
కూర్మీలను ఎగదోస్తున్నదెవరు?
సుమారు తొమ్మిది దశాబ్దాలుగా కూర్మీలు తమను ఎస్టీలుగా గుర్తించాలని పోరాడుతున్నారు. గతంలో బ్రిటీష్ పాలకులు ఉన్న సమయంలోనే వారిని ఉన్నత వర్గాలకు చెందిన వారిగా, భూస్వామ్యులుగా గుర్తించింది. కూర్మీలను ఎస్టీలుగా గుర్తించడానికి నిరాకరించింది. వారి సామాజిక స్థితిగతులు, చారిత్రాక, ఆహార్యం, జీవనశైలి ఆధారంగా వారిని ఎస్టీలుగా పరిగణించడానికి నిరాకరించింది. అప్పటి నుంచి నేటి వరకు ఓబీసీలుగా ఉన్న తమను ఎస్టీలుగా గుర్తించాలని పోరాడుతూనే ఉన్నారు. అలాగే వారి భాషకు కూడా రాజ్యాంగంలో చోటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న వీరిని, అలాగే ఆదివాసీలుగా గుర్తించడానికి ఎటువంటి చారిత్రక, పురావస్తు ఆధారాలు లేకపోవడంతో కేంద్రం వారిని ఎస్టీలుగా ఒప్పుకోవడానికి ససేమిరా అంటుంది. అయితే కొన్ని రాజకీయ పార్టీలు స్వప్రయోజనాల కోసం కూర్మీలను అప్పుడప్పుడు ఎగదోస్తుంటాయి. తద్వారా రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నం చేస్తుంటాయి. స్వాంతంత్య్రానికి పూర్వం నుంచి నేటి వరకు ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు నాన్చివేత ధోరణే సమస్య పరిష్కరించలేకపోవడానికి ప్రధాన కారణం. కూర్మీలకు సంపూర్ణ మద్దతిస్తే ఎస్టీలు దూరమవుతారు. ఇవ్వకపోతే కూర్మీల ఓటు బ్యాంక్ దూరమవుతుంది. అందుకే కూర్మీల వ్యవహారంలో ప్రతి పార్టీ కట్టె విరగనట్టు, పాము చావనట్టు వ్యవహరిస్తోంది.
మెరుగైన అవకాశాలు సాధించడానికి
విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో ప్రాబల్యం కోసం కూర్మీలు పోరాటం చేస్తున్నారు. ఎస్టీల కంటే తమ జీవనశైలి మెరుగ్గానే ఉన్నప్పటికీ రాజకీయంగా, విద్య, ఉపాధి రంగాల్లో తమ వాటా కోసం పోరాటం చేస్తున్నాయి.అత్యధిక కులాలు ఉన్న ఓబీసీల్లో తమకు దక్కేది అంతంతే అని భావించడంతో వారు ఎస్టీలుగా తమను గుర్తించాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. రాజకీయంగా ప్రతి రాష్ట్రంలో ఎస్టీలకు ప్రత్యేక స్థానాలను కేటాయించాలని రాజ్యాంగం చెబుతోంది. అందుకనుగుణంగా శాసనసభ స్థానాల్లోనూ, పార్లమెంట్ స్థానాల్లోనూ వారి జనాభాకనుగుణంగా రిజర్వ్డ్ స్థానాలను కేటాయిస్తున్నారు. ఆయా పార్టీలు వాటి ప్రకారమే స్థానాలను కేటాయిస్తున్నాయి. దీంతో ఓబీసీల్లో అనేక కులాలు ఉండడం, వాటి మధ్యనే ఆధిపత్య పోరాటం ఉండడంతో ఎదగలేక తాము కూనరిల్లిపోతున్నామని కూర్మీలు భావించారు. అందుకే బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, బెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాల్లో నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. కొంతమంది నాయకులు తమకు రాజకీయ ప్రాధాన్యం దక్కాలనే దృష్టితో ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారు .
ఎస్టీల్లో చేరిస్తే ఎవరికి నష్టం
ఎస్టీల్లో కూర్మీలను చేరిస్తే ప్రధానంగా ఎస్టీలకు నష్టం వాటిల్లుతుంది. తమ రిజర్వేషన్లలో కొంత భాగాన్ని వారితో పాటు పంచుకోవాల్సి వస్తోంది. వారిని ఎస్టీల్లో చేర్చినంతనే ఎస్టీల్లో రిజర్వేషన్లు పెరిగిపోవు. సుప్రీం కోర్టు ఇంద్ర సాహ్ని కేసు, తదితర తీర్పుల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని తేల్చిచెప్పింది. దీంతో ఎస్టీల్లో అప్పటికే ఉన్న ఆయా కులాలు కూర్మీలను ఎస్టీలుగా గుర్తిస్తే పెద్ద మొత్తంలో నష్టపోతాయి. అలాగే రాజకీయంగా కూడా ఎస్టీ స్థానాలను వారికి కోల్పోవాల్సి రావడం కూడా జరుగుతోంది.
పార్టీల మద్దతు ఎవరికి
దేశంలోని జాతీయ పార్టీలు కూర్మీలను ఎస్టీల్లో చేర్చే విషయంలో తటస్థంగా ఉన్నారు. దాదాపు వారిని ఎస్టీల్లో చేర్చడం సాధ్యం కాకపోవచ్చు. రాష్ట్రాల ప్రతిపాదన, పార్లమెంట్ లో చర్చ, రాష్ట్రపతి ఆమోదం అన్ని పూర్తయ్యేసరికి సుదీర్ఘకాలమే పట్టే అవకాశం లేకపోలేదు. అయితే అన్నింటికంటే ముఖ్యంగా గుజరాత్లో పటేల్ లు, హార్యానాలో జాట్లు, మహరాష్ట్రలో మరాఠాలు తమకు కూడా రిజర్వేషన్లు కావాలని అనేక ఏళ్లుగా పట్టుబడుతూనే ఉన్నారు. తక్షణ ఉపశమనంగా వారికి అనేక హమీలు ఇచ్చి ఉద్యమాలను ప్రభుత్వాలు నీరుగార్చాయి. ఇప్పుడు కూర్మీలకు రిజర్వేషన్ విషయమై ముందడుగు వేస్తే తేనే తుట్టెను కదిపినట్టే. అందుకే జాతీయ పార్టీలు అంశాల వారీగా వారికి మద్దతిస్తూ, రాజకీయాల్లోనూ ప్రాధాన్యత ఇస్తూ అధ్యయనాలు, కమిషన్ల పేరిట కాలం గడుపుతున్నాయి.
ప్రాంతీయపార్టీలకు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నాయి. కూర్మీలలోని ఉద్యమ నాయకులకు కలిసి పోరాడుదాం. కేంద్రం మెడలు వంచి రిజర్వేషన్లు సాధిద్దాం అని చెబుతూ ఓటు బ్యాంకును కాపాడుకుంటున్నాయి. రిజర్వేషన్ల నిందను కేంద్రం ప్రభుత్వంపై మోపుతున్నాయి. అలాగే దేశంలో కూర్మీల కంటే ఎస్టీలే అధికంగా ఉన్నారు. అందువల్ల ఎస్టీలను దూరం చేసుకోవడం అంటే అది ఆత్మహత్య సదృశ్యమే అవుతుందని ఆయా పార్టీలకు తెలుసు. అందువల్ల ఏ వర్గానికి మద్దతివ్వకుండా అందరినీ కలుపుకొనిపోయే విషయం పైనే దృష్టి సారిస్తున్నాయి.
తాజాగా జార్ఖండ్‌లో తమను ఎస్టీలుగా గుర్తించాలంటూ కూర్మీలు మళ్లీ ఆందోళనకు దిగారు. రైలు రోకో, నిరసన, రోడ్ల దిగ్భందం ద్వారా తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. తమ ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు మొదటి నుంచి గిరిజనులకు దగ్గరగా ఉన్నాయని తమను ఎస్టీలుగా గుర్తించాలని రాంచీ, ధన్బాద్ తదితర ప్రాంతాల్లో భారీ నిరసన చేపట్టారు. తమను ఎస్టీల్లో చేర్చి తమ ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఉద్యమ శ్రేణులు కోరుకుంటున్నాయి.
