Let's talk: editor@tmv.in
కలకత్తాలో ’మెస్సీ ఈవెంట్‘ గందరగోళం

కలకత్తాలో ’మెస్సీ ఈవెంట్‘ గందరగోళం

Pinjari Chand
14 డిసెంబర్, 2025

పగిలిన ప్లాస్టిక్ కుర్చీలు, చిరిగిన స్పాన్సర్ బ్యానర్లు, విరిగిన హోర్డింగ్ లు..ధ్వంసమైన ఫైబర్ గ్లాస్ సీట్లు, విసేరిసిన వాటర్ బాటిళ్లతో చిందరవందరగా మారిన మైదానం. ఇలా కలకత్తాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో అభిమానులు విధ్వంసం సృష్టించారు. తమ అభిమాన ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సీ గోట్ ఇండియా టూర్ లో భాగంగా శనివారం ఇక్కడికి వస్తున్నారని తెలిసి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు టికెట్ కొనుగోలు చేసి, ఉదయం నుంచి ఎదురుచూశారు. అయితే లెజండరీ ఆటగాడు మెస్సీ స్టేడియంలోని టచ్ లైన్ వరకు రావడం,రాజకీయ నాయకులు, ప్రముఖులు మెస్సీని చుట్టేయడం, ప్రేక్షకులకు కనబడకపోవడం, స్ర్కీన్ ఏర్పాటు చేసిన వ్యూ లేకపోవడం, అర్థాంతరంగా కార్యక్రమం ముగియడంతో పుట్ బాల్ అభిమానుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది.బ్యారికేడ్‌లు దాటి మైదానంపైకి దూసుకొచ్చి గందరగోళం సృష్టించారు. పుట్ బాల్ ప్రేమికులు రాష్ట్ర క్రీడల మంత్రి అరూప్ బిశ్వాస్, ఈవెంట్ ప్రధాన నిర్వాహకుడు శతద్రు దత్తాల అరెస్ట్‌కు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. మెస్సీ వెళ్లిపోయిన తర్వాత నిర్వాహకులు కనిపించకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. మైదానంపైకి వందలాది మంది ప్రేక్షకులు దూకి, టెంపరరీ టెంట్లు పడగొట్టారు, టచ్‌లైన్ సమీపంలోని ఎక్విప్‌మెంట్ ధ్వంసం చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేయడానికి నానా యాతన పడ్డారు.

దీంతో కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో లియోనెల్ మెస్సీ ఈవెంట్ జరిగిన సమయంలో చెలరేగిన గందరగోళం పెద్ద లా అండ్ ఆర్డర్ సమస్యగా మారింది. నిర్వాహకుల నిర్లక్ష్యం ఆరోపణలతో ప్రధాన నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించి, మెస్సీని చూడలేకపోయిన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ప్రపంచ కప్ విజేత, ఫుట్‌బాల్ ఐకాన్ లియోనెల్ మెస్సీతో పాటు ఆయన సుదీర్ఘకాల స్ట్రైకర్ భాగస్వామి లూయిస్ సువారెజ్, అర్జెంటీనా జట్టు సహచరుడు రోడ్రిగో డి పాల్‌లు వివేకానంద యువ భారతి క్రీడాంగణ్ (సాల్ట్ లేక్ స్టేడియం)కు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. మెస్సీ వాహనం టచ్‌లైన్ సమీపంలో ఆగింది. ఆయన మైదానంలో అడుగుపెట్టగానే వీఐపీలు, నిర్వాహకులు, సెలబ్రిటీలు, భద్రతా సిబ్బంది ఆయన్ను చుట్టుముట్టారు. దీంతో గ్యాలరీల్లో ఉన్న ప్రేక్షకులకు మెస్సీ స్పష్టంగా కనిపించలేదు. మెస్సీ మైదానంలో కొద్ది దూరం నడిచి ‘మెస్సీ.. మెస్సీ’ అంటూ అరుస్తున్న అభిమానుల వైపు చేయి ఊపి అభివాదం చేశారు.

అయితే మెస్సీ గ్యాలరీల నుంచి దూరంగా ఉండటం, జెయింట్ స్క్రీన్‌లపై కూడా స్పష్టమైన వ్యూ రాకపోవడంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. అసలు ప్రోగ్రామ్ ప్రకారం మెస్సీ స్టేడియం మొత్తం ల్యాప్ చేయాల్సి ఉండగా, మధ్యలోనే తిరిగి వెళ్లిపోయారు. మెస్సీ ముందుగానే వెళ్లిపోయారని తెలిసిన వెంటనే అభిమానుల ఆగ్రహం పెల్లుబికింది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్)ను స్టేడియంలోకి రప్పించారు. కొందరిపై లాఠీచార్జ్ చేశారు.

నెల జీతం పెట్టి మెస్సీని చూడటానికి వచ్చా

ఇది పూర్తి నిర్లక్ష్యం అని తన కుమారుడితో వచ్చిన ఫుట్‌బాల్ అభిమాని అజయ్ షా అన్నారు. ఒక నెల జీతం ఖర్చు పెట్టి మెస్సీని చూడడానికి వచ్చాం. రూ.5,000 టికెట్ కొన్నాం. మెస్సీని చూసొచ్చామని కాదు, రాజకీయ నాయకుల్ని చూశాం. టికెట్ ధరలు రూ.4,500 నుంచి రూ.10,000 వరకు ఉండగా, చాలా మంది అభిమానులు ఉదయం నుంచే వచ్చి ఎదురుచూశారు. ఈ గందరగోళం వల్ల ప్రోగ్రామ్ అకస్మాత్తుగా ముగిసిపోయింది. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు పాల్గొనలేకపోయారు. మెస్సీని ముందుగానే బయటకు తీసుకెళ్లడం, అదనపు భద్రతా బలగాలు రప్పించడం వల్ల పరిస్థితి పూర్తిగా అదుపుతప్పలేదని పోలీసు వర్గాలు తెలిపాయ.

కమిటీ ఏర్పాటు

అనంతరం మమతా బెనర్జీ కార్యక్రమ నిర్వాహణ లోపంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎక్స్ పోస్ట్‌లో మెస్సీకి, స్టేడియంలో సమావేశమైన క్రీడా ప్రేమికులకు క్షమాపణలు చెప్పారు. సాల్ట్ లేక్ స్టేడియంలో ఈరోజు చూసిన నిర్వాహణ లోపంపై నేను తీవ్రంగా కలవరపడ్డాను, షాక్ అయ్యాను అని మమతా అన్నారు.

విచారణ కమిటీకి కలకత్తా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అశిమ్ కుమార్ రే చైర్మన్‌గా, చీఫ్ సెక్రటరీ, హోమ్ అండ్ హిల్ అఫైర్స్ అదనపు చీఫ్ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ బాధ్యతలు నిర్ధారిస్తుంది, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలకు సిఫారసు చేస్తుంది. ఇక డీజీపీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ఈవెంట్ ప్రధాన నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఆయన వచ్చి, చేయి ఊపి, కొందరిని కలిసి వెళ్లిపోతారు. నిర్వాహకుల వైపు నిర్లక్ష్యం ఉందేమో తెలుసుకుంటాం అని డీజీపీ అన్నారు. నిర్వాహకుడు టికెట్ ధరలు రిఫండ్ చేస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చారని డీజీపీ తెలిపారు. పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉంది అని ఆయన చెప్పారు. కోల్‌కతా ఫుట్‌బాల్ ప్రేమికులకు ఇది చీకటి రోజు అంటూ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆర్గనైజర్‌ను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. పోలీసులు కూడా విఫలమయ్యారని విమర్శించారు. ఫుట్‌బాల్ సంస్కృతికి పేరుగాంచిన కోల్‌కతాలో పగిలిన కుర్చీలు, చింపిన బ్యానర్లు, ఆగ్రహావేశాలతో నిండిన దృశ్యాలు ఈ రోజు ఆశించిన ఉత్సాహానికి పూర్తి విరుద్ధంగా నిలిచాయి.