Let's talk: editor@tmv.in
కర్ణాటకలో ‘సామాజిక బహిష్కరణ’పై అసెంబ్లీలో బిల్లు

కర్ణాటకలో ‘సామాజిక బహిష్కరణ’పై అసెంబ్లీలో బిల్లు

Pinjari Chand
12 డిసెంబర్, 2025

కర్ణాటక ప్రభుత్వం గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ఒక ముఖ్యమైన బిల్లును ప్రవేశపెట్టింది. వ్యక్తి లేదా వ్యక్తుల సమూహంపై, ముఖ్యంగా కుల పంచాయతీలు సామాజిక బహిష్కరణ (సోషల్ బాయ్‌కాట్) విధించడాన్ని పూర్తిగా నిషేధిస్తూ, దాన్ని నేరంగా పరిగణించే ‘కర్ణాటక సోషల్ బాయ్‌కాట్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) బిల్-2025’ను సామాజిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్.సి. మహదేవప్ప ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా లేదా రెండూ కలిపి విధించే నిబంధనలు ఉన్నాయి.

బిల్లులో 20 రకాల సామాజిక బహిష్కరణలను స్పష్టంగా నిర్వచించారు. వాటిలో కొన్ని

• వ్యక్తితో వ్యాపారం చేయడం, ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించడం

• సేవలు అందించే అవకాశాలను అడ్డుకోవడం

• సామాజిక, మతపరమైన కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొనడాన్ని నిరోధించడం

• సామాజిక ఒస్త్రాసిజం (కులం ఆధారంగా బహిష్కరించడం)

• సౌకర్యాలకు అడ్డంకులు కల్పించడం

• సంబంధాలు తెంచుకోవడం మొదలైనవి ఉన్నాయి.

కుల పంచాయతీలు, సమాజంలోని వివిధ సంఘాలు ఇలాంటి అరాచక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల గౌరవప్రదమైన జీవితానికి ఆటంకం కలిగిస్తున్నాయని బిల్లులో పేర్కొన్నారు.

పాల్గొన్నా నేరమే

ఇలాంటి చర్యలు సమాజంలో ద్వేషం, అసహనం పెంచుతున్నాయని, ప్రస్తుత చట్టాలు ఈ సమస్యను అరికట్టడానికి సరిపోవడం లేదని ప్రభుత్వం అభిప్రాయపడింది. మరో ముఖ్య అంశం.. సామాజిక బహిష్కరణ విధించేందుకు సమావేశమై చర్చించినా అది చట్టవిరుద్ధమే, అలాంటి సమావేశాలకు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. నేరానికి సహాయం చేసినా, ప్రేరేపించినా 3 ఏళ్ల జైలు లేదా రూ. లక్ష జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఈ నేరాలన్నీ కాగ్నిజబుల్, బెయిలబుల్‌గా ఉంటాయి. ఈ చట్ట అమలు కోసం ప్రత్యేకంగా ‘సోషల్ బాయ్‌కాట్ ప్రొహిబిషన్ ఆఫీసర్’ను నియమించే నిబంధన కూడా ఉంది. అదే సమయంలో ప్రభుత్వం మరో బిల్లు కూడా టేబుల్ చేసింది. ‘గ్రేటర్ బెంగళూరు గవర్నెన్స్ (సెకండ్ అమెండ్‌మెంట్) బిల్-2025’. దీన్ని డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ తరపున మంత్రి మహదేవప్ప ప్రవేశపెట్టారు. ఇందులో లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలి సభ్యులను గ్రేటర్ బెంగళూరు అథారిటీలో సభ్యులుగా చేర్చడం, చీఫ్ సెక్రటరీ, అదనపు చీఫ్ సెక్రటరీలను ఎక్స్-అఫీషియో సభ్యులుగా నియమించడం, కొత్తగా చేరిన ప్రాంతాల్లో వార్డు పునర్విభజన, ఎన్నికల నిర్వహణకు స్పష్టత తీసుకొచ్చే నిబంధనలు ఉన్నాయి.

మొదటి రాష్ట్రం మహారాష్ట్ర

2016లో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజలను సామాజిక బహిష్కరణ పై సోషల్‌ బాయ్ కాట్ యాక్ట్ ను తీసుకువచ్చింది. 2017లో ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది.చట్ట ప్రకారం కుల పంచాయతీలు లేదా కమ్యూనిటీ గ్రూపులు చేసే సామాజిక బహిష్కరణను నేరంగా పరిగణిస్తుంది. అలాగే ఇందుకు పాల్పడే వారికి జైలు + జరిమానా శిక్షలు ఉంటాయి.

కర్ణాటకలో ‘సామాజిక బహిష్కరణ’పై అసెంబ్లీలో బిల్లు - Tholi Paluku