Let's talk: editor@tmv.in
కరీంనగర్‌కు 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రి మంజూరు: బండి సంజయ్

కరీంనగర్‌కు 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రి మంజూరు: బండి సంజయ్

Gaddamidi Naveen
10 జనవరి, 2026

కరీంనగర్‌కు మరో కీలక వైద్య మౌలిక సదుపాయం అందుబాటులోకి రానుంది. ఉత్తర తెలంగాణలో ఆయుష్ వైద్య సేవలకు కేంద్రంగా కరీంనగర్‌ను తీర్చిదిద్దే దిశగా 50 పడకల సామర్థ్యంతో కూడిన ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రికి అధికారికంగా ఆమోదం లభించింది. జాతీయ ఆయుష్ మిషన్ (నేషనల్ ఆయుష్ మిషన్) కింద ఈ ఆసుపత్రి నిర్మాణానికి మొత్తం రూ.15 కోట్ల నిధులు మంజూరయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ త‌న ఎక్స్ వేదిక ద్వారా పేర్కొన్నారు. ఇందులో తొలి విడతగా రూ.7.5 కోట్ల నిధులను ఇప్పటికే విడుదల చేశారు అని ప‌ర్కొన్నారు.

ఈ ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రి ద్వారా ఆయుర్వేదం, యోగా & నేచురోపతి, హోమియోపతి, యునాని, సిద్ధ వంటి సంప్రదాయ వైద్య విధానాలు ఒకే చోట ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని. దీని వల్ల కరీంనగర్‌తో పాటు పరిసర జిల్లాల ప్రజలు ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆయుష్ వైద్య సేవలను సులభంగా పొందగలుగుతారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు, జీవనశైలి సమస్యలకు ప్రత్యామ్నాయ చికిత్సలు మరింత చేరువ కానున్నాయని ఆయ‌న తెలిపారు.

వైద్య విధానాలను ప్రోత్సహిస్తూ దేశవ్యాప్తంగా ఆయుష్ వ్యవస్థను బలోపేతం చేస్తున్న‌ ప్రధాని నరేంద్ర మోదీ నిరంతర సహకారానికి ఈ సందర్భంగా కేంద్ర‌మంత్రి బండి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆయుష్ మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి ప్రతాప్‌రావ్ జాధవ్ ఈ ప్రతిపాదనను వేగంగా ప్రాసెస్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఈ ప్రాజెక్టు సాధ్యపడటానికి కీలకంగా నిలిచిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సహకారాన్ని బండి ప్రశంసించారు. ఈ ఆయుష్ ఆసుపత్రి ప్రారంభంతో కరీంనగర్ జిల్లా ఆరోగ్య రంగంలో మరో మైలురాయిగా నిలవనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.