ' నుంచి సరఫరా అయిన పాలలో అత్యంత ప్రమాదకరమైన ఎథిలిన్ గ్లైకాల్ అనే రసాయనం కలిసినట్లు అధికారులు గుర్తించారు. సాధారణంగా పారిశ్రామిక అవసరాలకు వాడే ఈ రసాయనం శరీరంలోకి చేరగానే విషంగా మారి బహుళ అవయవాల వైఫల్యానికి దారితీస్తుంది. ముఖ్యంగా బాధితుల్లో కిడ్నీలు పూర్తిగా దెబ్బతిని మూత్రం ఆగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ రసాయనం మానవ శరీరంలోకి ప్రవేశించినప్పుడు రక్తాన్ని ఆమ్లయుతంగా మార్చి, మూత్రపిండాల కణాలను దెబ్బతీస్తుందని వైద్యులు వెల్లడించారు.

ఈ కల్తీ పాలను సుమారు 106 కుటుంబాలు వినియోగించినట్లు ఎపిడెమియాలజీ దర్యాప్తులో తేలింది. ఫిబ్రవరి 22న రాజమహేంద్రవరం కిమ్స్ ఆసుపత్రికి ఒక్కసారిగా బాధితులు పోటెత్తడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మరణించిన వారిలో బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులు, వృద్ధులే ఉండటం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. బాధితులకు అత్యవసరంగా డయాలిసిస్ నిర్వహించాల్సి వస్తోంది. ఘటన తీవ్రతను గమనించిన అధికారులు తక్షణమే సదరు డెయిరీ నుంచి పాల సరఫరాను నిలిపివేసి, నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

మీడియా కథనాల ఆధారంగా ఈ ఘటనను తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ పరిగణించింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు పంపింది. రెండు వారాల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బాధితుల ఆరోగ్య స్థితిగతులు, మృతుల కుటుంబాలకు అందించిన పరిహారం ఈ ఘాతుకానికి ఒడిగట్టిన బాధ్యులపై తీసుకున్న క్రిమినల్ చర్యల వివరాలను నివేదికలో పొందుపరచాలని కమిషన్ స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా ఈ విషాదం రాష్ట్రంలోని ఆహార భద్రతా విభాగం తీరును ప్రశ్నార్థకం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా అయ్యే పాల నాణ్యతను పర్యవేక్షించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాభాపేక్షతో ప్రజల ప్రాణాలను బలిగొనే ఇటువంటి కల్తీ డెయిరీల వెనుక ఉన్న సూత్రధారులను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.