
కరిచేవాళ్లు పార్లమెంట్‌లోనే ఉన్నారు: కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి
పార్లమెంట్ ప్రాంగణానికి ఒక కుక్కపిల్లను తీసుకురావడాన్ని వివాదం చేస్తున్న అధికారం పార్టీ నాయకులకు వేరే సమస్యలు లేవా? కుక్కలను తీసుకురావడమేనా అసలు సమస్య అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఘాటుగా విమర్శించారు. ప్రజలను కరిచే వాళ్లు పార్లమెంట్‌లోనే కూర్చున్నారు వాళ్ల గురించి ఎవరూ మాట్లాడరు అని ఆమె మండిపడ్డారు.
ప్రమాదం చూసి కుక్కపిల్లను రక్షించాను
సోమవారం ఉదయం పార్లమెంట్‌కు వస్తుండగా రోడ్డుపై ఒక స్కూటర్–కారు ఢీకొనడం గమనించిన ఆమె, అక్కడే ఇబ్బందులు పడుతున్న చిన్న కుక్కపిల్లను చూసి వాహనం కింద పడి ప్రమాదం జరుగుతుందేమోనని భావించి కారు ఎక్కించుకున్నట్లు వివరించారు. ఏదైనా చట్టం ఉందా? దానికి ప్రాణం ఉంది కదా. రక్షించాను. కారులో తీసుకువచ్చాను. తిరిగి కారు వెళ్లిపోయింది. కుక్కపిల్ల కూడా వెళ్లిపోయింది. దీనిపై ఇంత గొడవ ఎందుకు? అని ఆమె ప్రశ్నించారు.
ఎన్డీయేపై పరోక్ష విమర్శలు
ఎవరినీ సూటిగా ప్రస్తావించకపోయినా ఎన్డీఏ ఎంపీలపై ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిజంగా కొరికేవాళ్లు పార్లమెంటులో కూర్చున్నారు. వాళ్లు ప్రభుత్వాన్ని నడుపుతారు. మనం ఒక మూగ జంతువును జాగ్రత్తగా చూసుకుంటాం, ఇది పెద్ద సమస్యగా, చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి వేరే పని లేదా? నేను కుక్కను ఇంటికి పంపించి, దాన్ని ఇంట్లో ఉంచుకోమని చెప్పాను. పార్లమెంటులో కూర్చుని ప్రతిరోజూ మమ్మల్ని కొరికే వారి గురించి మేం మాట్లాడమని ఆమె అన్నారు. ఈ సమావేశాల్లో లోక్‌సభలో వాతావరణం వాడీవేడిగా కొనసాగింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్షం నిరసన తెలిపింది. ఓట్ చోర్, గద్దీ చోడ్ అంటూ నినాదాలు చేయడంతో సభాపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంపీ సంధ్యా రాయ్ సభను మధ్యాహ్నం వాయిదా వేశారు.
రాజ్యసభ వాయిదా
రాజ్యసభలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ ను అభినందించే తీర్మానంపై చర్చ జరిగిన అనంతరం, అక్కడ కూడా 2 గంటల వరకు వాయిదా పడింది. అన్ని పార్టీల సభ్యులూ రాధాకృష్ణన్‌ను స్వాగతించారు.
