Let's talk: editor@tmv.in
కర్ణాటక సంక్రాంతి సంబరాల్లో ఉత్కంఠగా ఎద్దుల బండి పందెలు

కర్ణాటక సంక్రాంతి సంబరాల్లో ఉత్కంఠగా ఎద్దుల బండి పందెలు

Pinjari Chand
13 జనవరి, 2026

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్ జిల్లా గౌరిబిదనూరు తాలూకా హుడుగూరు గ్రామంలో రైతు మిత్ర బలగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సాహభరితమైన ఎద్దుల బండి పందెం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. ఈ పోటీల్లో కేవలం కర్ణాటక రైతులే కాకుండా, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వందలాది మంది రైతులు తమ ఎద్దులతో పాల్గొనడం విశేషం. దీంతో ఈ పోటీ నిజమైన అంతర్‌ రాష్ట్ర క్రీడా సంబురంగా మారింది.

మూడు రోజుల పాటు నిరంతరంగా జరిగిన ఈ పోటీల్లో 50కిపైగా ఎద్దుల జంటలు పోటీపడ్డాయి. పందెం ట్రాక్‌పై వేగంగా దూసుకెళ్లిన ఎద్దులు, వాటిని నైపుణ్యంగా నియంత్రించిన బండి సారథుల ధైర్యసాహసాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేశాయి. కరతాళ ధ్వనులతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. గౌరిబిదనూరు పరిసర ప్రాంతాలతో పాటు దూర గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు హాజరై పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మలిచారు. పోటీల ప్రారంభోత్సవంలో మాట్లాడిన నిర్వాహకుల్లో ఒకరు మాట్లాడుతూ యంత్రాల వినియోగం వేగంగా పెరుగుతున్న ఈ కాలంలో ఎద్దుల వినియోగం తగ్గుతోంది. ఇలాంటి అంతర్‌ రాష్ట్ర స్థాయి సంప్రదాయ క్రీడలను నిర్వహించడం ద్వారా గ్రామీణ క్రీడలకు కొత్త ఊపిరి పోసినట్లవుతుంది. హల్లికర్ వంటి దేశీ జాతి ఎద్దులను పరిరక్షించడం మనందరి బాధ్యత అని తెలిపారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ క్రీడా కార్యక్రమం రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. విజేతలైన ఎద్దుల యజమానులకు ఆకర్షణీయమైన బహుమతులు అందించి నిర్వాహకులు ప్రోత్సహించారు.

గుజరాత్ లో అంతర్జాతీయ గాలిపటాల పండుగ‌

మకర సంక్రాంతి సమీపిస్తున్న నేపథ్యంలో గుజరాత్‌లో రాష్ట్రంలోని అత్యంత ప్రాధాన్యమైన ఉత్తరాయణ్ వేడుకలలో భాగమైన అంతర్జాతీయ గాలిపటాల పండుగ ఘనంగా జరుగుతోంది. ఈ రోజు ఉదయం అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్ వద్ద జరిగిన అంతర్జాతీయ గాలిపటాల పండుగ–2026ను ప్రధాని నరేంద్ర మోడీ, జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ సంయుక్తంగా ప్రారంభించారు. ఇది చాన్సలర్ మెర్జ్ భారత్‌కు చేసిన తొలి అధికారిక పర్యటన కావడం విశేషం. ఈ సందర్భంగా సాంస్కృతిక వేడుకలు, దౌత్య సంబంధాల సమ్మేళనం స్పష్టంగా కనిపించింది.

కార్యక్రమంలో ఇద్దరు నేతలు పాల్గొనేవారితో మమేకమవుతూ పండుగను ఆస్వాదించారు. గాలిపటాలు ఎగరేసి ఆనందించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన గాలిపటాల ప్రేమికులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు. జనవరి 14తో ముగియనున్న ఈ మూడు రోజుల పండుగలో 50 దేశాలకు చెందిన 135 మంది అంతర్జాతీయ గాలిపటాల నిపుణులు, భారతదేశం నలుమూలల నుంచి 65 మంది ఫ్లయర్లు, అలాగే గుజరాత్‌కు చెందిన 871 మంది స్థానిక పాల్గొనేవారు భాగస్వాములు అవుతున్నారు.