
కలసికట్టుగా పని చేస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం మనదే: మంత్రి కందుల దుర్గేష్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసికట్టుగా పనిచేస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. విజయవాడ సుజన కన్వెన్షన్ హాలులో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో శుక్రవారం నిర్వహించిన జనసేన పార్టీ విజయవాడ నగర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
సార్వత్రిక ఎన్నికల్లో జనసైనికులు, వీరమహిళలు చూపిన నిబద్ధత అభినందనీయమని, అదే పట్టుదలతో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో శ్రమించి విజయవాడలో జనసేన జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టాన్ని గుర్తించే బాధ్యతను పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటారని స్పష్టం చేశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా దరఖాస్తులు స్వీకరించినప్పుడు ఆటో డ్రైవర్లు, దినసరి కూలీలు, శ్రామికులు చూపిన రాజకీయ పరిపక్వత నన్ను ఎంతగానో ఆకట్టుకుందని, ఏ కులానికీ పరిమితం కాకుండా అన్ని వర్గాల ఆశయాల నుంచి పుట్టిన పార్టీ జనసేన అని చెప్పారు.
శాసనమండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు సులువవుతుందని తెలిపారు. విజయవాడ నగరంలో డివిజన్ల వారీగా ఉన్న సమస్యలను తెలుసుకుని, క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేసే నాయకులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతూ, కూటమి ధర్మాన్ని పాటిస్తూనే పార్టీని బలోపేతం చేయాలని, మూడు పార్టీల ఐక్యతతో రాబోయే రోజుల్లో అఖండ విజయం సాధిస్తామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
