
కేలోరీ ఫ్రీ..మీ ప్రాణానికి కాస్ట్లీ గురు..!
మీరు రోజూ తాగే చక్కెర లేని కాఫీ కప్పులో, లేదా ప్యాకెట్లలో దొరికే "షుగర్ ఫ్రీ" స్వీట్లలో దాగి ఉన్న రహస్యం మీకు తెలుసా? బరువు తగ్గడానికి మీరు నమ్మిన ఆ "కెలోరీ-రహిత" మిత్రుడు, నిజానికి మిమ్మల్ని మరింత ఆకలిగా మార్చేస్తున్నాడు. మన ఆరోగ్యానికి మంచిదని మనం భావించే ఒక చిన్న మార్పు, తెలియకుండానే మన మెదడును తప్పుదోవ పట్టిస్తోంది. ప్రతి ఇంట్లో ఉండే ఈ తీపి వస్తువు వెనుక దాగి ఉన్న అసలు నిజం ఏమిటి? ఇది కేవలం బరువు పెరగడానికి కారణం మాత్రమే కాదు, మీ మెదడు పనితీరును ఎలా మారుస్తుందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. సైన్స్ ప్రపంచాన్ని సైతం ఆందోళనలోకి నెట్టిన ఈ కొత్త అధ్యయనం వివరాలు తెలుసుకుందాం.
బరువు తగ్గాలనుకునేవారికి, చక్కెర వాడకాన్ని తగ్గించుకోవాలనుకునేవారికి "కెలోరీ-ఫ్రీ" అనే పదం ఒక అద్భుతమైన పరిష్కారంగా అనిపిస్తుంది. చాలామంది తమ తీపి రుచులను ఆస్వాదించాలానే ఆర్టిఫీషియల్ స్వీటెనర్లను ఉపయోగించే ఉత్పత్తులను ఎంచుకుంటారు. అయితే, ఈ సాధారణ వ్యూహం అపజయం పాలవుతుందని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. సాధారణంగా వాడే చక్కెర ప్రత్యామ్నాయాలు మన ఆకలిని పెంచుతూ, మెదడు ఆకలిని నియంత్రించే విధానాన్ని మార్చివేస్తాయని ఈ పరిశోధన పేర్కొంది.
దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు సుక్రలోజ్ అనే జీరో-కెలోరీ స్వీటెనర్ ఆకలికి సంబంధించిన మెదడు కార్యకలాపాలను ఎలా మారుస్తుందో కనుగొన్నారు. సుక్రలోజ్ హైపోథలామస్‌ను ప్రభావితం చేస్తుందని వారు తెలిపారు. హైపోథలామస్ అనేది ఆకలిని నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేసే మెదడులోని ఒక ముఖ్యమైన భాగం. ఇది ప్రేరణకు సంబంధించిన ఇతర మెదడు భాగాలతో సంభాషించే విధానాన్ని మార్చివేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.
మెదడులో గందరగోళం
ఈ అధ్యయనంలో వివిధ బరువులు ఉన్న 75 మందిని పరిశోధించారు. వారికి వేర్వేరు సమయాల్లో మూడు రకాల పానీయాలు ఇచ్చారు: ఒకటి నీరు, చక్కెరతో తీపి చేసిన పానీయం, మరొకటి సుక్రలోజ్‌తో తీపి చేసిన పానీయం. ఆ తర్వాత పరిశోధకులు వారి మెదడు కార్యకలాపాలు, రక్త నమూనాలు ఆకలి స్థాయిలను పర్యవేక్షించారు.
ఫలితాల ప్రకారం, ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారిలో సుక్రలోజ్ వారిని మరింత ఆకలిగా అనిపించేలా చేసిందని, మెదడులోని ఆకలిని నియంత్రించే కేంద్రాలలో కార్యకలాపాలను పెంచిందని తేలింది. చక్కెరలా కాకుండా, సుక్రలోజ్ ఇన్సులిన్ జీఎల్పీ-1 వంటి హార్మోన్లను విడుదల చేయలేదు. ఈ హార్మోన్లు సాధారణంగా మెదడుకు, శరీరానికి తగినన్ని కెలోరీలు అందాయని, తద్వారా కడుపు నిండిన భావన కలుగుతుందని సంకేతాలు పంపుతాయి. అధ్యయన పరిశోధకురాలు కథ్లీన్ పేజ్ ప్రకారం, సుక్రలోజ్ మెదడులో గందరగోళాన్ని సృష్టిస్తుంది. "మీ శరీరానికి తీపి కారణంగా కెలోరీ అందాలని ఆశిస్తుంది, కానీ ఆ కెలోరీ అందకపోతే, మెదడు ఆ పదార్థాల కోసం ఆరాటపడే విధానం కాలక్రమేణా మారిపోతుంది," అని ఆమె చెప్పారు. మెదడు స్కాన్‌లలో సుక్రలోజ్ వల్ల హైపోథలామస్, ప్రేరణ, నిర్ణయం తీసుకోవడానికి సంబంధించిన ఇతర మెదడు భాగాల మధ్య కమ్యూనికేషన్ పెరిగినట్లు తేలింది. దీనివల్ల ఆర్టిఫీషియల్ స్వీటెనర్ ఆకలి కోరికలను ప్రభావితం చేసి, మరింత ఆహారం తినాలనే కోరికకు దారితీస్తుందని సూచిస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
ఈ అధ్యయన ఫలితాలు ప్రధాన ఆరోగ్య సంస్థల నుండి వచ్చిన ఇటీవలి హెచ్చరికలకు అనుగుణంగా ఉన్నాయి. మే 2023లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ బరువు తగ్గడానికి సుక్రలోజ్ వంటి నాన్-షుగర్ స్వీటెనర్లను ఉపయోగించవద్దని సిఫార్సు చేసింది. ఎందుకంటే అవి టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, అధిక మరణాలతో ముడిపడి ఉన్నాయని రుజువులు ఉన్నట్లు పేర్కొంది.
డాక్టర్ కథ్లీన్ కూడా నాన్-కెలోరీ స్వీటెనర్లను చక్కెరలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవద్దని సలహా ఇస్తున్నారు. మెరుగైన జీవక్రియ ఆరోగ్యం కోసం, మొత్తం తీపిని తగ్గించుకునే ఆహా రం వైపు దృష్టి పెట్టాలని ఆమె సూచిస్తున్నారు.
పురుషులు, మహిళలు వేరు వేరు ప్రభావాలు
సుక్రలోజ్ పురుషులు, మహిళలపై వేర్వేరు ప్రభావాలను చూపుతుందని ఈ అధ్యయనం కనుగొంది. పురుషులతో పోలిస్తే, మహిళలలో మెదడు కార్యకలాపాలలో ఎక్కువ మార్పులు కనిపించాయి. దీనివల్ల సుక్రలోజ్ ప్రభావం స్త్రీ, పురుషుల మధ్య భిన్నంగా ఉండవచ్చని సూచిస్తుంది.
ప్రస్తుతం, పరిశోధకులు పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిపై ఈ స్వీటెనర్లు ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవడానికి ఒక తదుపరి అధ్యయనాన్ని ప్రారంభించారు. ఈ వయస్సుల వారు ఇతర వయస్సుల వారికన్నా ఎక్కువ చక్కెర, చక్కెర ప్రత్యామ్నాయాలను వినియోగిస్తారు. "ఈ పదార్థాలు ఊబకాయం ప్రమాదం ఉన్న పిల్లల అభివృద్ధి చెందుతున్న మెదడులలో మార్పులకు దారితీస్తాయా?" అని డాక్టర్ కథ్లీన్ ప్రశ్నించారు. ఈ పరిశోధన, ఒకప్పుడు కెలోరీలను తగ్గించుకోవడానికి ఒక సురక్షితమైన మార్గంగా భావించిన ఆర్టిఫీషియల్ స్వీటెనర్లు, ఇప్పుడు శరీరంలోని సహజ ఆకలి సంకేతాలకు ఎలా అంతరాయం కలిగించి, బరువు పెరగడానికి ఎలా దోహదపడతాయో తెలియజేస్తుంది.
