Let's talk: editor@tmv.in
కరూర్ తొక్కిసలాట కేసు సీబీఐకి

కరూర్ తొక్కిసలాట కేసు సీబీఐకి

Aravind Maryada Reddy
14 అక్టోబర్, 2025

తమిళనాడులోని కరూర్‌లో టీవీకే అధినేత, నటుడు విజయ్ నిర్వహించిన సభలో సెప్టెంబర్ 27న చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనను సీబీఐకి బదిలీ చేయాలని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది. ఆ ఘటనలో 41 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డ విషయం తెలిసిందే. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్వీ అంజారియా‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అంతేకాకుండా ఈ కేసు విచారణను పారదర్శకంగా కొనసాగించేందుకు మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి, ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సీబీఐ దర్యాప్తు ప్రక్రియను పర్యవేక్షిస్తుంది.

గతంలో తీర్పు రిజర్వ్

కరూర్ తొక్కిసలాట ఘటనపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ పూర్తిచేసి తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ పిటిషన్లు టీవీకే పార్టీ, బాధితుల కుటుంబాలు, ఇతర పక్షాల తరఫున దాఖలయ్యాయి. అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం, ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వాన్ని బాధితుల తరఫున దాఖలైన సెంట్రల్ ఏజెన్సీ దర్యాప్తు కోరిన పిటిషన్‌లపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

పిటిషన్ దాఖలు చేసిన టీవీకే

టీవీకే (తమిళగ వెట్రి కజగం) తరఫున ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున దాఖలు చేసిన పిటిషన్‌ మద్రాస్ హైకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంను సవాలు చేసింది. రాష్ట్ర పోలీసుల స్వతంత్రతపై అనుమానాలు ఉన్నప్పటికీ హైకోర్టు సిట్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ టీవీకే సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

హైకోర్టు ఆదేశం సవాల్

హైకోర్టు టీవీకే నాయకత్వం, పార్టీ కార్యకర్తలపై చేసిన ప్రతికూల వ్యాఖ్యలను కూడా టీవీకే సవాలు చేసింది. టీవీకే ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడంలో విఫలమయ్యిందని హైకోర్టు విమర్శించింది. టీవీకే తరఫున సీనియర్ న్యాయవాదులు గోపాల్ సుబ్రమణ్యం, ఆర్యామా సుందరం వాదనలు వినిపించారు. హైకోర్టు ఇచ్చిన సిట్ ఆదేశం తప్పుడు ఆరోపణల ఆధారంగా జరిగిందని వారు వాదించారు. తమిళనాడు అదనపు అడ్వకేట్ జనరల్ చేసిన ఆరోపణలను ఆధారంగా చేసుకోవడం తగదని వారు పేర్కొన్నారు. వారితోపాటు న్యాయవాదులు దిక్షితా గోహిల్, ప్రాంజల్ అగర్వాల్, రుపాలీ స్యామువేల్, యశ్ ఎస్. విజయ్ కూడా టీవీకే తరఫున హాజరయ్యారు.

కరూర్ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని గత అక్టోబర్ 3న మద్రాస్ హైకోర్టు, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ సందర్భంగా హైకోర్టు టీవీకే కార్యకర్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్వాహకులను బాధ్యులుగా నిలపడంలో నిర్లక్ష్యం వహించిందని విమర్శించింది.

సీబీఐ దర్యాప్తు పారదర్శకమేనా?

సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినప్పటికీ సీబీఐ దర్యాప్తు విషయంలోనూ అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ముఖ్యమైన విషయం ఏమిటంటే, సుప్రీం కోర్టు సీబీఐ దర్యాప్తును మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి అజయ్ రస్తోగి పర్యవేక్షణలో జరగాలని ఆదేశించింది. దీంతో పారదర్శకంగా విచారణ జరిగే అవకాశం ఉందన్న వాదన ఉంది.

పారదర్శకత ఉండే అవకాశాలు

విచారణలో నివేదికలు సుప్రీం కోర్టుకి సమర్పించాలి. అందువల్ల, ఏదైనా అన్యాయంగా జరిగితే వెంటనే గుర్తించే అవకాశం ఉంది. ఈ కేసులో పలు పక్షాలు, బాధిత కుటుంబాలు, రాజకీయ పార్టీలు, పౌర సమూహాలు సీబీఐ దర్యాప్తు కోరాయి. ఇది ఒత్తిడిని పెంచుతుంది. సీబీఐ జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం పెరుగుతుంది.

సీబీఐ మీద అనుమానాలకు కారణాలు ఏమిటి?

గత కొన్ని సంవత్సరాలలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, సీబీఐ, ఈడీలను కేంద్ర ప్రభుత్వ సాధనాలుగా ఉపయోగిస్తున్నారని ఆరోపించాయి. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఈ ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. సీబీఐ కొన్ని కేసుల్లో వేగంగా వ్యవహరించగా, కొన్ని కేసుల్లో ఆలస్యం చేసింది అనే విమర్శలు ఉన్నాయి. దీనిపై కూడా సీబీఐ ఒత్తిడికి గురవుతుంది. లేదంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది అన్న ఆరోపణలు వినిపించాయి.

స్వతంత్రత మీద అనుమానాలు

సీబీఐ డైరెక్టర్ నియామకం ఇప్పుడు ఒక కమిటీ ద్వారా జరుగుతున్నా (ప్రధాని, సీజేఐ ప్రతినిధి, ప్రతిపక్ష), అయినా సంస్థ బడ్జెట్, ఆపరేషనల్ నియంత్రణ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అందుకే అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో మాత్రం సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతుందనే కారణంగా సాధారణంగా కంటే పారదర్శకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే, సీబీఐపై ఉన్న గత అనుభవాలు ప్రజల్లో సందేహాన్ని తగ్గించవు కాబట్టి ప్రజల విశ్వాసం పూర్తిగా తిరిగి రావాలంటే, ఈ విచారణ ఫలితాలు ఎంత నిష్పక్షపాతంగా ఉంటాయన్నదే కీలకం.

గతంలో వచ్చిన విమర్శలు

పలు ప్రతిపక్ష పార్టీలు సీబీఐని (పంజరంలో ఉన్న చిలుక) అని వర్ణించాయి. ఇది 2013లో సుప్రీం కోర్టు స్వయంగా ఉపయోగించిన పదం (కోల్గేట్ కుంభకోణం విచారణ సందర్భంగా). అంటే, ప్రభుత్వం చెప్పినట్టే మాట్లాడే, స్వతంత్రత లేని సంస్థ అని అర్థం. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంలోని పలువురు నేతలపై సీబీఐ దర్యాప్తులు జరిగాయి. బిహార్లో లాలూ ప్రసాద్ యాదవ్‌పై జరిగిన చోప్రా/ఫోడర్ కేసులు కూడా రాజకీయ కోణంలో చర్చించబడ్డాయి. అయితే కేవలం ప్రతిపక్ష నేతల మీదే సీబీఐ టార్గెట్ చేసుకుంటున్నదన్న విమర్శలు ఉన్నాయి. 2018లో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక అధికారి రాకేశ్ అస్తానా మధ్య ఘర్షణ పెద్ద వివాదంగా మారింది. ప్రభుత్వం ఇద్దరినీ బదిలీ చేయడంతో, సీబీఐ విశ్వసనీయత దెబ్బతింది.

ఈడీ మీద కూడా ఆరోపణలు

ప్రతిపక్ష నాయకులపై ఈడీ దర్యాప్తులు ఎక్కువగా ఉన్నాయి. గత 5–6 సంవత్సరాల్లో, ఈడీ దర్యాప్తు చేసిన పెద్ద రాజకీయ కేసుల్లో 70–80% కేసులు ప్రతిపక్ష నాయకులపై ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి.

ఉదాహరణలు ఇవే..

సోనియా, రాహుల్ గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసు

అర్వింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాపై లిక్కర్ పాలసీ కేసు

శరద్ పవార్, సుజిత్ పావర్ (ఎన్‌సీపీ)పై మనీ లాండరింగ్ కేసులు

కవిత (బీఆర్‌ఎస్), హేమంత్ సోరెన్ వంటి నేతలపై కూడా విచారణలు

ఈ కారణంగా ఈడీని రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తున్నారని విమర్శలు వచ్చాయి.

అరెస్టులలో సక్సెస్ రేటు తక్కువ

ఈడీ రిజిస్టర్ చేసిన 5,000కుపైగా మనీ లాండరింగ్ కేసుల్లో శిక్షలు వచ్చినవి కేవలం 25–30 మాత్రమే (0.5% కంటే తక్కువ). అంటే, ఎక్కువ కేసులు మీడియా హైలైట్‌గా మాత్రమే నిలుస్తున్నాయనే వాదన ఉంది. కొందరు నేతలు బీజేపీకి అనుకూలంగా మారగానే వారి మీద కేసులు మాఫీ అయ్యాయన్న విమర్శలు ఉన్నాయి.

న్యాయవ్యవస్థ సూచనలు

సుప్రీం కోర్టు, హైకోర్టులు పలు సందర్భాల్లో సీబీఐ, ఈడీని స్వతంత్ర వ్యవస్థగా పునర్‌వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని సూచించాయి. సీబీఐని పార్లమెంట్ చట్టం ద్వారా చేయాలని కూడా పలు మాజీ న్యాయమూర్తులు సూచించారు. ఎందుకంటే ప్రస్తుతం అది కేవలం ఒక కార్యనిర్వాహక ఆదేశం (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ) ఆధారంగా పనిచేస్తోంది.

విజయ్‌కి బీజేపీ అనుకూలంగా వ్యవహరిస్తుందా?

ప్రస్తుతం తమిళనాడులో బీజేపీ బలం పుంజుకొనే అవకాశం లేదు. ఆ పార్టీ అన్నా డీఎంకేతో పొత్తులో ఉన్నప్పటికీ ఆ పార్టీకి పెద్దగా బలం లేదు. అందుకే విజయ్ పార్టీకి బీజేపీ దగ్గరయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆ కోణంలో చూస్తే సీబీఐ దర్యాప్తు పారదర్శకత మీద అనుమానాలు కలుగుతున్నాయి. అయితే టీవీకే (తమిళిగ వెట్రి కళగం) మాత్రం ఎప్పటికప్పుడు తాము బీజేపీకి వ్యతిరేకంగా ఉంటామని ప్రకటిస్తోంది. ఒక ద్రవిడ పార్టీకి ఉండేందుకే ఇష్టపడుతోంది. తమిళ ప్రజల భావోద్వేగాలే అందుకు కారణం. కానీ పరిస్థితులు మారి, కరూర్ ఘటన ఇతర కేసులతో విజయ్ బీజేపీకి అనుకూలంగా మారే అంశాన్ని కొట్టిపారేయలేము.

రాజకీయ పరిస్థితులు

తమిళనాడులో మూడు ప్రధాన శక్తులు (డీఎంకే, ఏఐడీఎంకే, ఇప్పుడు టీవీకే) ఉన్నాయి. బీజేపీ దీన్ని ఒక అవకాశం అని చూస్తుంది. ఏఐడీఎంకే పతనావస్థలో ఉంది. అందుకే టీవీకే ధోరణితో భాగస్వామ్యం చేయడం ద్వారా డీఎంకేకు వ్యతిరేక శక్తిగా మారవచ్చు. టీవీకేకు, బీజేపీకి ఉమ్మడి శత్రువు డీఎంకే కాబట్టి ఆ పార్టీని బద్దలు కొట్టేందుకు ఈ వ్యూహం అవలంభించే అవకాశం ఉంది.

కరూర్ ఘటన వచ్చే ఎన్నికలను ప్రభావితం చేస్తుందా?

“కరూర్ తొక్కిసలాట” ఘటన తమిళనాడులో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయే అవకాశాలుఎక్కువే. అయితే, ఇది పూర్తిగా ఎలా ప్రభావితం చూపిస్తుంది. ఏ కోణంలో ప్రభావితం చూపిస్తుంది అన్నది వేచి చూడాలి. సీబీఐ విచారణ ఏం తేల్చబోతున్నది? స్టాలిన్ ప్రభుత్వ చర్యలు ఎలా ఉంటాయి? అన్నది వేచి చూడాలి. ఇక తమిళనాడులో అనేక రాజకీయ అంశాలు ఉన్నాయి. స్టాలిన్ ప్రభుత్వం మీద కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తమిళనాడులో తరుచూ ప్రభుత్వాలను ప్రజలు మారుస్తుంటారు కూడా. మరి ఈ సారి ఎన్నికల్లో ఏయే అంశాలు ప్రభావితం చూపిస్తాయో వేచి చూడాలి. ఒకవేళ బీజేపీ గనక విజయ్ పార్టీకి దగ్గరైతే ఆయనకు నష్టం వాటిల్లే ప్రమాదం కూడా లేకపోలేదు.

కరూర్ తొక్కిసలాట కేసు సీబీఐకి - Tholi Paluku