
కర్రెగుట్ట కొండల్లో భద్రతా దళాల కొత్త శిబిరం
ఒకప్పుడు మావోయిస్టులకు సురక్షిత స్థావరంగా ఉన్న కర్రెగుట్ట కొండల్లో భద్రతా బలగాలు మరింత పట్టు బిగించాయి. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని ఈ కొండలు చాలా దట్టమైన అడవులతో నిండి ఉంటాయి. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించిన దాదాపు ఆరు నెలల తర్వాత, భద్రతా దళాలు ఈ ప్రాంతంలో తమ కొత్త శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. బీజాపూర్ జిల్లాలోని ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తడ్పాల గ్రామ సమీపంలో నవంబర్ 4న 'సురక్షా ఏవం జన్ సువిధా క్యాంప్' (భద్రత, ప్రజా సౌకర్యాల శిబిరం)ను ఏర్పాటు చేసినట్లు ఆదివారం ఒక అధికారి తెలిపారు.
క్యాంపు ఏర్పాటుతో వేగంగా అభివృద్ధి పనులు
ఈ ఏడాది ఏప్రిల్–మే నెలల్లో 21 రోజుల పాటు సాగిన విస్తృత కూంబింగ్ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. వారి నుంచి 35 ఆయుధాలు, 450 ఐఈడీలు, భారీగా డెటోనేటర్లు, 12 వేల కిలోల సామగ్రి భద్రతా బలగాల చేతికి చిక్కాయి. ఈ ఆపరేషన్ తర్వాతే ఫోర్సులు కొత్త క్యాంపు ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ నూతన క్యాంపు సీఆర్ఫీఎఫ్ 196వ బెటాలియన్, కోబ్రా 205వ బెటాలియన్‌లకు ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్‌గా పనిచేయనుంది. సరిహద్దు ప్రాంతంలో మావో దాడులను అదుపులో ఉంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు పేర్కొన్నారు. రోడ్లు, విద్యుత్, తాగునీరు, ఆరోగ్య సేవలు, స్కూళ్లు, ఆంగన్‌వాడీలు, మొబైల్ కనెక్టివిటీ వంటి అభివృద్ధి సదుపాయాలు ఈ క్యాంపు చుట్టుపక్కల గ్రామాలకు వేగంగా చేరనున్నాయని వెల్లడించారు.
క్యాంపు ఏర్పాటుకు తీవ్ర కసరత్తులు
క్యాంపు స్థాపించేందుకు డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సీఆర్ఫీఎఫ్ సంయుక్త బృందాలు కఠినంగా ఉన్న, దట్టమైన అరణ్య ప్రాంతాల్లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాయి. పర్వత ప్రాంతం, రహదారులు లేకపోవడం, ఐఈడీల ముప్పు మధ్య హెలికాప్టర్ మద్దతుతో ఆపరేషన్ చేపట్టినట్టు సమాచారం. భవిష్యత్‌లో ఈ ప్రాంతాన్ని జంగిల్ వార్‌ఫేర్, ఫీల్డ్‌క్రాఫ్ట్ వంటి ట్రైనింగ్‌లకు ప్రత్యేక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. నవంబర్ 11న రాష్ట్ర పోలీస్, సీఆర్ఫీఎఫ్ ఉన్నతాధికారులు క్యాంపును సందర్శించి సిబ్బందిని అభినందించారు. నవంబర్ 20–21 తేదీల్లో సీఆర్ఫీఎఫ్ డైరెక్టర్ జనరల్ జయనేంద్ర ప్రతాప్ సింగ్ క్యాంపులో రాత్రి బస చేసి భద్రతా బలగాలకు తన మద్దతు ప్రకటించారు.
కొత్త క్యాంపు ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 14 ఐఈడీలను నిర్వీర్యం చేసినట్టు అధికారులు వెల్లడించారు. 2024 నుంచి బీజాపూర్ జిల్లాలో మొత్తం 22 కొత్త భద్రతా క్యాంపులు ఏర్పాటయ్యాయి. ఈ కాలంలో 202 మంది మావోయిస్టులు హతమవ్వగా, 749 మంది పోలీసులకు లొంగిపోయారు. 1,006 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు వివరించారు.
‘నియాద్ నెల నార్ (మీ మంచి గ్రామం) పథకం కింద’ పథకం కింద క్యాంపుల చుట్టుపక్కల గ్రామాల్లో రహదారులు, విద్యుత్, నీటి సదుపాయాలు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, మొబైల్ నెట్‌వర్క్ వంటి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. గతంలో అక్కడక్కడ మాత్రమే చిన్న, చిన్న క్యాంపులు ఏర్పాటు చేసేవారు.కానీ మావోయిస్టుల నిర్మూలన వేగం పుంజుకోవడంతో భద్రతా దళాలు భారీ స్థాయిలో అక్కడ క్యాంప్ ను ఏర్పాటు చేసింది.
