Let's talk: editor@tmv.in
కర్ణాటకలో ‘రోడ్ల’పై సమష్టి యుద్ధం

కర్ణాటకలో ‘రోడ్ల’పై సమష్టి యుద్ధం

Pinjari Chand
25 సెప్టెంబర్, 2025

ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం, ప్రతి రోడ్డు సమస్తం గుంతలమయమే అన్న తీరుగా దేశవ్యాప్తంగా రోడ్ల పరిస్థితి ఉంది. ముఖ్యంగా బెంగుళూరులో అడుగు, అడుగునా ఓ గుంత ఉండటంతో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. దుమ్ము, ధూళి, వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యలతో రోడ్లపైకి ఎక్కి నిరసన తెలుపుతున్నారు. దీంతో ఇది ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. రోడ్లపై గుంతలకు మీరు కారణమంటే, మీరే కారణమంటూ రోడ్లపై, సోషల్ మీడియాలో ముష్టిఘాతాల వరకు వెళ్లారు. దీంతో అధికారులు ఎంట్రీ ఇచ్చి గొడవ సద్దుమణిగేలా చేశారు. అయినప్పటికీ ఇప్పటితో రోడ్లపై ఉన్న గుంతల సమస్యపై స్థానికులు తగ్గేలా లేరు. నిత్యం నిరసనలు తెలుపుతూ ప్రభుత్వానికి ఊపిరి సలపనీయడం లేదు. ఉపముఖ్యమంత్రి డీకే అయితే నిత్యం రోడ్లపై గుంతల పూడ్చివేత పైనే దృష్టి సారించారు.

రోడ్డెక్కి నిరసనలు చేసిన ప్రజలు

ఇటీవల రోడ్లపై రోజురోజుకు గుంతలు తీవ్రమవుతుండడం, ట్రాఫిక్ పెరుగుతుండడం, దుమ్ము వస్తుండడంతో ప్రజలు అనారోగ్యానికి, ఇబ్బందులకు గురవుతున్నారు. చాలామంది ప్రజలు రాత్రి సమయంలో గుంతలు కనబడక అందులో పడి గాయాలపాలయ్యారు. అదే విధంగా బెంగుళూరులో టెక్ కంపెనీలు ఎక్కువగా ఉండడంతో రాత్రి సమయాల్లోనూ ఉద్యోగులు ప్రయాణం చేస్తుంటారు. దీని వల్ల అనేకమంది ఆస్పత్రుల పాలయ్యారు. ఇవి మృత్యు గుంతలని నగర వాసులు వాపోతున్నారు. దీంతో స్థానికులు ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. వారికి బీజేపీ,జెడీఎస్ నాయకులు తోడయ్యారు. దీంతో నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు వచ్చి నిరసన తెలపడానికి మీకు అనుమతి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరి మధ్య తోపులాట జరిగింది. చివరికి దీనిపై ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్​ స్పందించే వరకు ప్రజలు, ప్రతిపక్ష నాయకులు విరమించలేదు.

ప్రకృతి వల్లే డ్యామేజ్​ అయ్యాయి

రోడ్లపై గుంతలను ఎవరూ కావాలని పెట్టరని, భారీ వర్షాలు కురవడం వలన పెద్దమొత్తంలో రోడ్లు దెబ్బతిన్నాయని, ప్రకృతి వల్లే డ్యామేజ్​ అయ్యాయని డీకే శివకుమార్​ వివరించారు. ఇప్పటికే 15000 గుంతల్లో 8 వేలకు పైగా గుంతలను పూడ్చివేశామని, మిగతావి కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఆ దిశగా పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బీజేపీ నాయకులు ప్రతి దాన్ని రాజకీయం చేయవద్దన్నారు.. మీ హయాంలో గుంతలు లేవా? గతంలో మీరు రోడ్ల అభివృద్ధిపై చర్యలు చేపట్టకపోవడమే ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణమని గుర్తు చేశారు. అయినా మా ప్రభుత్వంలో పక్షపాతం చూపించకుండా ప్రతి ఎమ్మెల్యేకు నిధులు కేటాయిస్తున్నామని, ఇప్పుడు కూడా రూ.25 కోట్లు మంజూరు చేశామని చెప్పారు.

సోషల్ మీడియాలో బ్లాక్​ బక్​ సీఈవో పోస్ట్​

రోడ్లపై ఉన్న గుంతలను హైలైట్​ చేస్తూ, 5 సంవత్సరాలుగా రోడ్లపై గుంతలు ఇలానే ఉన్నాయని, ఎవరూ వీటిపై స్పందించడం లేదు. దీని వల్ల మా కార్యాలయ సిబ్బంది కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని బ్లాక్​ బక్ సీఈవో రాజేశ్​ యబ్జీ ‘ఎక్స్​’ లో పోస్ట్​ చేశారు. త్వరలో మా కార్యాలయాన్ని ఇక్కడి నుంచి తరలిస్తామని అందులో వివరించారు. దీంతో మరోసారి రోడ్ల అంశం చర్చనీయాంశమైంది. అలాగే పారిశ్రామిక వేత్తలు కిరణ్​ మజుందార్​ షా, తదితరులు వీటిపై సీరియస్​ గా స్పందించారు. పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒకానొక సమయంలో ‘ కర్ణాటక రోడ్లు-సిగ్గు,సిగ్గు’ క్యాప్షన్​ తో ట్రెండింగ్​ నడిచింది. దీనిపై డీకే స్పందిస్తూ ఇక్కడ ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని, బ్లాక్​ మెయిల్​ చేస్తే లొంగిపోయే వారు లేరంటూ వ్యాఖ్యానించారు. పరిస్థితులు చేయి దాటిపోతున్న సమయంలో సీఎం సిద్ధరామమ్య లైన్​ లోకి వచ్చారు. అధికారులతో సమావేశం నిర్వహించి నెల రోజుల్లోపు సమస్యలు పరిష్కారం కావాలని ఆదేశించారు. ప్రజలు ఇబ్బందులో ఉంటే మీకు కనబడడం లేదా? ఎందుకు మీరు వర్షాకాలంలో సమస్య తీవ్రతను గుర్తించడం లేదని ఫైరయ్యారు. సంబంధిత అధికారులు నిత్యం పర్యవేక్షించాలని, నిధుల కొరత ఉంటే తెలియజేయాలని, ఆర్థిక శాఖ నుంచి మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బెంగుళూర్​, ఔటర్​ రింగ్​ రోడ్లు, జయనగర్​ ఇలా బెంగుళూరు పరిధిలో దాదాపు 14,800 గుంతలను గుర్తించి మరమ్మతులు చేసే పనుల్లో బీజిగా ఉన్నారు.

తాజాగా డీకే శివకుమార్​ మళ్లీ రోడ్ల అంశంపై మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీలోనే ప్రధాని నివాసానికి వెళ్లే మార్గంలోనే అనేక గుంతలు ఉన్నాయని, బీజేపీ నాయకులు ఇక్కడ మాత్రం రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మీడియా కూడా బెంగుళూరులోనే గుంతలు ఉన్నట్లు చూయిస్తోందని, రోడ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.1100 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. గతంలో బీజేపీ పాలనలో రోడ్లపై శ్రద్ధపెట్టి ఉంటే పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉండేవి కావని ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.

ప్రతి దగ్గర రోడ్లు ఇలానే ఉన్నాయి. ఎవరూ రోడ్లపై ఉన్న గుంతల పై దృష్టి సారించడం లేదు. మనకెందుకులే అనుకుంటూ నడుములు విరుగుతున్నా కట్లు కట్టుకొని మరీ ప్రయాణాలు చేస్తున్నాం. అయితే బెంగళూరు ప్రజలు సమ్యస తీవ్రత ప్రభుత్వానికి తెలిసేలా చేశారు. దీంతో ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.

కర్ణాటకలో ‘రోడ్ల’పై సమష్టి యుద్ధం - Tholi Paluku