
కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం
కర్ణాటక శాసనసభలో బుధవారం తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్సైజ్ శాఖలో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ, ఎక్సైజ్ మంత్రి ఆర్.బి. తిమ్మాపూర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, జేడీ(ఎస్) సభ్యులు సభలో నిరసనకు దిగారు. మద్యం లైసెన్సుల మంజూరు, అధికారుల బదిలీల విషయంలో మంత్రి తిమ్మాపూర్‌తో పాటు ఆయన కుమారుడిపై అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ రాజీనామా చేయడానికి ఆయన నిరాకరించడంతో, ప్రతిపక్షాలు మంగళవారం రాత్రంతా అసెంబ్లీలో ఆందోళన చేపట్టాయి.
బుధవారం సభ ప్రారంభమైన వెంటనే బీజేపీ, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు సభ వెల్‌లోకి వెళ్లి మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేత ఆర్. అశోక మాట్లాడుతూ, ఎక్సైజ్ శాఖలో లైసెన్సుల మంజూరు, అధికారుల బదిలీల కోసం లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. వైన్ వ్యాపారుల సంఘం ప్రకారం ఈ కుంభకోణం విలువ దాదాపు రూ.6,000 కోట్లుగా ఉందని, దీనికి సంబంధించిన ఆడియో రికార్డింగులు బయటకు వచ్చాయని, లోకాయుక్తకు ఫిర్యాదులు కూడా దాఖలయ్యాయని తెలిపారు.
ఈ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలుగా మూడు పెన్‌డ్రైవ్‌లను సభలో సమర్పించామని, మంత్రికి కమిషన్లు వెళ్తున్నాయని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చేసిన ప్రకటనలు కూడా ఉన్నాయని అశోక చెప్పారు. మంత్రి వెంటనే రాజీనామా చేసి విచారణకు సహకరించాలని ఆయన డిమాండ్ చేశారు. మూడు నెలల విచారణ తర్వాత ఆయన నిర్దోషిగా తేలితే తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. గతంలో కాంగ్రెస్‌కు చెందిన కె.జె. జార్జ్, బీజేపీకి చెందిన కె.ఎస్. ఈశ్వరప్ప ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేశారని అశోక గుర్తు చేశారు. మంత్రి మీద చర్యలు తీసుకోకపోవడంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు గుప్పించారు. సిద్ధరామయ్య నైతికత గురించి మాట్లాడతారు, కానీ ఈ వ్యవహారంలో ఆయన నైతికత ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు.
లోక్‌సభ ఎన్నికల కోసం వాల్మీకి ఎస్టీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధులను అధికార కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేసిందని కూడా అశోక ఆరోపించారు. కాంగ్రెస్ కర్ణాటకను తమ ఎన్నికల కోసం ఏటీఎంగా ఉపయోగిస్తోంది. ఇప్పుడు అది రిజర్వ్ బ్యాంక్‌గా మారిందని స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో బీజేపీ, జేడీ(ఎస్) సభ్యులు మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు కొనసాగించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. ప్రతిపక్షాలు నిరసన ఉపసంహరించుకోవాలని స్పీకర్ యుటి ఖాదర్ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రవేశపెట్టిన వీబీ-జీ రాం జీ చట్టాన్ని రద్దు చేసి,ఎంజీఎన్రేగా ను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై చర్చను కొనసాగించేందుకు కాంగ్రెస్ సభ్యులకు ఆయన అనుమతి ఇచ్చారు. అయితే, నినాదాలు మరింత తీవ్రం కావడంతో, చైర్‌లో ఉన్న డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప మానప్ప లమాని సభను కొంతసేపు వాయిదా వేశారు.
