Let's talk: editor@tmv.in
కరుణించే తల్లి! వరంగల్ భద్రకాళి!!

కరుణించే తల్లి! వరంగల్ భద్రకాళి!!

Dantu Vijaya Lakshmi Prasanna
28 సెప్టెంబర్, 2025

ఈ దసరా నవరాత్రులలో పిల్లలు పెద్దలు భక్తి పారవశ్యంతో దుర్గాదేవిని కొలుస్తారు. నవదుర్గలుగా అమ్మవారు తొమ్మిది రోజుల పాటు ఒక్కో అవతారంలో దర్శనమిస్తారు. పిల్లలకు పాఠశాలలు దసరా సెలవలువులు ఇవ్వడంతో ప్రత్యేకంగా ఎక్కడికైనా దగ్గర ప్రదేశాల సందర్శనకు వెళ్లాలనుకునే వారికి చారిత్రక వరంగల్ పట్టణం ఒక అందమైన గమ్యస్థానం. భక్తికి, సుందర చారిత్రక ప్రదేశాల సందర్శనకు పేరెన్నికగన్న ఈ పర్యాటక స్థలాన్ని గురించి తెలుసుకుందాం. భద్రకాళి అమ్మవారిని దర్శించుకోండి.

వరంగల్ చారిత్రక యాత్ర

వరంగల్ తెలంగాణలోని ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రము. ఇది ఒకప్పుడు కాకతీయుల రాజధాని (ఓరుగల్లు)గా ప్రసిద్ధి చెందింది. కాకతీయులు నిర్మించిన అద్భుత గోపురాలు, దేవాలయాలు, కోటలు ఇప్పటికీ వారి వైభవాన్ని చూపిస్తున్నాయి.కోటప్రాకారలు, రామప్ప దేవాలయం కాకతీయుల చరిత్ర కళ్ళముందుకు తెస్తాయి.

భద్రకాళి ఆలయ ఆవిర్భావం

7వ శతాబ్దం లో చాళుక్య రాజు పులకేశి II ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది. తర్వాత కాకతీయులు తమ రాజధానిని ఓరుగల్లులో (వరంగల్) ఏర్పరచుకున్నప్పుడు, భద్రకాళి అమ్మవారిని తమ రాజ్యాధిదేవతగా స్థాపించారు.ఆలయం భద్రకాళి చెరువు ఒడ్డున ఉండటం వలన, ఇది ఒకేసారి ఆధ్యాత్మిక కేంద్రం మరియు రక్షణ కేంద్రంగా పరిగణించబడింది. కాకతీయులు శక్తి పూజకులు. వారు యుద్ధానికి వెళ్లే ముందు ఇక్కడ పూజలు చేసేవారు. ఆలయం చుట్టూ ఉన్న గోడలు, రక్షణ గోపురాలు వారి శిల్పకళ వైభవాన్ని చూపుతాయి. భద్రకాళి అమ్మవారు రాజ్యరక్షక దేవతగా, ప్రజల మాతృ స్వరూపంగా పూజింపబడ్డారు.

విగ్రహవైశిష్ట్యం, చారిత్రక ప్రస్తావనలు

గర్భగుడిలో అమ్మవారు పద్మాసనంలో కూర్చుని ఉంటారు. ఆమెకు ఎనిమిది చేతులు ఉన్నాయి. వాటిలో త్రిశూలం, ఖడ్గం, శంఖం, చక్రం, కవచం, అంకుశం వంటి ఆయుధాలు ఉంటాయి.ఈ విగ్రహం గ్రానైట్ రాయితో చెక్కబడింది. ముఖ కవళికలు ఉగ్రరూపంలో ఉన్నప్పటికీ, భక్తులకు మాతృభావం ఇస్తాయి. బహమనీ సుల్తానులు, తరువాతి కుతుబ్‌షాహీలు వరంగల్‌ పై దాడులు చేసినప్పుడు కూడా ఈ ఆలయం కొంత నష్టపోయినా తరువాత కాలం లో తిరిగి పునరుద్ధరించబడింది.

20వ శతాబ్దంలో ఆలయానికి మళ్లీ మహత్తర దశ వచ్చింది. చెరువు పక్కన రాక్ గార్డెన్, బోటింగ్ వంటి సౌకర్యాలు కలిపారు. భద్రకాళి ఆలయం వరంగల్‌ ప్రజలకు మాత్రమే కాకుండా దేశమంతటి నుండి వచ్చే యాత్రికులకు ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రం. దసరా, బతుకమ్మ, శక్తి పూజల సమయంలో లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇది వరంగల్ పర్యటనలో తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం. వరంగల్‌లోని భద్రకాళి ఆలయం తెలంగాణలోనే ప్రాచీనమైన దేవాలయాల్లో ఒకటి.

శిల్పకళా ప్రత్యేకతలు

ప్రధాన విగ్రహం రాతితో చెక్కబడిన మహాదేవి భద్రకాళి అమ్మవారు. విగ్రహం సుమారు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పు. అమ్మవారికి ఎనిమిది చేతులు ఉంటాయి. ఆయుధాలు ధరించి ఉన్న శౌరరూపం. చాళుక్య శిల్పకళా శైలి, కాకతీయ గోపుర శైలుల కలయిక కనిపిస్తుంది. ధ్వజస్తంభం, బలి పీఠం వంటి సంప్రదాయ ఆలయ నిర్మాణాలు ఉన్నాయి. ఆలయ సమయాలు, పూజలు- ఉదయం: 5:00 – 1:00, సాయంత్రం: 3:00 – 8:30

ప్రధాన పండుగలు

బ్రహ్మోత్సవాలు (ఏప్రిల్ – మే)

శ్రావణ మాస ఉత్సవాలు (ఆగస్టు – సెప్టెంబర్)

బతుకమ్మ పండుగ (భద్రకాళి చెరువు వద్ద ఎంతో వైభవంగా జరుగుతుంది)

దసరా నవరాత్రులలు

భద్రకాళి అమ్మవారి ఆలయంలో దసరా (దుర్గా నవరాత్రులు) ప్రత్యేక ఉత్సవాలు. దసరా నవరాత్రులు భద్రకాళి అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. నవరాత్రి 9 రోజులు అమ్మవారిని వివిధ అలంకారాలతో ముస్తాబు చేస్తారు. ప్రతి రోజు అమ్మవారిని ఒక్కో అవతారంలో అలంకరిస్తారు. ఉదాహరణకు బాలాత్రిపురసుందరి, గాయత్రి, మహాలక్ష్మి, కాత్యాయని, అన్నపూర్ణ, కాళీ, మహిషాసురమర్దిని మొదలైన రూపాలు. చండీ హోమం, సహస్రనామార్చన, కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ముఖ్యంగా అష్టమి, మహానవమి, విజయదశమి రోజుల్లో పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. విజయదశమి రోజున ప్రత్యేక విజయలక్ష్మి అలంకారం చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ రోజుల్లో ఆలయం ప్రాంగణం ప్రకాశవంతమైన దీపాలతో, పూలతో, గజమాలలతో అలంకరించబడుతుంది. భద్రకాళి చెరువు వద్ద బతుకమ్మ ఉత్సవాలు కూడా దసరా సందర్భంలో మరింత ఉత్సాహంగా జరుగుతాయి. ఈ సమయంలో వరంగల్ అంతా పండుగ వాతావరణంలో ఉంటుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగానే వెళ్లడం మంచిది.

నవరాత్రుల అలంకారాలు

మొదటి రోజు:(ఘటస్థాపన/శైలపుత్రి అలంకారం)అమ్మవారిని శైలపుత్రి రూపంలో అలంకరిస్తారు.

ఇది భక్తులకు శక్తి ప్రాప్తి, స్థిరత్వం ఇస్తుందని నమ్మకం.

రెండవ రోజు:(బ్రహ్మచారిణి అలంకారం)విద్య, జ్ఞానం ప్రసాదించే రూపం.భక్తులు ఈ రోజున విద్యాభివృద్ధి, విద్యా విజయాలు కోరుకుంటారు.

మూడవ రోజు:(చంద్రఘంట అలంకారం)శాంతి, శౌర్యం కలిగించే రూపం.ఆలయంలో ఘంటా నాదం ప్రత్యేకంగా చేస్తారు.

నాల్గవ రోజు:(కూష్మాండా అలంకారం)సృష్టికర్త రూపం.భక్తులు దీని రోజున ఆరోగ్యం, ఆయురారోగ్యం కోసం పూజలు చేస్తారు.

ఐదవ రోజు:(స్కందమాత అలంకారం)కుమారస్వామి తల్లి రూపం.పిల్లల ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

ఆరవ రోజు :(కాత్యాయిని అలంకారం)మహిషాసుర మర్దిని రూపం. యుద్ధవిజయం, శక్తి ప్రసాదం కోసం భక్తులు పూజిస్తారు.

ఏడవ రోజు:(కాళరాత్రి అలంకారం)కాళరాత్రి అమ్మవారి అలంకారం ఘనంగా చేస్తారు.అశుభ నివారణ, చెడు శక్తుల నిర్మూలన కోసం ఈ పూజ ప్రత్యేకం.

ఎనిమిదవ రోజు:(మహాగౌరీ అలంకారం)మహాగౌరీ రూపంలో అలంకరిస్తారు.భక్తులు పవిత్రత, శాంతి, ఐశ్వర్యం కోసం ప్రార్థిస్తారు.ఈ రోజున చండీ హోమం, కుంకుమార్చన ప్రత్యేకంగా జరుగుతుంది.

తొమ్మిదవ రోజు :(సిద్ధిధాత్రి అలంకారం)అన్ని సిద్ధులు ప్రసాదించే అమ్మవారి రూపం.విజయాలు, ధనం, సంపద కోసం భక్తులు పెద్ద ఎత్తున వస్తారు.పదవ రోజు: విజయదశమి (విజయలక్ష్మి అలంకారం)చివరి రోజు అమ్మవారిని విజయలక్ష్మి రూపంలో పట్టు వస్త్రాలు, బంగారు అలంకారాలతో అలంకరిస్తారు.ఈ రోజున రాజశ్యామలార్చన, మహా పూజలు, పట్టు వస్త్ర సమర్పణ జరుగుతుంది.

ఈ తొమ్మిది రోజులు అమ్మవారి ఆలయం దీపాలు, పూలు, పండ్లతో, గజమాలలతో అలంకరించబడుతుంది. బతుకమ్మ సంబరాలు ఈ కాలంలో జరుగుతాయి – వేలాది మహిళలు పాల్గొంటారు. ఈ ఆలయం వరంగల్ మధ్యలోని తడ్కమల్ల గ్రామం వద్ద ఉంది.సమీపంలో భద్రకాళి చెరువు ఉంది. ఉదయం - సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో చాలా అందంగా కనిపిస్తుంది.

రవాణా సౌకర్యాలు

రోడ్డు మార్గం: హైదరాబాద్‌ నుండి సుమారు 150 కి.మీ.- బస్సులు, క్యాబ్ లు కార్ల ద్వారా 3–4 గంటల్లో చేరవచ్చు. రైలు మార్గం:వరంగల్ రైల్వే స్టేషన్ మరియు కాజీపేట్ జంక్షన్ సమీపంలో ఉన్నాయి. అక్కడి నుండి ఆటోలు, క్యాబ్లు లభ్యమవుతాయి. విమాన మార్గం సమీప విమానాశ్రయం హైదరాబాద్ RGIA (150–160 కి.మీ. స్థానిక రవాణా ఆటోలు, షేర్ ఆటోలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక బస్సులు, రైల్వే స్టేషన్‌ నుండి భద్రకాళి ఆలయం వరకు నడుస్తున్నాయి.

అతిథి సదుపాయాలు

టూరిజం డిపార్ట్మెంట్ నిర్వహణలో వరంగల్, హన్మకొండలో బడ్జెట్ లాడ్జీలు, మధ్యతరహా హోటల్స్ అందుబాటులో ఉన్నాయి.ఆలయ పరిసరాల్లో పూజా సామాగ్రి, పుష్పాలు, చిన్న చిన్న జ్ఞాపికలు లభిస్తాఆలయం సమీపంలో చిన్న చిన్న హోటళ్లు, భోజనశాలలు ఉన్నాయి. ముఖ్యంగా దోసెలు, ఇడ్లీ, వడ, దక్షిణ భారతీయ భోజనం, తెలంగాణా వంటకాలు లభిస్తాయి.ఆలయంలో ప్రసాదం కూడా దొరుకుతుంది.

సమీప దర్శనీయ ప్రదేశాలు

వేయి స్తంభాల గుడి,వరంగల్ కోట,రామప్ప ఆలయం (ప్రపంచ వారసత్వ సంపద), పద్మాక్షి ఆలయం, భద్రకాళి చెరువువద్ద సాయంత్రం నడక, విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో వెళితే చల్లగా, ప్రశాంతంగా ఉంటుంది.పండుగ కాలాల్లో (శ్రావణం, బతుకమ్మ, దసరా )వెళితే ఆలయ వైభవం మరింతగా అనుభూతి అవుతుంది.మర్యాదతో, సంప్రదాయ దుస్తుల్లో వెళ్ళడం మంచిది.

కరుణించే తల్లి! వరంగల్ భద్రకాళి!! - Tholi Paluku