Let's talk: editor@tmv.in
కర్ణాటకలో ఎమ్మెల్యేలకు ఐపీఎల్‌ టికెట్ల వివాదం కొలిక్కి

కర్ణాటకలో ఎమ్మెల్యేలకు ఐపీఎల్‌ టికెట్ల వివాదం కొలిక్కి

Pinjari Chand
29 మార్చి, 2026

బెంగళూరులో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌కు రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యేకు రెండు టికెట్లు ఇవ్వడానికి కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (కేఎస్‌సీఏ) అంగీకరించినట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌‌ తెలిపారు. అయితే ఈ నిర్ణయం ‘వీఐపీ కల్చర్’కు ఉదాహరణగా మారిందంటూ విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌కు సంబంధించి టికెట్లు, సీటింగ్ సమస్యలపై అసెంబ్లీలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్‌‌ ప్రతి ఎమ్మెల్యేకు నాలుగు వీఐపీ టికెట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

ఈ విషయంపై కేఎస్‌సీఏ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ వెంకటేశ్‌ ప్రసాద్‌ నేతృత్వంలోని ప్రతినిధులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లతో సమావేశమయ్యారు. అనంతరం శివకుమార్ మాట్లాడుతూ, టికెట్లు ఇప్పటికే ఎక్కువగా అమ్ముడైపోవడంతో ప్రస్తుతం రెండు టికెట్లకే కేఎస్‌సీఏ అంగీకరించిందని తెలిపారు. ముందుగా ఒక్క టికెట్ మాత్రమే ఇస్తుండగా, ఇప్పుడు రెండుకు పెంచినట్లు చెప్పారు. ఎమ్మెల్యేలు వ్యవస్థలో భాగం, ప్రభుత్వంలో భాగం కాబట్టి వారికి హక్కు ఉందంటూ శివకుమార్ ఈ డిమాండ్‌ను సమర్థించారు. రాష్ట్రంలో 224 మంది ఎమ్మెల్యేలు, 28 మంది ఎంపీలు ఉన్నారు.

ప్రతిపక్షాల విమర్శలు

అయితే ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వీ సూర్య ఎమ్మెల్యేలు టికెట్ల కోసం అడగడం, బెదిరించడం సరైనది కాదని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమయంలో టికెట్లపై దృష్టి పెట్టడం ప్రజాస్వామ్య గౌరవాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రత్యేక హక్కులు ఆశించకూడదని, ఇది వీఐపీ మైండ్‌సెట్ అని విమర్శించారు. దీనికి ప్రతిగా శివకుమార్ తేజస్వి సూర్య తన సలహాలు తన పార్టీకి ఇవ్వాలంటూ స్పందించారు. ఇక ప్రతిపక్ష నాయకుడు ఆర్‌‌.అశోక మాట్లాడుతూ, తాము టికెట్లు వ్యక్తిగతంగా వినియోగించుకోవడానికి కాకుండా తమ నియోజకవర్గాల్లోని క్రీడాకారులు, అభిమానులకు ఇవ్వాలనుకున్నామని స్పష్టం చేశారు. ఉచితంగా టికెట్లు కోరలేదని కూడా తెలిపారు. అయితే కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఈ అంశంపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యేలు ప్రత్యేక హక్కులు కోరడం తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నానని చెప్పారు.

ప్రజా సమస్యలు పక్కదారి.. టికెట్లపై చర్చ

ఇదిలా ఉండగా, సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే ఎస్‌ఎస్. సురేశ్‌కుమార్‌‌ ఈ నిర్ణయాన్ని ‘వీఐపీ కల్చర్’గా అభివర్ణిస్తూ, తాను ఆ టికెట్లను తీసుకోనని ప్రకటించారు. సురేశ్ కుమార్ మాట్లాడుతూ సామాజికవాదాన్ని ప్రకటించే ప్రభుత్వం కూడా ఇలాంటి వీఐపీ సంస్కృతిని ప్రోత్సహించడం ఆశ్చర్యకరం. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో టికెట్లపై చర్చ జరగడం ప్రజల్లో నాయకులపై అవమానాన్ని పెంచుతుందని వ్యాఖ్యానించారు. గత ఏడాది చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను గుర్తుచేస్తూ, ప్రజల భద్రతపై దృష్టి పెట్టాల్సిన సమయంలో టికెట్ల కోసం పోటీ పడటం సరికాదని ఆయన అన్నారు. మనం ప్రజాసేవకులమని చెప్పుకుంటాం. కానీ ఇలాంటి వీఐపీ కల్చర్‌ను కొనసాగిస్తే ప్రజల కళ్లలో మన విలువ తగ్గుతుందంటూ సురేశ్ కుమార్ టికెట్లను నిరాకరించారు. ఈ వివాదం ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

కర్ణాటకలో ఎమ్మెల్యేలకు ఐపీఎల్‌ టికెట్ల వివాదం కొలిక్కి - Tholi Paluku