Let's talk: editor@tmv.in
కరీంనగర్ మేయర్ పీఠంపై ఎంఐఎంతో కాంగ్రెస్ డీల్: కేంద్ర‌మంత్రి బండి సంజయ్

కరీంనగర్ మేయర్ పీఠంపై ఎంఐఎంతో కాంగ్రెస్ డీల్: కేంద్ర‌మంత్రి బండి సంజయ్

Gaddamidi Naveen
10 ఫిబ్రవరి, 2026

తెలంగాణలో 'కాషాయ గాలి' వీస్తుందని, ఇది మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో స్పష్టమవుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన ఎక్స్ వేదిక ద్వారా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం చూస్తుంటే ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.

ఎంఐఎంతో చీకటి ఒప్పందం

ఇటీవల సీఎం నిర్వహించిన మీడియా సమావేశంలో కనిపించిన ఆవేదన, అసహనం ఇందుకు నిదర్శనమని అన్నారు. సీఎం రాజకీయ వైఖరి, మాట్లాడే భాష మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి దగ్గరగా మారిందని బండి సంజయ్ ఆరోపించారు. దరుస్సలాం నుంచే సీఎం రాజకీయ స్క్రిప్ట్ తయారవుతోందన్న అనుమానం ప్రజల్లో పెరుగుతోందని వ్యాఖ్యానించారు. కరీంనగర్ మేయర్ పదవికి సంబంధించి కాంగ్రెస్, ఎంఐఎం మధ్య పెద్ద ఒప్పందం జరిగిందా అనే ప్రశ్నలు ప్రజల్లో ఉన్నాయని, మేయర్ కుర్చీని ఎంఐఎంకు అప్పగించే అంగీకారం జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరు పాము, ఎవరు ర్యాట్ స్నేక్ అన్నది స్పష్టమవుతుందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు గణనీయమైన నిధులు అందించిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గత రెండేళ్లలో మున్సిపాలిటీలు, పంచాయతీలు, కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రజలు ఇప్పుడు ప్రశ్నలు వేస్తున్నారని పేర్కొన్నారు. కనీస సౌకర్యాలు లేకుండానే మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారని, భారీ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలోనే తన అసలు స్వరూపాన్ని బయటపెట్టిందని బండి అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఇప్పటివరకు ఒక్క అరెస్ట్ కూడా జరగకపోవడం ప్రభుత్వ వైఫల్యమని బండి సంజయ్ ఆరోపించారు. ఈ కేసులో సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయడానికి సీఎంకి ధైర్యం లేదని విమర్శించారు. విచారణ ఎందుకు ఆలస్యమవుతోందో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఎందుకు లేఖ రాయలేదో సీఎం ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకునే ధైర్యం సీఎం వద్ద లేదని ఆరోపిస్తూ, ప్రభాకర్ రావు తప్పించుకునేందుకు ఎవరు బాధ్యత వహించాలి అనే ప్రశ్నను కూడా ఆయన లేవనెత్తారు.