Let's talk: editor@tmv.in
కిరాయి గొడవతో ‘ఆటో డ్రైవర్’ హత్య

కిరాయి గొడవతో ‘ఆటో డ్రైవర్’ హత్య

Panthagani Anusha
18 సెప్టెంబర్, 2025

మనిషి ప్రాణాలంటే లెక్కలేనితనం, మనుషుల మధ్య మానవతా విలువలు తగ్గిపోయాయనడానికి ఈ మధ్యకాలంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. అయితే ఈ మాటలను నిజం చేస్తూ ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జీవనోపాధి కోసం రాత్రింబవళ్ళు శ్రమించే ఓ ఆటో డ్రైవర్ కేవలం రూ.300 కిరాయి తగాదా కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన జగిత్యాల మండలం పొలాస శివారులో చోటుచేసుకుంది.

సుతారిపేటకు చెందిన ఆటో డ్రైవర్ నయీమొద్దీన్ (50) తన ఆటోలో ప్రయాణికులను ధర్మపురి వైపు తీసుకెళ్తున్నాడు. అదే సమయంలో బిహార్ రాష్ట్రానికి చెందిన దర్శన్ సాహ్ని, సునీల్ సాహ్ని అనే ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఎక్కారు. గుల్లపేట వద్ద దిగేందుకు రూ.300 కిరాయి మాట్లాడుకున్నారు. కానీ గమ్యానికి చేరుకున్న తర్వాత కిరాయి చెల్లింపుపై వాదన తలెత్తింది. మాటల తగాదా కాసేపటికే హింసాత్మకంగా మారింది. ఆగ్రహంతో నిందితులు డ్రైవర్ మెడను గుడ్డతో బిగించి ఊపిరాడనివ్వకుండా చేశారు. అనంతరం బండరాయితో దాడి చేసి అక్కడికక్కడే హతమార్చారు. తరువాత మృతుడి మొబైల్ ఫోన్ దొంగిలించి రాత్రి చీకటిలో తప్పించుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జగిత్యాల రూరల్ పోలీసులు డీఎస్పీ రఘుచందర్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆటో కిరాయి చెల్లింపుపై తలెత్తిన వాగ్వాదమే ఈ హత్యకు ప్రధాన కారణంమై ఉండొచ్చని భావిస్తున్నారు. విచారణలో భాగంగా నిందితులు హైదర్పల్లి శివారులోని శ్రీ మణికంఠ రైస్ మిల్లులో కూలీలుగా పనిచేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అంతేకాక సాక్ష్యాలు, ఆధారాలను పరిశీలించి 24 గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు తెలిపారు. ఇక హత్యకు సంబంధించిన రక్తపు మరకల దుస్తులు, దొంగిలించిన మొబైల్ను స్వాధీనంచేసుకున్నారు వెల్లడించారు. వేగంగా కేసు ఛేదించినందుకు ఎస్పీ పోలీసు బృందాలను అభినందించారు.

ఈ ఘటనతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆవేదన నెలకొంది. ఇంత చిన్న కారణం కోసం ఒకరి ప్రాణం తీయడం మానవత్వానికి మచ్చ అని విమర్శిస్తున్నారు. రాత్రివేళల్లో డ్రైవర్లు ఎదుర్కొనే ప్రమాదాల దృష్ట్యా వారికి రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కిరాయి గొడవతో ‘ఆటో డ్రైవర్’ హత్య - Tholi Paluku