Let's talk: editor@tmv.in
కరూర్ ఘటనపై న్యాయం కావాలి: విజయ్

కరూర్ ఘటనపై న్యాయం కావాలి: విజయ్

Pinjari Chand
3 ఏప్రిల్, 2026

కరూర్‌లో జరిగిన విషాదకర తొక్కిసలాట ఘటన వెనుక కుట్ర ఉందని టీవీకే అధినేత విజయ్‌ ఆరోపించారు. ఈ ఘటనలో బాధితులకు న్యాయం కావాలని తాను కోరుతున్నానని, తనకూ న్యాయం కావాలని ఆయన అన్నారు. తమిళ వెట్రి కజగం నాయకుడు విజయ్, తిరుచిరాపల్లి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గురువారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడారు. గత ఏడాది సెప్టెంబర్‌ 27న కరూర్‌లో జరిగిన తన సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఆ ఘటనపై చాలామంది కుట్ర జరిగిందని చెబుతున్నారని, తానూ అదే అనుమానం వ్యక్తం చేస్తున్నానని విజయ్ తెలిపారు.

ప్రజలకు న్యాయం చేయాలని చెప్పే తానూ ఈ ఘటనపై న్యాయం కోరుతున్నానని ఆయన అన్నారు. తన చివరి చిత్రం జననాయగన్‌ విడుదల విషయంలో కూడా కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించిన విజయ్, గ్యాస్ సిలిండర్ల కొరత సమస్యను ముందుగానే అంచనా వేసి చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి రాకుండా ఉండేదని అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్‌పై కూడా ఆయన విమర్శలు చేశారు. కుటుంబ సమస్యలు లేదా దాడులు జరిగితే వెంటనే ఢిల్లీకి వెళ్లే స్టాలిన్, గ్యాస్ సిలిండర్ సమస్య పరిష్కారానికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. గ్యాస్ కొరత కారణంగా టీ దుకాణాలు, హోటళ్లు కూడా మూతపడే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఈ సంక్షోభం అంతగా పెరగకపోయేదని తెలిపారు. డీఎంకే, బీజేపీ రెండూ ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు ఈ రెండు పార్టీలను నమ్మవద్దని కోరారు. తమ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

నీట్‌ ఎందుకు రద్దు చేయలేదు

రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విజయ్, 2021 ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. గ్యాస్ సబ్సిడీ, చెరకు రైతులకు మద్దతు ధర, రేషన్ దుకాణాల ద్వారా అదనపు సరుకులు, అలాగే నీట్‌ రద్దు చేస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. తాను మాత్రం తప్పుడు హామీలు ఇవ్వబోనని, ప్రజల అవసరాల మేరకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. విద్య, రేషన్‌, ఆరోగ్యం, తాగునీరు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, రవాణా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. మహిళలకు ఆరు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, యువతుల వివాహానికి ఒక తులం బంగారం, పట్టు చీర వంటి పథకాలు అమలు చేస్తామని ఆయన తెలిపారు. తిరుచిరాపల్లిలో ఉద్యోగాల కోసం లంచాలు తీసుకున్న స్కామ్‌లో డీఎంకేకు చెందిన మంత్రి ప్రమేయం ఉందని కూడా విజయ్ ఆరోపించారు. మున్సిపల్ పరిపాలన శాఖలోనే సుమారు రూ.1000 కోట్ల అవినీతి జరిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కుంభకోణాలు, భద్రతా లోపాలు, మౌలిక సదుపాయాల కొరత వంటి సమస్యల కారణంగా డీఎంకే ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు.