Let's talk: editor@tmv.in
కర్నూలు బస్ దుర్ఘటన మనకు హెచ్చరిక

కర్నూలు బస్ దుర్ఘటన మనకు హెచ్చరిక

Dr.Chokka Lingam
25 అక్టోబర్, 2025

రాత్రి మూడుగంటల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన దేశాన్ని షాక్‌కు గురిచేసింది. హైదరాబాద్–బెంగళూరు రహదారిపై ప్రయాణిస్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సు మోటార్‌ సైకిల్‌ను ఢీకొని అగ్నికి ఆహుతైంది. బస్సులో ప్రయాణిస్తున్న 41 మందిలో కనీసం 20 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. నిద్రలో ఉన్న ప్రయాణికులు తలుపులు తెరవలేక మంటల్లో చిక్కుకున్నారు. ఇది కేవలం ప్రమాదం కాదు భారత రహదారి భద్రతా వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందో చూపించే సాక్ష్యం.

ఇలాంటి ప్రమాదాలు దేశానికి కొత్తవి కావు. 2023లో మహారాష్ట్ర బుల్ధానాలో జరిగిన బస్ అగ్నిప్రమాదంలో 26 మంది, 2021లో తిరుపతి హైదరాబాద్ రూట్‌లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రకారం 2022లో దేశంలో 1.55 లక్షల మంది రహదారి ప్రమాదాల్లో చనిపోయారు. అందులో సుమారు 10 శాతం బస్సులతో సంబంధం ఉన్నవే. ఇంధన లీక్‌లు లేదా ఎలక్ట్రికల్ షార్ట్‌ సర్క్యూట్ల వల్లే 700కిపైగా మరణాలు నమోదయ్యాయి. ఇలాంటి ఘటనలు సాధారణంగా రాత్రి ప్రయాణాలు, ప్రైవేట్ ఆపరేటర్లు, వాహన సంరక్షణలో నిర్లక్ష్యం, అత్యవసర సేవల ఆలస్యం వల్లనే జరుగుతాయి. ప్రతిసారి ఒక “

అనివార్యమైన దుర్ఘటనగా మానవ తప్పిదాన్ని కప్పిపుచ్చుకుంటాం.

ప్రమాదానికి వెనుక ఉన్న వాస్తవాలు

ప్రాథమిక విచారణ ప్రకారం బస్సు మోటార్‌సైకిల్‌ను ఢీకొనడంతో ఇంధన ట్యాంక్ పగిలి మంటలు చెలరేగాయి. ప్రధాన తలుపు జామ్ కావడంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. కొందరు కిటికీలు పగులగొట్టి తప్పించుకున్నారు. అధికారుల సమాచారం ప్రకారం బ్రేక్ వేడి, ఇంధన లీకేజ్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాక్‌ కావడం వంటి అంశాలు ఈ ప్రమాదాన్ని మరింత తీవ్రము చేశాయి.

పబ్లిక్ రవాణా ఆపరేటర్లలో “భద్రత” అన్నది ఇప్పటికీ అనవసర వ్యయంగా భావించే దురవస్థ ఉంది. చౌక గ్యారేజీలలో వాహన సంరక్షణ, ఫైర్ ఎక్స్టింగ్విషర్‌లు సరిగ్గా పనిచేయకపోవడం, ఎగ్జిట్ డ్రిల్లులు లేకపోవడం ఇవే సాధారణ దృశ్యాలు. రవాణా శాఖ తనిఖీలు చాలా అరుదుగా, కేవలం పత్రాల తనిఖీ కోసమే, మామూళ్ల కోసమే జరుగుతాయన్నది బహిరంగ రహస్యం.

మానవ ప్రవర్తన కారణాలు

మోటార్‌సైకిల్ ప్రయాణికులు హెల్మెట్ లేకుండా, వెనుక రిఫ్లెక్టర్ లేకుండా ప్రయాణించినట్లు సమాచారం. బస్సు డ్రైవర్ వేగంగా వెళ్లాలనే ఉద్దేశ్యంతో స్పీడ్ పెంచాడు. ఇలాంటి నిర్లక్ష్యం రాత్రి సమయంలో మరింత ప్రమాదకరమవుతుంది. మరొక పెద్ద సమస్య డ్రైవర్ అలసట (fatigue). దూర ప్రయాణ డ్రైవర్లు తరచూ 14 గంటలు నిరవధికంగా డ్రైవింగ్ చేస్తారు. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం, భారతదేశంలోని రహదారి ప్రమాదాలకు 20 శాతం వరకు అలసటే ప్రధాన కారణం. అయినా ఇప్పటివరకు ప్రైవేట్ బస్సు డ్రైవర్లకు పని గంటల పరిమితి లేని దుస్థితి కొనసాగుతోంది.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోపాలు

హైవేలు ఆర్థిక వ్యవస్థకు నాడులు కానీ భద్రతా వ్యవస్థలు సరిగా లేవు. హైదరాబాద్–బెంగళూరు రహదారి వంటి జాతీయ మార్గాల్లో కూడా అత్యవసర రెస్క్యూ స్టేషన్లు, ఫైర్ రెస్పాన్స్ యూనిట్లు, సీసీ కెమెరాలు సరిపడా లేవు. గ్రామీణ ప్రాంతాల్లో రక్షణ బృందాలు చేరుకోవడానికి 30–40 నిమిషాలు పడుతుంది ఈ ఆలస్యం అనేక ప్రాణాలు తీస్తోంది. ఇక వాహన రూపకల్పనలో కూడా లోపాలున్నాయి. ఇంధన ట్యాంకులు ప్రభావ జోన్‌కి దగ్గరగా ఉండటం, ఫైర్ రిటార్డెంట్ మెటీరియల్స్ తప్పనిసరి కాకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి.

బాధ్యత ఎవరిది?

ఈ ప్రమాదానికి బాధ్యులెవరు ? డ్రైవరా?

భద్రతా ప్రమాణాలు పాటించని బస్ యజమానా?

లేదా పర్యవేక్షణ చేయని అధికారులా?

2019లో అమల్లోకి వచ్చిన మోటార్ వాహనాల సవరణ చట్టం (MV Amendment Act) కఠినమైన నిబంధనలు పెట్టినా, అమలు మాత్రం బలహీనంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ రోడ్ సేఫ్టీ అథారిటీ సిబ్బంది కొరతతో పరిమితంగా పనిచేస్తోంది. జిల్లా స్థాయి భద్రతా కమిటీలు సమావేశం కానే లేవు.

ఆర్థిక నష్టం – మానవ దుఃఖం

ప్రతి ప్రమాదం ఒక కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టడమే కాదు, దేశానికి ఆర్థిక భారంగా కూడా మారుతుంది. వరల్డ్ బ్యాంక్ అంచనా ప్రకారం, రహదారి ప్రమాదాల వలన భారతదేశ జాతీయాదాయంలో 3 శాతం (సుమారు ₹5 లక్షల కోట్లు) నష్టం జరుగుతోంది. ఒక కుటుంబ పోసుకుని మరణం అనగా ఒక కుటుంబం పేదరికంలోకి జారిపోవడం. కాబట్టి ఇది కేవలం భద్రతా సమస్య కాదు ఆర్థిక, సామాజిక సమస్య కూడా.

ఏం చేయాలి?

1. వాహన రూపకల్పనలో మార్పులు: ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్స్, ఆటోమేటిక్ ఫైర్ సప్రెషన్ సిస్టమ్స్, బ్లాక్‌బాక్స్ రికార్డర్లు తప్పనిసరి చేయాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు ప్రతి మూడు నెలలకొకసారి తనిఖీ చేయాలి.

2. నియంత్రణ వ్యవస్థ బలోపేతం: రాష్ట్రాలు స్వతంత్ర రవాణా భద్రతా ఆడిటర్లను నియమించాలి. పర్యవేక్షణలలో లోపాలు ఉన్న ఆపరేటర్లపై భారీ జరిమానాలు విధించాలి.

3. హైవే భద్రతా సదుపాయాలు: ప్రతి 50 కిలోమీటర్లకు ఒక అత్యవసర స్పందనా కేంద్రం, ఫైర్ టెండర్, అంబులెన్స్ ఉండేలా ఏర్పాటు చేయాలి. హైవేలపై లైటింగ్, కెమెరాలు, బ్యారియర్లు తప్పనిసరి చేయాలి.

4. డ్రైవర్ సంక్షేమం: డ్రైవింగ్ గంటలకు పరిమితి, రెగ్యులర్ విశ్రాంతి విరామాలు, ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి చేయాలి. GPS ఆధారిత మానిటరింగ్ ద్వారా డ్రైవర్ విశ్రాంతిని నిర్ధారించాలి.

5. ప్రజల్లో అవగాహన: హెల్మెట్ ధారణ, రాత్రి ప్రయాణాల జాగ్రత్తలు, సురక్షిత డ్రైవింగ్‌పై అవగాహన ప్రచారాలు జరగాలి. తమిళనాడులో విజయవంతమైన “రోడ్ సేఫ్టీ క్లబ్” నమూనాను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాలి.

6. సాంకేతికతను వినియోగించడం: AI ఆధారిత “ఆక్సిడెంట్ ప్రిడిక్షన్ సిస్టమ్స్” ద్వారా ప్రమాదప్రాంతాలను ముందుగానే గుర్తించి రెస్క్యూ బృందాలను పంపించే విధానాలు అభివృద్ధి చేయాలి.

భవిష్యత్‌లో ఇటువంటి దుర్ఘటనలు మళ్లీ జరగకూడదంటే దేశానికి ఒక జాతీయ బస్ భద్రతా కోడ్ (National Bus Safety Code) అవసరం. భద్రత అనేది అదృష్టం‌ కాదు, సరైన ప్రణాళికతో కూడిన ఆచరణ

కర్నూలు బస్ దుర్ఘటన మనకు హెచ్చరిక - Tholi Paluku