Let's talk: editor@tmv.in
కలియుగ వైకుంఠం.. భక్తజన సంద్రం

కలియుగ వైకుంఠం.. భక్తజన సంద్రం

Panthagani Anusha
11 జనవరి, 2026

కలియుగ వైకుంఠం తిరుమల కొండపై పది రోజుల పాటు జరిగిన వైకుంఠ ద్వార దర్శన వేడుకలు అశేష భక్తజన వాహిని మధ్య అత్యంత వైభవంగా ముగిశాయి. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు సాగిన ఈ ఉత్సవాల్లో రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. గత రికార్డు (6.83 లక్షల) కంటే ఈసారి లక్ష మంది అదనంగా స్వామివారిని దర్శించుకోవడం విశేషం ఈ మేరకు టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు శుక్రవారం అన్నమయ్య భవనంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీటీడీ చేసిన భారీ ఏర్పాట్లపై 93 శాతం మంది భక్తులు అపారమైన సంతృప్తిని వ్యక్తం చేశారని ఆనందం వ్యక్తం చేశారు.

ఆదాయంలోనూ సరికొత్త రికార్డులు

భక్తుల అచంచల విశ్వాసానికి ప్రతీకగా తిరుమల హుండీ కానుకల వర్షం కురిసింది. ఈ పది రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 41.14 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ పాలక మండలి వెల్లడించింది. ఇక ప్రసాదాల విక్రయాల్లోనూ భారీ వృద్ధి నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే 10 లక్షలు అధికంగా అంటే మొత్తం 44 లక్షల లడ్డూలు భక్తులకు అందజేశారు.

సామాన్య భక్తులకు ప్రాధాన్యత

మొత్తం 182 గంటల దర్శన సమయం అందుబాటులో ఉండగా అందులో 164 గంటలను కేవలం సామాన్య భక్తులకే కేటాయించడం గమనార్హం. వీఐపీ సంస్కృతిని తగ్గించి సామాన్యులకు త్వరితగతిన దర్శనం కల్పించాలన్న టీటీడీ నిర్ణయం సత్ఫలితాలనిచ్చింది. సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు తమ మొక్కుల ప్రకారం తలనీలాలు సమర్పించుకున్నారు.ఈ భారీ రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు టీటీడీ తొలిసారిగా కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత రియల్-టైమ్ క్రౌడ్ మానిటరింగ్ వ్యవస్థను అమలు చేసింది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతి క్యూ లైన్‌ను పర్యవేక్షించడం వల్ల టోకెన్లు లేని భక్తులకు కూడా వేగంగా దర్శనం కల్పించడం సాధ్యమైంది అని టీటీడీ అధికారి పేర్కొన్నారు.

అక్షయపాత్రగా అన్నప్రసాద వితరణ

తిరుమలకు వచ్చిన భక్తుల సౌకర్యార్థం పది రోజుల్లో సుమారు 33 లక్షల మందికి ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. చలికాలం దృష్ట్యా క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా వేడి బాదం పాలను పంపిణీ చేశారు. ఇక భద్రతా ఏర్పాట్లలో భాగంగా 2,400 మంది పోలీసు సిబ్బంది, 1,150 మంది విజిలెన్స్ సిబ్బంది మరియు అదనపు పోలీసు బలగాలను మోహరించి శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహించారు. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా ఆలయాన్ని 50 టన్నుల సంప్రదాయ పూలు, 10టన్నుల పండ్లు, 4టన్నుల కట్ ఫ్లవర్స్‌తో దివ్య వైకుంఠంలా అద్భుతంగా అలంకరించారు.

టీటీడీ కార్యనిర్వాహక అధికారి అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ తిరుమలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆధ్వర్యంలోని ఇతర ఆలయాల్లో కూడా ఈ ఉత్తర ద్వారదర్శనం సమయంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. మొత్తం మీద సాంకేతికతను, మానవీయ విలువలను జోడించి టీటీడీ చేసిన ఏర్పాట్లు సామాన్య భక్తులకు ఎంతో మేలు చేశాయి.