Let's talk: editor@tmv.in
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం, ఐదుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం, ఐదుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

Dantu Vijaya Lakshmi Prasanna
30 నవంబర్, 2025

కర్నూలు జిల్లాలో ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. శనివారం ఉదయం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మిగనూర్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి (ఎస్.డి.పి.ఓ) ఎన్. భార్గవి మాట్లాడుతూ, ఈ ప్రమాదం జాతీయ రహదారి సంఖ్య 167పై తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో జరిగిందని తెలిపారు. కోటేకల్‌ వద్ద రెండు కార్లు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో నలుగురి మృతదేహాలు కారులో ఇరుక్కుపోగా స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీశారు, అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారన్నారు. క్షతగాత్రులను ఆదోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను కర్ణాటకలోని కోలార్‌ జిల్లా చిక్కహోసహళి చెందిన వెంకటేశ్‌ (76), మీనాక్షి (32), సతీశ్‌ (34), బనిత్‌ (5), రుత్విక్‌ (4)గా గుర్తించారు. చిక్కహోసహళి చెందిన ఏడుగురు, కారులో మంత్రాలయం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారన్నారు.

ఎమ్మిగనూరు రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరాతీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. కోటేకల్ వద్ద రెండు కార్లు ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. హృదయ విదారక ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు, మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురికి అత్యవసర వైద్య సహాయం అందించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ, రేంజ్ ఐజీ లు హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లారు. మృతి చెందిన ఐదుగురు కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించామనని మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు అధికారులు సీఎంకు తెలియచేశారు.

కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, కోటేకల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దిగ్బ్రాంతి కలగజేసిందన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి కుటుంబాలకు సంతాపం తెలిపారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారి చికిత్సపై తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలుజారీ చేశారు. ప్రయాణికులు ప్రయాణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రయాణికుల భద్రతా ప్రమాణాలపై కఠిన చర్యలు తీసుకునేలా అధికారులకు మరోసారి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై ప్రయాణికుల నిర్లక్ష్యానికి తావు లేకుండా పర్యవేక్షణ పెంచాలని మంత్రి సూచనలు చేశారు.

ఇదిలా ఉండగా మరో ఘటనలో ప్రకాశం జిల్లాలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి, వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, నవంబర్ 28 శుక్రవారం రాత్రి 08:07 గంటలకు ప్రకాశం జిల్లా, మద్దలకట్ట వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఏలూరు జిల్లాలోని నూజివీడు నుంచి 24 మంది ప్రయాణికులతో శ్రీశైలం వెళ్తున్న ఈ బస్సు, ఎడమ మలుపు వద్ద అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి, సుమారు 15 మీటర్ల దూరం రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు, వీరిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మలుపును దాటుతున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 281 కింద కేసు నమోదు చేసి, పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం, ఐదుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు - Tholi Paluku