
కరూర్ తొక్కిసలాట ఘటన విచారణ వేగవంతం
తమిళ వెట్రికళగం ప్రచార ర్యాలీలో వెలుసామిపురంలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి సీబీఐ దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ఆదివారం ఎనిమిది మంది స్థానిక వ్యాపారులు, వ్యాపారులు విచారణకు హాజరయ్యారు. సెప్టెంబర్ 27న జరిగిన ఈ దుర్ఘటనలో 41 మంది మృతి చెందారు. సుమారు 90 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన అనంతరం తమకు అనుమానలున్నాయని సీబీఐతో విచారణ చేయించాలని టీవీకే పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ కొనసాగిస్తోంది.
విజయ్ సభలో
తమిళ వెట్రి కళగం (టీవీకే) నేత విజయ్ నిర్వహించిన సభలో జనం కిక్కిరిసిపోయారు. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలోతొక్కిసలాట జరిగి క్షణాల్లోనే 41 ప్రాణాలు బలయ్యాయి. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.
సీబీఐ సమన్లు –హాజరైన వ్యాపారులు
వెలుసామిపురం ప్రాంతంలోని ఒక పెట్రోల్ బంకు యజమాని, వస్త్ర దుకాణం, మొబైల్ షాప్, మెకానిక్ షాప్ యజమాని, తదితరులు సీబీఐ సమన్ల మేరకు విచారణకు హాజరయ్యారు. కరూర్ సర్క్యూట్ హౌస్‌లో ఈ విచారణ జరుగుతోంది. మొత్తం 100 మందికి పైగా వ్యక్తులకు సమన్లు జారీ చేసినట్లు సమాచారం.
లేజర్ స్కానర్‌తో ఆధారాల వేట
సీబీఐ అధికారులు రెండు రోజులుగా వెలుసామిపురం పరిసరాల్లో 3డీ లేజర్ స్కానింగ్, కొలతల పనులు నిర్వహిస్తున్నారు. సుమారు 700 మీటర్ల మేర పరిశీలన జరిపి సంఘటనకు దారితీసిన కారణాలను విశ్లేషిస్తున్నారు. శనివారం కూడా అధికారులు అదే పరికరాలతో మ్యాపింగ్ కొనసాగించారు.
దీపావళి తర్వాత విచారణ
అక్టోబర్ 17న సీబీఐ విచారణ ప్రారంభమైనప్పటికీ, దీపావళి దృష్ట్యా విరామం ఇచ్చారు. ప్రస్తుతం అధికారులు తిరిగి కరూర్ చేరుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ విచారణను పర్యవేక్షించడానికి మాజీ రిటైర్డ్ జడ్జీ అజయ్ రస్తొగీ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేశారు
