
కర్ణాటకలో డిజిటల్ అరెస్ట్ .. వ్యాపారికి రూ.15 కోట్ల టోకరా
కర్ణాటక రాష్ట్రంలోని బెలగావిలో 81 ఏళ్ల వయస్సు గల ఓ వ్యాపారి ‘డిజిటల్ అరెస్ట్’ పేరిట జరిగిన మోసానికి గురై రూ.15 కోట్లకు పైగా కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులుగా నటించిన మోసగాళ్లు ఈ నేరానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం బాధితుడికి సుమారు ఆరు వారాల పాటు పలుమార్లు ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ వచ్చాయి. మోసగాళ్లు అతనిపై ఆర్థిక నేరాల్లో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ, రూ.25 లక్షలను అక్రమంగా మార్పిడి చేయడంలో భాగంగా రూ.5 లక్షల కమిషన్ తీసుకున్నారని చెప్పారు. అతనిపై మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తామని బెదిరిస్తూ, అతని బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర ఆర్థిక సమాచారం పంచుకునేలా ఒత్తిడి చేశారు. తరువాత ‘సురక్షిత’ లేదా ‘ప్రభుత్వ ఖాతా’ పేరుతో డబ్బు బదిలీ చేయాలని చెప్పి మోసం చేశారు. విచారణ పూర్తయ్యాక మొత్తం తిరిగి ఇస్తామని నమ్మబలికారు.
కొంతకాలం తర్వాత ఎలాంటి స్పందన రాకపోవడంతో పాటు, ఫోన్ నంబర్లు అందుబాటులో లేకపోవడం గమనించిన బాధితుడు అనుమానం వ్యక్తం చేసి గత వారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన సైబర్, ఎకనామిక్ అండ్ నార్కోటిక్స్ (సీఈఎన్) పోలీస్ స్టేషన్ అధికారులు డబ్బు బదిలీ అయిన ఖాతాను గుర్తించి రూ.90 లక్షలను మాత్రమే తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా, నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడానికి బెలగావి పోలీస్ కమిషనర్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
