Let's talk: editor@tmv.in
కర్ణాటక ప్రజలకు అందుబాటులోకి ‘కియో’

కర్ణాటక ప్రజలకు అందుబాటులోకి ‘కియో’

Pinjari Chand
19 నవంబర్, 2025

కర్ణాటకలో డిజిటల్‌ చేరికను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘కియో’ అనే పేరుగల స్వంత ఏఐ-రెడీ పర్సనల్‌ కంప్యూటర్ ను గ్లోబల్ సమ్మిట్ లో ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ ప్రతి ఇంటికి, ప్రతి విద్యార్థికి, ప్రతి చిన్న వ్యాపారికి టెక్నాలజీ చేరాలి. అందరికీ అందుబాటులో ఉండేలా, చవక ధరల్లో లభించేలా ఈ కియోను తయారు చేశామన్నారు. ఓపెన్‌ సోర్స్‌ ఆర్కిటెక్చర్‌పై రూపొందించిన ఈ డివైస్‌లో ఆన్‌-డివైస్‌ స్మార్ట్‌ ఇంటెలిజెన్స్‌ ఉందని, దీని వల్ల విద్య, నైపుణ్యాలు, ఇన్నోవేషన్‌ ప్రతి ఇంటికీ చేరుతాయని సీఎం చెప్పారు.“డిజిటల్‌ పరంగా ఉన్న అవరోధాలను తొలగించడం మా ప్రభుత్వ ముఖ్య లక్ష్యం. ఏ యువ మేధస్సు వెనుకబడకూడదు. రేపటి ఏఐ ఆధారిత ప్రపంచానికి కర్ణాటక ప్రజలను సిద్ధం చేయడానికి కియో ఒక కీలక మెట్టుగా నిలుస్తుంది అని ప్రకటించారు.

బెంగళూరు టెక్‌ సమ్మిట్‌పై ప్రపంచ దృష్టి:డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

రాష్ర్ట రాజధాని బెంగళూరు టెక్‌ సమ్మిట్‌–2025తో మరోసారి ప్రపంచ దృష్టి ఐటీ రాజధాని వైపు మళ్లిందని ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌ అన్నారు. దాదాపు 60 దేశాల ప్రతినిధులు పాల్గొనడం బెంగళూరుపై గ్లోబల్‌ ఆసక్తికి నిదర్శనమన్నారు. ప్రపంచ నేతలందరూ బెంగళూరులో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. ఇంతటి టాలెంట్‌ పూల్‌ ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియాతో శివకుమార్‌ మాట్లాడుతూ బెంగళూరులో 25 లక్షలకు పైగా ఐటీ నిపుణులు పనిచేస్తున్నారని, పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, గ్రేటర్‌ బెంగళూరు పరిధిలో కొత్త ఐటీ సిటీ ప్రణాళిక సిద్ధమైంది. బిడదిలో మరో ఐటీ సిటీపై కార్యాచరణ మొదలైందని తెలిపారు.

వివిధ దేశాల నాయకులు వరుసగా నన్ను కలుస్తున్నారు. ఇక్కడ వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధమవుతున్నారు. వారికి అవసరమైన సాయం అందించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని డీకే ఎస్‌ స్పష్టం చేశారు. స్టార్టప్‌లు, ఇన్నోవేషన్‌, యువత ప్రతిభ కర్ణాటకను కొత్త దిశలో తీసుకెళ్తాయని పేర్కొంటూ యువత గ్లోబల్‌ లెవెల్‌లో పోటీకి సిద్ధమవ్వాలి, అవకాశాల కోసం కర్ణాటకకు వచ్చే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఐటీ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే, కియోనిక్స్‌ చీఫ్‌ షరత్‌ బచ్చే గౌడ పనితీరును శివకుమార్‌ అభినందించారు. రాబోయే మూడు రోజులు టెక్‌ సమ్మిట్‌లో భవిష్యత్తు ఐటీ దిశపై చర్చించబడతాయి అని తెలిపారు.

బెంగళూరు రోడ్ల మరమ్మతులపై కొన్ని కంపెనీలు ప్రభుత్వాన్ని ప్రశంసించిన విషయంపై స్పందిస్తూ ప్రశంసలైనా… విమర్శలైనా… రెండింటిని స్వాగతిస్తాం. మా ముఖ్య ధ్యేయం ప్రజలకు సేవ చేయడమే అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. గ్లోబల్‌ సమ్మిట్ మంగళవారం నుంచి గురువారం వరకు జరగనుంది.

కర్ణాటక ప్రజలకు అందుబాటులోకి ‘కియో’ - Tholi Paluku