
కలిసి పనిచేస్తాం..డీఎంకే కూటమిని ఓడిస్తాం: పీయూష్ గోయల్
తమిళనాడులో అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే)లో చేరడాన్ని బీజేపీ స్వాగతించింది. ఈ సందర్భంగా బీజేపీ తమిళనాడు ఎన్నికల ఇన్‌చార్జ్ పీయూష్ గోయల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత వ్యతిరేక డీఎంకే ప్రభుత్వాన్ని ఓడించేందుకు ఎన్డీయే కూటమి మొత్తం కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. డీఎంకే ప్రభుత్వాన్ని అవినీతిగ్రస్తం, అర్హతలేని ప్రభుత్వంగా పేర్కొన్న గోయల్, అది తమిళనాడు ప్రజలపై, తమిళ గౌరవంపై దాడి చేస్తోందని ఆరోపించారు. మంచి పాలన, సామాజిక న్యాయం, యువతకు అవకాశాలు కల్పించడం, తమిళ భాషా–సంస్కృతుల ప్రోత్సాహమే ఎన్డీయే లక్ష్యమని ఆయన తెలిపారు. చెన్నైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీయూష్ గోయల్ మాట్లాడుతూ నా మంచి మిత్రుడు, సీనియర్ నేత టీటీవీ దినకరన్ తిరిగి ఎన్డీయే కుటుంబంలో చేరడం నాకు ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉందని అన్నారు.
యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం
అతను ఇంకా మాట్లాడుతూ ఎన్డీయేలో ఏఐఏడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి, అన్బుమణి రామదాస్‌తో పాటు ఇతర సహచరులు అందరూ కలిసి అవినీతిగ్రస్తమైన, పనికిరాని డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కట్టుబడి ఉన్నారు. ఈ ప్రభుత్వం తమిళనాడు ప్రజలపై, తమిళ గౌరవంపై దాడి చేస్తోంది. ఎన్డీయే కూటమి తమిళనాడు ప్రజలకు సామాజిక న్యాయం అందిస్తుంది. అలాగే తమిళనాడు యువతకు మంచి అవకాశాలు కల్పిస్తాం. తమిళ భాష, సంస్కృతిని ప్రపంచమంతటా విస్తరించేలా చూస్తామని చెప్పారు. ఇంతకుముందు ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పీయూష్ గోయల్‌ను కలిశారు. ఈ సమావేశం అనంతరం ఆయన తమిళనాడులో అధికారికంగా ఎన్డీయేలో చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జనవరి 23న తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా మధురాంతకం ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు బీజేపీ తన ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తోంది. తమిళనాడులో ఏఐఏడీఎంకే–బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, అధికార డీఎంకే–కాంగ్రెస్ కూటమిని ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ తన పార్టీ ‘తమిళ వెట్రి కజగం (టీవీకే)’ను ప్రారంభించడంతో ఈ ఎన్నికలు త్రిముఖ పోరుగా మారనున్నాయి. తమిళనాడులో ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచార వ్యూహాలు, ఎన్నికల హామీలను ప్రకటిస్తూ రాజకీయ కార్యకలాపాలను ఉద్ధృతం చేస్తున్నాయి.
డీఎంకేలో చేరిన ఏఐఏడీఎంకే మాజీ మంత్రి ఆర్. వైతిలింగం
ఏఐఏడీఎంకే మాజీ మంత్రి ఆర్. వైతిలింగం బుధవారం డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను కలసి, అధికారికంగా అధికార పార్టీ డీఎంకేలో చేరారు. ఓ. పన్నీర్ సెల్వం నేతృత్వంలోని ఏఐఏడీఎంకే వర్గానికి గట్టి మద్దతుదారుడిగా ఉన్న వైతిలింగం, తంజావూరు జిల్లా ఒరతనాడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను కలసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, సీనియర్ డీఎంకే నేతలు కె.ఎన్. నెహ్రూ, టీకేఎస్ ఇలంగోవన్ తదితరుల సమక్షంలో వైతిలింగం స్టాలిన్‌కు స్వాగతం పలికారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన వైతిలింగం, ఎడప్పాడి కె. పళనిస్వామి నాయకత్వంలో ఏఐఏడీఎంకే సమర్థవంతంగా పనిచేయడం లేదని తీవ్రంగా విమర్శించారు. ప్రజల అవసరాలన్నింటినీ తీర్చే విధంగా పథకాలను అమలు చేస్తున్నందుకే నేడు తమిళనాడు ప్రజలు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను ప్రశంసిస్తున్నారు. సి.ఎన్. అన్నాదురై(మాజీ ముఖ్యమంత్రి)ని ‘తాయి కజగం’గా పేర్కొన్న డీఎంకేతో ఇప్పుడు నేను నా రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నానని ఆయన అన్నారు.
ఏఐడీఎంకే స్వతంత్రంగా పనిచేయడం లేదు
వైతిలింగం తన అనుచరులతో కలిసి డీఎంకేలో చేరతారన్న వార్తలు గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. డీఎంకేలో చేరే ముందు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు కూడా సమాచారం. పార్టీ కార్యాలయానికి వచ్చిన వెంటనే డీఎంకే నేత సెంథిల్ బాలాజీతో పాటు పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. రాబోయే తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన వెల్లడించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఓ. పన్నీర్ సెల్వం వర్గం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తుండడంతో, నేను డీఎంకేలో చేరానని తెలిపారు. ఏఐఏడీఎంకే స్వతంత్రంగా పనిచేయడం లేదని, అది అధికారం కేంద్రీకృత విధానంతో నడుస్తోందని కూడా ఆయన విమర్శించారు. గతంలో 2025 నవంబర్‌లో ఏఐఏడీఎంకే తిరుగుబాటు నేత మనోజ్ పాండియన్ కూడా డీఎంకేలో చేరారు.
