Let's talk: editor@tmv.in
కర్ణాటకలో మళ్లీ ‘సీఎం’ నినాదాలు

కర్ణాటకలో మళ్లీ ‘సీఎం’ నినాదాలు

Pinjari Chand
4 డిసెంబర్, 2025

సీఎం, డిప్యూటీ సీఎం ఐక్యంగా ఉన్నామని తెలిపేందుకు ఒకరి ఇంట్లో మరొకరు బ్రేక్​ ఫాస్ట్​ లు చేసి సీఎం మార్పు ఊహగానాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. కానీ ద్వితీయ శ్రేణి నాయకులు ఇంకా ఈ విషయాన్ని పట్టుకునే ఉన్నారు. వారికి సర్ది చెప్పాల్సిన నాయకులు ఆ దిశగా ప్రయత్నించకపోవడంతో మళ్లీ సీఎం మార్పు నినాదాలు మొదలయ్యాయి. కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం మార్పు పంచాయితీలో ఉన్న అంతర్గత ఉద్రిక్తతలు మరోసారి బహిర్గతమయ్యాయి. బుధవారం మంగళూరు విమానాశ్రయానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్‌ చేరుకోగానే ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌కు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొద్ది సేపటికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేరుకోగానే ఆయన అనుచరులు పూర్ణావధి సిఎం సిద్దరామయ్య అంటూ డీకే అనుచరులకు కౌంటర్ గా ప్రతి నినాదాలు చేశారు.

సిద్దరామయ్య–శివకుమార్‌ జంట ఇటీవల వరుసగా బ్రేక్‌ఫాస్ట్ సమావేశాలు నిర్వహిస్తూ యూనిటీగా ఉన్నామన్న సంకేతాలను ఇచ్చారు. అయినా నినాదాలు చేయడంతో ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

మహాత్మ గాంధీ–నారాయణ గురు శతాబ్ది కార్యక్రమం

మంగళూరు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు వేణుగోపాల్‌ హాజరయ్యారు. సిద్దరామయ్య, పలు మంత్రులు పాల్గొన్నారు. అయితే శివకుమార్‌కు ఆహ్వానం పంపలేదని ఆయన అనుచర వర్గాలు పేర్కొన్నాయి.

శివన్న సిఎం అయితే సంతోషంగా ఉంటుంది

శివకుమార్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన కాంగ్రెస్‌ నాయకుడు మిథున్ రాయ్ మాట్లాడుతూ పార్టీ లోపల ఎటువంటి వ్యతిరేక వర్గాల్లేవని, కానీ శివకుమార్‌ ముఖ్యమంత్రి అయితే కార్యకర్తలు సంతోషంగా ఉంటారని తెలిపారు. ఇది ద్వితీయ శ్రేణిలో ఉన్న సహజమైన అభిమానమేనని ఆయన వ్యాఖ్యానించారు.

సిద్దరామయ్య శిబిరం నుంచి స్పష్టమైన సంకేతం

సిద్దరామయ్య చేరుకోగానే ఆయన అనుచరులు ‘సిద్ధు సిద్ధు… 2028 వరకూ సిద్దు అంటూ నినాదాలు చేశారు. దీంతో పూర్తి ఐదేళ్ల అధికారాన్ని కొనసాగించాలనే సంకేతం వెళ్లింది. ఈ మొత్తం పరిణామాల మధ్య మంగళూరు ఘటనను శివకుమార్‌ అనుచరుల అసంతృప్తి సంకేతంగానే పార్టీ వర్గాలు పరిగణిస్తున్నాయి.