Let's talk: editor@tmv.in
కరీంనగర్‌ మేయర్ పీఠంను దక్కించుకుంటాం: మంత్రి పొన్నం

కరీంనగర్‌ మేయర్ పీఠంను దక్కించుకుంటాం: మంత్రి పొన్నం

Gaddamidi Naveen
16 ఫిబ్రవరి, 2026

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజారిటీ లేదని బీజేపీ ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధమైందని, అదే సూత్రం కరీంనగర్‌కు కూడా వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్‌లో మొత్తం 66 మంది కార్పొరేటర్లతో పాటు ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల (కరీంనగర్, మానుకొండూరు) ఓట్లతో కలిపి మొత్తం 69 ఓట్లు ఉన్నాయని వివరించారు. కరీంనగర్‌లో మొత్తం 69 మంది సభ్యులు ఉండగా, బీజేపీకి కేవలం 30 మంది మాత్రమే ఉన్నారని ఆయన వివరించారు. అయినప్పటికీ మేయర్ పదవి తమదేనని ప్రకటించడం ఎలా సాధ్యమవుతుందో ప్రశ్నించారు. రాజకీయాల్లో ప్రతి పార్టీకి తమతమ వ్యూహాలు ఉంటాయని, మెజారిటీ ఉన్నవారే పాలన చేపట్టడం ప్రజాస్వామ్య సూత్రమని ఆయ‌న పేర్కొన్నారు.

గతంలో తమ పార్టీ కేవలం 13 స్థానాలు గెలిచినా కరీంనగర్‌లో మేయర్ అయ్యామని గుర్తుచేసిన ఆయన, ప్రస్తుతం కూడా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు వ్యవహరిస్తాయని తెలిపారు. ముఖ్యమంత్రి లేదా మంత్రుల జోక్యం లేదని, స్థానికంగా గెలిచిన ప్రజా ప్రతినిధులే తమ ఆలోచనల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారని ఆయ‌న చెప్పారు.

బీజేపీ గెలిచిన 30 మంది కార్పొరేటర్లకు, అలాగే మిగిలిన 36 మంది సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో మేయర్‌ను ఎన్నుకోవాలని సూచించారు. మూడు లక్షల మంది ఓటర్లు ఉన్న కరీంనగర్ వంటి ప్రధాన నగరాన్ని అభివృద్ధి చేయాలంటే సమర్థమైన పాలకవర్గం అవసరమని ఆయ‌న అభిప్రాయపడ్డారు. తమకు రాజకీయ లబ్ధి కన్నా నగరాభివృద్ధే ముఖ్యమని, కొత్త పాలకవర్గానికి జిల్లా మంత్రిగా సహకరిస్తామని తెలిపారు. మెజారిటీ ఉన్నవారికి తాము అడ్డంకి కాదని, ఎవరినీ పదవి నుంచి దింపే ప్రయత్నం చేయబోమని స్పష్టం చేశారు. నేడు ఏమవుతుందో చూడాలని, ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిర్ణయం వెలువడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.