Let's talk: editor@tmv.in
కార్బన్ కాలుష్యంపై చైనా యుద్ధం

కార్బన్ కాలుష్యంపై చైనా యుద్ధం

Venkatesh Balusula
26 సెప్టెంబర్, 2025

ప్ర‌పంచాన్ని వేధిస్తున్న ఎన్నో స‌మ‌స్య‌ల్లో వాతావ‌ర‌ణ కాలుష్యం ఒక‌టి. పారిశ్రామికీకరణ, పెరుగుతున్న వాహ‌నాల సంఖ్య‌, ప‌రిశ్ర‌మ‌ల వ్య‌ర్థాలు, గ్రీన్ హౌస్ వాయువులు, అడ‌వుల న‌రికివేత‌తో ఎన్నో దేశాలు కార్బ‌న్ కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ జాబితాలో ప్ర‌పంచంలోనే చైనా మొద‌టి స్థానంలో నిలిచింది. ఈ నేప‌థ్యంలో ఐక్యరాజ్య సమితి సమావేశంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చైనాలో కార్బ‌న్ కాలుష్యం, నిర్మూల‌న‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై కీల‌క ప్ర‌సంగం చేశారు. 2035 నాటికి కార్బన్ ఉద్గారాల‌ను 7 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తామని చెప్పారు. చైనా ప్రపంచ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల్లో 31 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉంది. ఏటా ఇది పెరుగుతూనే ఉండ‌టం గ‌మ‌నార్హం.

వంద దేశాల నుంచి హామీలు

వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, మీథేన్‌, నైట్ర‌స్ ఆక్సైడ్‌ వంటి గ్రీన్‌హౌస్ వాయువులు అధికంగా విడుదల కావడం వ‌ల్ల కార్బ‌న్ కాలుష్యం ఏర్ప‌డుతుంది. ఇవి బొగ్గు, చమురు, సహజవాయువును కాల్చ‌డం, పరిశ్రమలు, వాహనాలు, అడవుల నిర్మూలన వంటి కారణాల వల్ల వస్తాయి. ఈ వాయువులు భూమి వేడెక్కడానికి కారణమవుతాయి. ఇది వాతావరణ మార్పులు, ప్ర‌కృతి విప‌త్తులైన వరదలు, తుఫానులు, కరువుకు దారితీస్తుంది. చైనా ప్రపంచంలో అతిపెద్ద కార్బన్ కాలుష్య దేశంగా ఉంది. దేశంలోని పరిశ్రమలు, బొగ్గు ఆధారిత శక్తి ఉత్పత్తి, ఉత్పాదక రంగాలు దీనికి ప్ర‌ధాన కార‌ణం. సుమారు వంద‌ మందికి పైగా ప్రపంచ నాయకులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. వాతావరణ మార్పులు, ప్ర‌కృతి విప‌త్తుల‌తో పోరాడడానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు. బొగ్గు, చమురు, సహజవాయువు నుంచి వచ్చే ఉద్గారాల‌ను తగ్గించేందుకు పిలుపునిచ్చారు. బ్రెజిల్‌లో నెల రోజుల్లో ప్ర‌పంచ‌ వాతావ‌ర‌ణ‌ చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెర్రెస్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సుమారు ఆరు గంటల ప్ర‌సంగాలు, ప‌లు ప్రకటనల తర్వాత, వంద‌ దేశాలు కార్బ‌న్ కాలుష్యాన్ని త‌గ్గించే చ‌ర్య‌ల‌కు హామీలు ఇచ్చాయి. ప్రపంచ కార్బ‌న్ ఉద్గారాల్లో ఈ దేశాలు మూడింట రెండు వంతులకు బాధ్యత వహిస్తాయి. ఈ నేప‌థ్యంలో ఈ హామీ వాతావ‌ర‌ణ కాలుష్య నివార‌ణ‌కు కీల‌క అడుగుగా భావిస్తున్నారు.

నిర్ల‌క్ష్యం వ‌హించొద్ద‌న్న నేత‌లు

ఈ సంద‌ర్భంగా చైనా అధ్య‌క్షుడు షీ జిన్ పింగ్‌ మాట్లాడుతూ 2020 నుంచి వాయు, సౌర శ‌క్తిని ఆరు రెట్ల‌కు పెంచుతామన్నారు. కాలుష్యం లేని వాహనాలను ఎక్కువ‌గా వినియోగించేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ మాట్లాడుతూ కార్బ‌న్ ఉద్గారాల‌ను 66 శాతం నుంచి 72 శాతానికి తగ్గిస్తామని చెప్పారు. నవంబర్‌లో చర్చలు జ‌రిగే ముందు యూరోపియ‌న్ యూనియ‌న్‌ అధికారిక ప్రణాళిక ప్ర‌క‌టించ‌నుంది. మార్షల్ ఐలాండ్స్ అధ్యక్షురాలు హిల్డా హైన్ మాట్లాడుతూ పెరుగుతున్న తుఫానుల‌తో ఆసుపత్రులు, పాఠశాలలు నాశనమవుతున్నాయని పేర్కొన్నారు. తమ దేశంలో త‌ర‌చూ వరదలు, కరువు సంభ‌విస్తున్నాయ‌ని చెప్పారు. నిర్ల‌క్ష్యంగా ఉంటే త్వ‌ర‌లో ఇతర దేశాలు కూడా ఇదే ప‌రిస్థితి ఎదుర్కొంటాయ‌న్నారు. బొగ్గు, చమురు మీద ఆధారానికి ముగింపు ప‌ల‌కాల‌ని, లేదంటే అన్ని దేశాల నాయకులు విప‌త్తులు ఎదుర్కొంటార‌న్నారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ ఇటీవలి వరదలు, 4000 గ్రామాల్లో 5 మిలియన్ల ప్ర‌జ‌ల‌పై ప్ర‌భావం, 1000 మంది చనిపోవ‌డంపై విచారం వ్య‌క్తం చేశారు. 2022 వరదలు 30 బిలియన్ డాలర్ల నష్టం, మిలియన్ల మందిని నిరాశ్రయులను చేశాయని వాపోయారు.

పెర‌గ‌నున్న వాయు, సౌర శ‌క్తి వినియోగం

2015 పారిస్ ఒప్పందం ప్రకారం 190కి పైగా దేశాలు నూత‌న‌ ఐదేళ్ల ప్రణాళికలు ఇవ్వాలి. బొగ్గు, చమురు, సహజవాయువు కాల్చ‌డం వ‌ల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గించేందుకు ఈ దేశాలు త‌మ వ్యూహాలు తెల‌పాలి. ఈ నెలాఖరు వరకు ప్రణాళికలు ఇవ్వాలని ఐరాస అధికారులు సూచించారు. జో బైడెన్ గత ఏడాది అమెరికా ప్ర‌ణాళిక‌లు స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా చైనా ప్ర‌ణాళిక‌ల‌పై ప్ర‌పంచ దేశాలు ప్ర‌శంస‌లు కురిపించాయి. చైనా ప్రకటనతో ప్రపంచ వాతావరణ కాలుష్య నిర్మూల‌న‌ చర్యలు వేగ‌వంతం కానున్నాయి. ఇతర దేశాలు కూడా ల‌క్ష్య సాధ‌న‌కు పోటీప‌డే అవ‌కాశం ఉంది. బ్రెజిల్ సమావేశంలో మరిన్ని ఒప్పందాలు కుదరవచ్చు. క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెరుగుతాయి. వాయు, సౌర శ‌క్తి వంటి రంగాలు బాగా వృద్ధి చెందుతాయి. కార్బ‌న్ ఉద్గారాలు తగ్గితే గ్లోబ‌ల్ వార్మింగ్‌ 2.6 డిగ్రీల నుంచి మరింత తగ్గవచ్చు. అయితే చైనా ఎక్కువ మేర కార్బ‌న్ కాలుష్య ఉద్గారాల‌ను త‌గ్గించాల్సి ఉంటుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు. చైనా ప్ర‌ణాళిల‌కు భారత్‌కు స్ఫూర్తినిచ్చేలా ఉన్నాయి. క్లీన్ ఎనర్జీలో భారత్ పెట్టుబడులు పెరుగుతాయి. భారత్, చైనా మధ్య పోటీ పెరిగితే ఆసియాలో డీకార్బనైజేషన్ వేగం పెరుగుతుంది. ఇది భారత్‌కు ఆర్థికంగా లాభం చేకూరుస్తుంది. క్లీన్ ఎనర్జీ ఉద్యోగాలు పెరుగుతాయి. ప్రపంచ దేశాల ఒత్తిడితో భారత్ మరిన్ని లక్ష్యాలు పెట్టుకోవచ్చు. భారత్ కూడా ప్రపంచంలో మూడవ అతిపెద్ద కార్బన్ కాలుష్య దేశంగా ఉంది. 2024లో భారత్ కార్బ‌న్ ఉద్గారాలు 5.3 శాతం పెరిగాయి. ఇది వేగవంతమైన ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, శ‌క్తి వ‌న‌రుల‌ డిమాండ్ పెరగడం వల్ల జరిగింది. ప్రస్తుతం దేశంలో వాయు, సౌర శక్తి వినియోగం వేగంగా పెరుగుతోంది.

భారత్‌లో సుప్రీం కోర్టు ఆందోళ‌న

ఇటీవ‌ల ఉత్త‌ర భార‌త దేశంలో మేఘ విస్ఫోట‌నం ఘ‌ట‌న‌ల‌ సంద‌ర్భంగా భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం సైతం చెట్ల న‌రికివేత‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అడవి భూములను ఇతర ప్రయోజనాలకు మ‌ర‌ల్చాలంటే క‌ల్పిత అడ‌వులు సృష్టించాల‌ని ఆదేశించింది. పారిశ్రామీకరణ కోసం చేస్తున్న ఇలాంటి చర్యల ఫలితంగానే వాతావరణ కాలుష్యం, వ‌ర‌ద‌లు, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టం వంటి ప్రకృతి విప‌త్తులు జ‌రుగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తరచూ ఢిల్లీ కాలుష్యంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా దీపావళి సమయాల్లో ఇక్కడ టపాసులు కాల్చొద్దని న్యాయ‌స్థానాలు సైతం తీర్పులు ఇస్తున్నాయంటే ప‌రిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాలు ప్ర‌కృతి విప‌త్తులు ఎదుర్కొంటున్న వేళ ఐరాస‌లో వాతావ‌ర‌ణ మార్పు గురించి జ‌రిగిన చ‌ర్చలు మంచి ప‌రిణామంగా భావించ‌వ‌చ్చు.

షీ జిన్ పింగ్ ఎంతో నమ్మకంగా ప్రణాళికలు ముందుంచినా, చైనా ఈ లక్ష్యాన్ని చేరుకుంటుందని స్పష్టంగా చెప్పలేము. ప్రపంచంలో పారిశ్రామికరణలో అగ్రస్థానంలో ఉన్న దేశాల జాబితాలో చైనా సైతం ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణాన్ని కాపాడుకునేందుకు చైనా చేసే ప్రయత్నాల్లో పారిశ్రామికంగా వెనుకబడే అవకాశం కూడా ఉంది. ఈ పోటీ ప్రపంచంలో చైనా అలాంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పలేం. మరి చైనా దీనికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

కార్బన్ కాలుష్యంపై చైనా యుద్ధం - Tholi Paluku