
కరూర్ బాధితులకు నష్ట పరిహారం అందించాం: సీఎం స్టాలిన్
కరూర్ తొక్కిసలాట ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చినట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ బుధవారం అసెంబ్లీలో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 27న కరూర్‌లో ప్రాణాలు కోల్పోయిన 41 మందికి సంబంధించిన బాధిత కుటుంబాలకు మొత్తం 4.87 కోట్ల రూపాయల నష్టపరిహారం అందించామని తెలిపారు. ఈ దుర్ఘటన సరైన క్రౌడ్ మేనేజ్‌మెంట్ లేకపోవడం వల్ల జరిగిందని. ఘటన ఆందోళన, ఊపిరి ఆడకపోవడం వల్ల మహిళలు, పిల్లలు ప్రభావితమయ్యారని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు రాకుండా చూసేందుకు ప్రభుత్వం ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను రూపొందిస్తున్నది తెలిపారు.
తమిళ వెట్రి కళగం (టీవీకే) ర్యాలీ నిర్వాహకులు ర్యాలీ ప్రదేశంలో వచ్చిన వారికి కనీసం తినుబండారాలు, నీరు, మరుగుదొడ్లకు సంబంధించిన వసతులను కూడా ఏర్పాటు చేయలేదన్నారు. పెద్ద ప్రజాసమూహాన్ని నియంత్రించేందుకు సురక్షిత చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమానికి 606 పోలీసులు, తదితర అధికారులు విధుల్లో నిర్వహించారని,టీవీకే నాయకుడు విజయ్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా దాదాపు 7 గంటలు ఆలస్యంగా వచ్చారన్నారు. దీంతో ప్రజలు మరింత పెరిగారన్నారు. పోలీసుల సూచనలను పక్కన పెట్టి క్యాంపెయిన్ వాహనం సమూహాంలోకి ప్రవేశించటంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగిందని, దీంతో మహిళలు పిల్లలకు ఊపిరి అందక పడిపోయారన్నారు. అక్కడే ఉన్న పోలీసులు అంబులెన్స్‌లకు సమాచారమిచ్చారన్నారు. కొంతమంది జనరేటర్ గదిలోకి ప్రవేశించి పవర్ ఆఫ్ చేశారన్నారు. అలాగే టీవీకే కార్యకర్తలు అక్కడికి చేరుకున్న రెండు అంబులెన్స్‌లపై దాడి చేసి, సహాయక చర్యలకు అడ్డుపడ్డారన్నారు. దీంతో బాధితుల తరలింపు ఆలస్యమైందని వివరించారు.
కొంతమందిని అరెస్ట్ చేశాం
మొదటి వ్యక్తిని సాయంత్రం 7:47 గంటలకు హాస్పిటల్‌లో చేర్చారని, ఈ ఘటనకు సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేశామన్నారు. ఘటన తెలుసుకున్న వెంటనే కరూర్ చేరి, బాధిత కుటుంబాలను కలిసి, హాస్పిటల్ సిబ్బంది, వైద్యాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించామని సీఎం తెలిపారు. గాయపడిన వారికి చికిత్స అందించడానికి ప్రభుత్వం 400 అదనపు బెడ్‌లు ఏర్పాటు చేసిందని, 152 మంది ఆరోగ్య సిబ్బందిని కూడా నియమించిందన్నారు. గాయపడిన వారిలో ఒకరిని తప్ప అందరూ కోలుకుని ఇంటికి వెళ్లారన్నారు. మృతి చెందినవారికి సంబంధించిన పోస్టు మార్టమ్ కోసం మార్చురీలో సౌకర్యాలు తక్కువగా ఉన్నందున కలెక్టర్ ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో 24 మంది డాక్టర్లు 39 పోస్టుమార్టమ్లను సెప్టెంబర్ 27–28 మధ్య పూర్తి చేశారన్నారు. సుప్రీం కోర్టు ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వారి నివేదికల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందన్నారు.
సీఎం స్టాలిన్ ఉద్వేగం
మేం ఎల్లప్పుడూ భద్రత ఏర్పాట్ల ప్రకారం, ప్రచార నియమాలు పాటిస్తూ ప్రచార ర్యాలీలను నిర్వహించామని సీఎం స్టాలిన్ 50 ఏళ్ల రాజకీయ అనుభవం గురించి తెలిపారు. ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యమైనవి. ఏ నాయకుడూ తన కార్యకర్తలు ప్రాణాలు కోల్పోతుండగా చూడాలనుకోరు అని ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ దుర్ఘటన రాష్ట్రంలో భద్రతా, భారీ ప్రజా సమూహాలను నియంత్రించే పద్ధతులను పటిష్టం చేసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టంగా చూపిందని, ఆ దిశలో ప్రభుత్వ విధి విధానాలు రూపొందించాలని సీఎం స్టాలిన్ తెలిపారు. ఈ సందర్భంగా కరూర్ బాధితులకు సంతాపం ప్రకటించారు. ‘కరూర్‌లో జరిగిన తొక్కిసలాట అత్యంత విషాద సంఘటన. ఈ దారుణ ఘటనపై ఏ వ్యక్తిని శిక్షించాలనే లేదా బలి చేసే ఉద్దేశం మాకు లేదు. అయినప్పటికీ కొందరు అనవరసరంగా ప్రభుత్వం మీద అబద్దాలను ప్రచారం చేస్తున్నప్పుడు, జరిగిన నిజాన్ని స్పష్టం చేయడం మా కర్తవ్యం’. –శాసనసభ శీతకాల సమావేశంలో సీఎం స్టాలిన్
రాష్ట్ర ప్రభుత్వం తరపున పరిహారం అందినప్పటికీ ఇంకా టీవీకే నాయకుడు, సినీనటుడు విజయ్ ప్రకటించిన రూ.20లక్షల పరిహారం ఇంకా బాధిత కుటుంబాలకు అందలేదు. అలాగే కేంద్రప్రభుత్వం ఇస్తామన్న ఎక్స్ గ్రేషియా కూడా అందలేదు. దీంతో ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి.
