Let's talk: editor@tmv.in
కల్తీ కల్లు తాగి 15 మందికి అస్వస్థత

కల్తీ కల్లు తాగి 15 మందికి అస్వస్థత

Panthagani Anusha
19 జనవరి, 2026

మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని వనకబాడి గ్రామంలో కల్తీ కల్లు ఘటన కలకలం రేపింది.నిషేధించిన పద్ధతుల్లో అక్రమంగా తయారు చేసిన కల్లును తాగడంతో ఒకే గ్రామానికి చెందిన సుమారు 15 మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. కల్లు తాగిన కొద్దిసేపటికే బాధితులకు వాంతులు, విరేచనాలు, తీవ్రమైన తలనొప్పి మొదలవడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. పలువురు స్పృహతప్పి పడిపోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

మరోవైపు బాధితుల్లో జె.నీలకంఠం (37), పువ్వల రాంసింగ్ (25), జె.జోగారావు (38), జె.భూషణరావు (54) అనే నలుగురి పరిస్థితి విషమంగా మారడంతో అధికారులు వారిని వెంటనే స్ట్రెచర్‌లపై కురుపాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో జోగారావుకు రక్తపోటు (బిపి) 160/100 కు పెరగడంతో వైద్యులు ఆయనను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ఇక ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే దుద్దుకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్య బృందం వనకబాడికి చేరుకుంది. గ్రామంలో అత్యవసర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందించారు. తనిఖీల సమయంలో జె.గౌరీశంకర్, జె.రమేష్, ఎం.లింగారావు, పి.రామమూర్తి సహా మరికొందరు అదే కల్లు తాగినట్లు గుర్తించారు. వీరికి ప్రస్తుతానికి తీవ్ర లక్షణాలు లేనప్పటికీ, ముందుజాగ్రత్తగా ఓఆర్‌ఎస్ (ఓ ఆర్ఎస్) ప్యాకెట్లు, అవసరమైన మందులు పంపిణీ చేశారు.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ బాధితులందరికీ మెరుగైన వైద్యం అందుతోందని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తూ వైద్య ఆరోగ్య శాఖకు దిశానిర్దేశం చేశారు. కల్తీ కల్లు తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. అక్రమ కల్లు తయారీ విక్రయాల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు వీటిని సేవించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అక్రమ వ్యాపారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా యంత్రాంగం వెల్లడించింది.