Let's talk: editor@tmv.in
కర్ణాటకలో బ్రేక్‌ఫాస్ట్ తో ఫుల్‌స్టాఫ్ పడినట్లేనా?

కర్ణాటకలో బ్రేక్‌ఫాస్ట్ తో ఫుల్‌స్టాఫ్ పడినట్లేనా?

Pinjari Chand
30 నవంబర్, 2025

కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం కొన్ని నెలలుగా సాగుతున్న రాజకీయ రగడకు శనివారం ఉదయం ‘బ్రేక్​’ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. సీఎం, డీప్యూటీ సీఎం కలిసి బ్రేక్​ ఫాస్ట్(అల్పాహారం) చేసి కలిసి ఉన్నామని చెప్పే సంకేతాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ కలిసి ప్రజలకు మేం యూనిటీగా ఉన్నామని చెప్పారు. మా మధ్య విభేదాలంటూ ఏమీ లేవు. భవిష్యత్తులో కూడా ఉండవని ఇద్దరూ స్పష్టం చేశారు. సిద్ధరామయ్య కావేరి నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార సమావేశం తర్వాత ఇద్దరు నేతలు సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ హైకమాండ్ ఆదేశాల మేరకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మధ్య అధికార పోరు కొనసాగితే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రతిపక్ష బీజేపీ హెచ్చరించింది.

మీడియాలోనే చర్చ: సీఎం సిద్ధరామయ్య

మీడియా వల్లే కొంత గందరగోళం ఏర్పడింది. నేటికీ మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. భవిష్యత్తులో కూడా అలాంటివి ఉండవు. ఇప్పటి నుంచి అది రాకుండా నేను చూసుకుంటానని ఆయన అన్నారు. ఇదే సందర్భంలో పూర్తి 5 ఏళ్ల పదవీ కాలం నాకే ఇచ్చిన హైకమాండ్‌ నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు అనే సందేశం మాటల మధ్య వినిపించింది.

మా మధ్య విభేదాలు లేవు: డీకే

ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, అందువల్ల కాంగ్రెస్ వారి అంచనాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉందని శివకుమార్ అన్నారు. సీఎంతో విభేదాలను తోసిపుచ్చిన శివకుమార్ మా మధ్య వర్గ విభేదాలు లేవని అన్నారు. అందరినీ తీసుకువెళ్తాం. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.

2028లోనూ అధికారంలోకి వస్తాం

2028 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని, బెళగావిలో జరగనున్న కర్ణాటక శాసనసభ శీతాకాల సమావేశాల్లో బిజెపి అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తే దానిని ఎదుర్కోవడానికి ఉన్న మార్గాలను కూడా చర్చించినట్లు శివకుమార్ తెలిపారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నాయకత్వంలో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. దేశంలో పార్టీ చాలా క్లిష్ట దశలో ఉంది. కర్ణాటక (దాని పునరుద్ధరణలో) ప్రధాన పాత్ర పోషిస్తుందనే నమ్మకం మాకు ఉంది. 2028లో కూడా మేం అధికారంలోకి వస్తామని ఆయన అన్నారు.

సోషల్ మీడియాలోనూ ‘ఐక్యత’ ప్రచారం

బ్రేక్ ఫాస్ట్ తర్వాత సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లో శివకుమార్ మాట్లాడుతూ ఇద్దరి మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయని తెలిపారు. ‘ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఈ ఉదయం కావేరి నివాసంలో అల్పాహార సమావేశంలో కలిశాను. కర్ణాటక ప్రాధాన్యతలు, భవిష్యత్ లో తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి చర్చలు జరిగాయి’ అని ఆయన అన్నారు.

అందరి దృష్టి బ్రేక్‌ఫాస్ట్‌ ఫలితంపైనే

ఐదేళ్ల పదవీకాలం ముఖ్యమంత్రిగా కొనసాగడానికి తనకు ఆదేశం లభించిందని సిద్ధరామయ్య చెబుతుండగా, రెండున్నర సంవత్సరాల తర్వాత తనను రొటేషన్ ప్రాతిపదికన ముఖ్యమంత్రిగా నియమిస్తామని హామీ ఇచ్చినట్లు శివకుమార్ సూచించారు. రెండు నెలలుగా నాయకత్వ మార్పు అంశం కొనసాగుతూనే ఉంది. కానీ సీఎంగా సిద్ధ రాయమ్య 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నవంబర్ 20 తర్వాత సీఎం కుర్చీపై పోరు తీవ్రంగా మారింది.

శుక్రవారం కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం చేసుకుని, ఇద్దరు నాయకులు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని కోరింది. దీంతో సిద్ధరామయ్య డీకే శివకుమార్ ను బ్రేక్ ఫాస్ట్ కు ఇంటికి రావాలని ఆహ్వానించారు. అయితే బ్రేక్​ ఫాస్ట్ లో ఇడ్లీ, వడ, సాంబార్, చట్నీ ఉప్మా (ఉప్మా) మెనూలో ఉన్నాయని సీఎంవో వర్గాలు తెలిపాయి.

కర్ణాటకలో బ్రేక్‌ఫాస్ట్ తో ఫుల్‌స్టాఫ్ పడినట్లేనా? - Tholi Paluku