Let's talk: editor@tmv.in
కరీంనగర్‌లో రూ.138 కోట్ల మ్యూల్ అకౌంట్ల ముఠా గుట్టురట్టు

కరీంనగర్‌లో రూ.138 కోట్ల మ్యూల్ అకౌంట్ల ముఠా గుట్టురట్టు

Gaddamidi Naveen
29 మార్చి, 2026

సైబర్ నేరగాళ్లు అమాయకుల బ్యాంక్ ఖాతాలను మ్యూల్ అకౌంట్లుగా వాడుతూ కోట్లాది రూపాయల అక్రమ సొమ్మును విదేశాలకు మళ్లిస్తున్నారు. స్వల్ప కమిషన్ ఆశజూపి మీ ఖాతా వివరాలు తీసుకుని, మిమ్మల్ని నేరస్తులుగా మారుస్తున్నారు. ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా ఈ ముఠాల ఆగడాలు తగ్గడం లేదు. సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న ‘మ్యూల్ అకౌంట్ల’ నెట్‌వర్క్‌పై కరీంనగర్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0’ పేరుతో నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‌లో రూ. 138 కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్న ముఠాను శనివారం బట్టబయలు చేశారు.

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ నెట్‌వర్క్‌లో మొత్తం 24 మంది అనుమానితులను గుర్తించగా, వారిలో 13 మందిని అరెస్టు చేశారు. వీరంతా జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో ముఠా సమన్వయకర్తలు, మధ్యవర్తులు, కొంతమంది బ్యాంక్ అధికారులు, ఖాతాదారులు కూడా ఉన్నారు.సైబర్ నేరాల ద్వారా వచ్చే అక్రమ సొమ్మును దారి మళ్లించడానికి ఈ మ్యూల్ అకౌంట్లను వినియోగించేవారు. బ్యాంక్ ఖాతాలు, వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సుమారు రూ. 138 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ అక్రమ సొమ్మును ఆర్బీఎల్ బ్యాంక్, ఇతర వర్చువల్ ఖాతాల ద్వారా విదేశాలకు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

ఈ భారీ మోసానికి సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 112 (ముఠా నేరాలు), 318(4) (మోసం) ఐటీ యాక్ట్ సెక్షన్ 66-డి కింద పలు కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, ఈ కుంభకోణంలో ఉన్న అంతర్జాతీయ సంబంధాలను ఛేదించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నామని సీపీ పేర్కొన్నారు. ప్రజలు తమ బ్యాంక్ ఖాతాలను ఇతరులకు అద్దెకు ఇవ్వవద్దని, అలా చేయడం వల్ల వారు కూడా నేరస్థులుగా మారే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు.

కరీంనగర్‌లో రూ.138 కోట్ల మ్యూల్ అకౌంట్ల ముఠా గుట్టురట్టు - Tholi Paluku