Let's talk: editor@tmv.in
కల్తీ పాల ఘటన: ఐదుకు చేరిన మృతుల సంఖ్య

కల్తీ పాల ఘటన: ఐదుకు చేరిన మృతుల సంఖ్య

Panthagani Anusha
27 ఫిబ్రవరి, 2026

తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ పాలు ఘటన మరింత విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనలో తాజాగా మరో బాధితురాలు మృతి చెందడంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. గాంధీపురం ప్రాంతానికి చెందిన 76 ఏళ్ల మహిళ తీవ్ర మూత్రపిండ సమస్యలతో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఇప్పటికీ 15 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలువురికి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడగా కొందరు వెంటిలేటర్ సహాయంతో వైద్యం పొందుతున్నారు. అనురియా, వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలతో బాధితులు ఆసుపత్రుల్లో చేరిన విషయం తెలిసిందే. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా, సీరం క్రియేటినిన్ స్థాయిలు అధికంగా నమోదైనట్లు వైద్యులు తెలిపారు.

కాగా నరసాపురం గ్రామంలోని ప్రైవేట్ డెయిరీ నుంచి సరఫరా చేసిన పాలు సేవించడమే అనారోగ్యానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే. సంబంధిత డెయిరీ యూనిట్‌ను ఇప్పటికే సీజ్ చేయగా అనుమానిత పాల విక్రేతను అదుపులోకి తీసుకున్నారు. నమూనాలపై ప్రయోగశాల పరీక్షలు కొనసాగుతున్నాయి.

ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. పంపిణీ నెట్‌వర్క్‌పై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రయోగశాల నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

కల్తీ పాల ఘటన: ఐదుకు చేరిన మృతుల సంఖ్య - Tholi Paluku