Let's talk: editor@tmv.in
కరూర్‌ తొక్కిసలాట ఘటనపై ‘సిట్‌’ విచారణ

కరూర్‌ తొక్కిసలాట ఘటనపై ‘సిట్‌’ విచారణ

Shaik Mohammad Shaffee
4 అక్టోబర్, 2025

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరూర్‌ తొక్కిసలాట ఘటనపై మద్రాస్‌ హైకోర్టు సిట్‌ విచారణకు ఆదేశించింది. ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) అస్రాగార్గ్‌ నేతృత్వంలో సిట్‌ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. కరూర్ పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను వెంటనే సిట్‌కి అందజేయాలని ధర్మాసనం పేర్కొంది. ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు ఎఫ్‌ఐఆర్‌లో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ పేరును ఎందుకు చేర్చలేదనే పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది.

ఘటన జరిగిన తర్వాత టీవీకే నేతలందరూ అక్కడి నుంచి వెళ్లిపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ప్రమాదాన్ని పట్టించుకోకుండా పార్టీ నేతలందరూ అలా వెళ్లిపోవడం వాళ్ల ఆలోచనా ధోరణిని తెలియజేస్తోందని పేర్కొంది. తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్‌ వాహనాన్ని ఎందుకు సీజ్‌ చేయలేదని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. 41 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విజయ్‌ పట్ల ఉదాసీనత ప్రదర్శించడంపై మండిపడింది. కరూర్‌లో ఏం జరిగిందో యావత్ ప్రపంచం చూసిందని పేర్కొంది. ఎక్కువ సంఖ్యలో వచ్చే ప్రజల కోసం తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత లేదా అని నిర్వాహకులు, పోలీసులను ధర్మాసనం ప్రశ్నించింది.

మరోవైపు ఈ తొక్కిసలాట కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టీవీకే నమక్కల్ జిల్లా కార్యదర్శి ఎన్.సతీష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. సెంథిల్వకుమార్ శుక్రవారం తోసిపుచ్చారు. టీవీకే చీఫ్ విజయ్ రోడ్ షో సందర్భంగా పార్టీ కార్యకర్తలు అల్లర్లు సృష్టించి, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినప్పుడు, గుంపును అదుపు చేయడంలో టీవీకే ఎందుకు విఫలమైంది అని న్యాయమూర్తి ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తల అదుపులేని ప్రవర్తనను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. సతీష్ కుమార్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ న్యాయవాది ఎస్.సంతోష్, పార్టీ సభ్యులపై, జిల్లా కార్యదర్శితో సహా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు సంబంధించిన తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని కోర్టుకు సమర్పించారు.

సీబీఐ దర్యాప్తు అభ్యర్థన తిరస్కరణ

టీవీకే తరఫు న్యాయవాది ఎంఎల్ రవి మదురైలో మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసుపై నిష్పాక్షిక దర్యాప్తు కోసం విచారణను సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ తాము దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం తిరస్కరించిందని తెలిపారు. కరూర్ పోలీసులు టీవీకే బహిరంగ సభకు అనుమతి ఇచ్చారని, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారని, విజయ్ అనుమతి పొందిన సమయానికే ప్రచారానికి వచ్చారని న్యాయవాది అన్నారు. తమిళనాడు ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తొక్కిసలాట గురించి కేవలం వాస్తవాలను తెలుసుకునే కమిటీ మాత్రమేనని, దానికి చట్టబద్ధమైన అధికారాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై తమిళనాడు పోలీసులు విచారణ జరపడం సరికాదని, నిష్పాక్షిక దర్యాప్తు కోసం విచారణను సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ వేశామని, అయితే మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం దానిని తిరస్కరించిందని ఆయన తెలిపారు.

మరోవైపు సీబీఐ దర్యాప్తు కోరుతూ బీజేపీ న్యాయవాది జీఎస్‌ మణి దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. ఇక విచారణ సందర్భంగా రాజకీయ పార్టీలకు హైకోర్టు కీలక సూచనలు చేసింది. భవిష్యత్తులో నిర్వహించే బహిరంగ సభలు, సమావేశాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు, ఆంబులెన్స్‌ సేవలు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని, ప్రజల ప్రాణాల రక్షణకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.

కరూర్‌ తొక్కిసలాట ఘటనపై ‘సిట్‌’ విచారణ - Tholi Paluku