
కర్ణాటకలో ‘కంబళా’ నిర్వహణకు సుప్రీం అనుమతి
కర్ణాటకలోని దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలకు మాత్రమే పరిమితం చేయకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ‘కంబళా’ పోటీలను నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం కొట్టివేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ సంప్రదాయ క్రీడను ప్రదర్శించడంలో తప్పేముంది అని కోర్టు వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు విక్రమ్‌నాథ్, సందీప్‌మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. జంతు హక్కుల సంస్థ పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పేటా ఇండియా) ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఇందులో భాగంగా కర్ణాటక హైకోర్టు 2025 నవంబర్ 14న ఇచ్చిన తీర్పును పేటా ఇండియా సవాలు చేసింది. ఆ తీర్పులో దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల వెలుపల కూడా కంబళా నిర్వహించేందుకు రాష్ట్రం నోటిఫికేషన్ జారీ చేయడాన్ని నిలిపివేయాలని చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది.
విచారణ సందర్భంగా న్యాయమూర్తి సందీప్ మెహతా వ్యాఖ్యానిస్తూ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సంస్కృతిని ప్రదర్శించాలనుకుంటే అందులో తప్పేముంది? ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఆ సంప్రదాయాన్ని తెలుసుకునే అవకాశం కలగాలి. ఎందుకు ఒక ప్రాంతానికే పరిమితం చేయాలి? అని ప్రశ్నించారు. అయితే పేటా తరఫు న్యాయవాది వాదిస్తూ, గతంలో సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో ఈ క్రీడ ప్రధానంగా తీరప్రాంత జిల్లాలైన దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల సంప్రదాయంగా పేర్కొన్నారని తెలిపారు. బెంగళూరులో దీన్ని నిర్వహించడం సంప్రదాయంతో సంబంధం లేదని వాదించారు. అయితే పిటిషన్‌ను కొట్టివేస్తూ ధర్మాసనం ఒక రోజు పేటా సంస్థకూ కొన్ని ప్రశ్నలు అడగాల్సి రావచ్చని వ్యాఖ్యానించింది.
ఇక 2023 మేలో సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు తీసుకొచ్చిన సవరణ చట్టాలను సమర్థించింది. ఈ చట్టాల ద్వారా జల్లికట్టు, ఎద్దుల బండి పందేలు, అలాగే కంబళా వంటి సంప్రదాయ క్రీడలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
‘కంబళా’ అనే ఈ సంప్రదాయ క్రీడ ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి మార్చి మధ్యకాలంలో కర్ణాటకలో నిర్వహిస్తారు. ఈ పోటీలో రెండు ఎద్దులను (మహిషాలను) నాగలి వంటి పరికరానికి కట్టి ఒక వ్యక్తి నియంత్రణలో మట్టి నీటితో నిండిన పొలంలో పరుగులు పెట్టిస్తారు. వేగంగా పరుగెత్తిన జట్టే విజేతగా నిలుస్తుంది.
