Let's talk: editor@tmv.in
కర్ణాటకలో ఖనిజాల అన్వేషణకు సింగరేణి శ్రీకారం

కర్ణాటకలో ఖనిజాల అన్వేషణకు సింగరేణి శ్రీకారం

Pinjari Chand
29 ఆగస్టు, 2026

కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లా దేవదుర్గ బ్లాక్‌లో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ ఈ బ్లాక్‌లో ఖనిజ అన్వేషణ హక్కులను దక్కించుకుంది. దేవదుర్గలోని లింగదహళ్లి గ్రామంలో గురువారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన క్షేత్రస్థాయిలో ఖనిజ అన్వేషణ ప్రాంతాలను పరిశీలించారు. సుమారు 136 ఏళ్లుగా మైనింగ్‌ రంగంలో సింగరేణికి విస్తృత అనుభవం ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్ల ద్వారా దేవదుర్గ బ్లాక్‌లో అన్వేషణ హక్కులను సింగరేణి దక్కించుకుందని చెప్పారు. ఇకపై అన్వేషణ కార్యకలాపాలను మరింత వేగవంతం చేయనున్నట్లు వెల్లడించారు. బంగారం, రాగి గణనీయమైన పరిమాణంలో లభిస్తే ఈ ప్రాజెక్టు విజయవంతమవుతుందని, తద్వారా స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడటంతో పాటు ప్రాంతీయ అభివృద్ధి వేగవంతమవుతుందని ఉప ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

దేవదుర్గలో సింగరేణి కార్యాలయం

అన్వేషణ పనులను పర్యవేక్షించేందుకు దేవదుర్గలో త్వరలో సింగరేణి సైట్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు భట్టి తెలిపారు. అధికారులు అక్కడే ఉండి కార్యకలాపాలను పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. అలాగే అధికారుల రాకపోకలకు వీలుగా హెలిప్యాడ్‌ కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు అవసరమైన భూమిని స్థానిక రెవెన్యూ అధికారులు కేటాయించిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఖనిజ అన్వేషణ ప్రాజెక్టును త్వరగా విజయవంతం చేసేందుకు స్థానిక ప్రజలు సహకరించాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడటంతో పాటు దేశ ఖనిజ సంపదను పెంచి ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం దేవదుర్గ గోల్డ్‌ మినరల్‌ బ్లాక్‌లో అన్వేషణకు గుర్తించిన ప్రాంతాలను భట్టి పరిశీలించారు. సింగరేణి అధికారులు సేకరించిన వివిధ ఖనిజ నమూనాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను సందర్శించారు. బంగారం, రాగి అన్వేషణ, వెలికితీతకు సంబంధించిన ప్రక్రియలు, ప్రణాళికలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్‌ జ్యోతి హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థ. ఇందులో తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంది.

కర్ణాటకలో ఖనిజాల అన్వేషణకు సింగరేణి శ్రీకారం - Tholi Paluku