
కర్ణాటక లో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ తొలి అధికారిక పర్యటన
భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ గారు నవంబర్ 9, 2025న తొలిసారిగా కర్ణాటకలో అధికారిక పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర ఆధ్యాత్మిక వారసత్వం, సాంస్కృతిక సంప్రదాయాలు, విద్యా రంగంలో ఉన్నత ప్రమాణాలను తెలిపే అనేక కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు.
ఈ రోజు కార్యక్రమాలు హాసన్‌లోని శ్రావణబెళగొళతో ప్రారంభమవుతాయి. అక్కడ, ఉపరాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ గారు పూజ్య గురువు, ఆధ్యాత్మిక నాయకుడు అయిన ఆచార్య శ్రీ 108 శాంతి సాగర్ మహారాజ్ జీ స్మారక ఉత్సవాలలో పాల్గొంటారు. ఆచార్య శాంతి సాగర్ గారు 1925లో తొలిసారిగా శ్రావణబెళగొళకు వచ్చి నేటికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఆచార్య విగ్రహ స్థాపన, నాలుగో కొండ నామకరణ వేడుకలలో పాల్గొని, ఆ గురువు శాశ్వత ఆధ్యాత్మిక వారసత్వానికి నివాళులర్పిస్తారు. ప్రముఖ జైన పుణ్యక్షేత్రమైన శ్రావణబెళగొళ, శతాబ్దాల మత సంప్రదాయం, సన్యాస సంస్కృతిని ప్రతిబింబిస్తుంది.
తరువాత, శ్రీ రాధాకృష్ణన్ గారు మైసూరులోని జేఎస్‌ఎస్ ఉన్నత విద్య, పరిశోధన అకాడమీ 16వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. ఇది సుత్తూరు శ్రీక్షేత్రంలోని జగద్గురు శ్రీ వీరసింహాసన మహాసంస్థాన మఠానికి అనుబంధంగా ఉంది. గ్రాడ్యుయేట్ అయిన విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. వృత్తిపరమైన జ్ఞానం, పరిశోధన, నైతిక విలువలను కలిపిన సంపూర్ణ విద్య ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెబుతూ, వారి విద్యా విజయాలను అభినందిస్తారు. ఈ విశ్వవిద్యాలయం ఆరోగ్య విజ్ఞానం, ఇంజనీరింగ్, నిర్వహణ, పరిశోధన రంగాలలో తన సేవలకు గుర్తింపు పొందింది. ఈ స్నాతకోత్సవం సాంప్రదాయ విలువలకు, ఆధునిక ఉన్నత విద్యకు మధ్య వారధిగా నిలుస్తుంది.
ఉపరాష్ట్రపతి గారు ప్రముఖ మఠమైన సుత్తూరు మఠం పాత ప్రాంగణాన్ని కూడా సందర్శిస్తారు. అంతేకాక, మైసూరు సమీపంలోని శ్రీ చాముండేశ్వరీ దేవి ఆలయం మాండ్యాలోని, మేల్‌కోటేలో ఉన్న చెలవనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు. ఈ కార్యక్రమాల ద్వారా ఆయన కర్ణాటక గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వంతో తన అనుబంధాన్ని చాటుకుంటారు.
ఈ పర్యటన ద్వారా, శ్రీ రాధాకృష్ణన్ గారి సందర్శన ఆధ్యాత్మికత, విద్య, సాంస్కృతిక పరిరక్షణల కలయికను ప్రతిబింబిస్తుంది. ఇది రాష్ట్ర మత, విద్యా సంస్థలతో ఒక ముఖ్యమైన అనుబంధాన్ని సూచిస్తుంది.
