
కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం ‘కుల’ రచ్చ
కర్ణాటకలో ఎడతెగని సీఎం మార్పు అంశం కొత్త మలుపు తీసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డికె శివకుమార్‌కు మద్దతుగా కుల సంఘాలు బయల్దేరాయి. గురువారం పోటాపోటీగా నిరసన ప్రదర్శనలు చేశారు. గట్టిగా సవాళ్లు విసిరారు. ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించవద్దని కాంగ్రెస్‌ను హెచ్చరించగా, మరొక వర్గం శివకుమార్ పదోన్నతి కోసం బలంగా మాట్లాడింది. ఈ గొడవకు ముగింపు పలకాలని కాంగ్రెస్ హైకమాండ్ పై ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో, పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ఈ విషయాన్ని పరిష్కరించడానికి రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య-శివకుమార్ ద్వయంతో పార్టీ అధిష్టానంతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
సీఎంను మార్చాల్సిన అవసరం లేదు
మా నాన్నే సీఎం అని, మార్చాల్సిన అవసరం లేదని సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర స్పష్టంచేశారు. ఆయన మంచి పాలన అందిస్తున్నారనీ, ఎలాంటి అవినీతి ఆరోపణలూ లేవనీ, ఎమ్మెల్యేలు కూడా ఆయనతో ఉన్నారని అన్నారు. మధ్యలో సీఎంను మార్చాల్సిన లాజిక్ లేదని బలంగానే చెప్పారు.
అవకాశం ఇస్తే నిరూపించుకుంటా
ముఖ్యమంత్రి రేసులో ఉన్న మరో నాయకుడు జి. పరమేశ్వర మాట్లాడుతూ పార్టీ హైకమాండ్ త్వరలోనే ఈ విషయాన్ని పరిష్కరిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, తన అనుభవం, నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకుని అత్యున్నత పదవిని అప్పగిస్తే ప్రజలకు సేవ చేస్తానని, కాంగ్రెస్ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.
సీఎంను మారిస్తే తీవ్ర పరిణామాలు
సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి దిగిపొమ్మని బలవంతం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అహిందా (మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, దళిత వర్గాలు) వర్గం కాంగ్రెస్‌ను హెచ్చరించగా, శివకుమార్‌కు ఎటువంటి అన్యాయం జరగకూడదని ఒక్కలిగా సంస్థ పేర్కొంది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన శివకుమార్, కెంగల్ హనుమంతయ్య, కెసి రెడ్డి, హెచ్‌డి దేవెగౌడ, ఎస్ఎం కృష్ణ, సదానంద గౌడ, హెచ్‌డి కుమారస్వామి రాష్ట్ర అత్యున్నత పదవులను ఆక్రమించిన ఒక్కాలిగ సామాజిక వర్గానికి చెందినవారే.
సిద్ధరామయ్యకు అన్యాయం చేయొద్దు
కర్ణాటక వెనుకబడిన తరగతుల సమాఖ్య అధ్యక్షుడు కె.ఎం. రామచంద్రప్ప కూడా డీకే వర్గీయులకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సిద్ధరామయ్య మీద ఒక్క కుంభకోణం ఆరోపణ కూడా లేదు. ఆయన్ను దించే ప్రయత్నం చేస్తే కదం తొక్కుతామన్నారు. ఒక్కాలిగ మఠాలు రోడ్డెక్కితే మేమూ రోడ్డెక్కుతాం. అహిందా ఓటు బ్యాంకు 70 శాతం ఈ ప్రభుత్వానికి ఇచ్చిన సంగతిని మర్చిపోకండి అని తెలిపారు.
డీకే వల్లే అధికారంలోకి
ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్న శివకుమార్‌కు అన్యాయం జరిగితే తీవ్రంగా పోరాడతామని కర్ణాటక రాజ్య ఒక్కాళిగ నగర సంఘం కాంగ్రెస్ హైకమాండ్‌ను హెచ్చరించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, శివకుమార్ కష్టపడి పనిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. పార్టీని బలోపేతం చేశారు. ఆయన ప్రయత్నాల వల్ల కాంగ్రెస్ 140 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని సంఘ అధ్యక్షుడు ఎల్ శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో అన్నారు. 2023 నాటి అధికార భాగస్వామ్య ఒప్పందం గురించి ప్రస్తావిస్తూ, సిద్ధరామయ్య శివకుమార్‌కు అధికారాన్ని అప్పగిస్తారా? లేదా అనే సందేహాలు ఉన్నాయని ఆయన అన్నారు. మేం కాంగ్రెస్ హైకమాండ్‌ను అభ్యర్థిస్తున్నాం. శివకుమార్ చేసిన కృషికి కనీసం 'కూలీ' (ప్రతిఫలం ) అయినా ఇవ్వాలని, ఆయన పార్టీ కోసం జైలు జీవితం కూడా గడిపారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన సైనికుడికి ఎటువంటి అన్యాయం జరగకూడదు. శివకుమార్‌కు అన్యాయం జరిగితే మేం తీవ్రంగా పోరాడుతామని ఒక్కాలిగ పీఠాధిపతుల సాధువు శివకుమార్‌కు మద్దతుగా మాట్లాడారు.
త్వరలోనే ముగింపు పలుకుతాం
ఈ కుల యుద్ధం మధ్య త్వరలోనే ఈ అంశానికి ముగింపు పలుకుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం స్పష్టం చేశారు. ఢిల్లీ వెళ్లగానే రాహుల్ గాంధీతో కలిసి సిద్ధరామయ్య, డీకేఎస్, పరమేశ్వరతో సహా ముఖ్య నేతలతో మీటింగ్ పెడతాం. ఈ వారంలోనే ఈ గందరగోళానికి ఫుల్‌స్టాప్ పెడతామని హామీ ఇచ్చారు.
