Let's talk: editor@tmv.in
కిర్క్ స్మార‌క స‌భ‌లో ట్రంప్‌, మ‌స్క్ భేటీ

కిర్క్ స్మార‌క స‌భ‌లో ట్రంప్‌, మ‌స్క్ భేటీ

Venkatesh Balusula
23 సెప్టెంబర్, 2025

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్‌లు ఇటీవ‌ల హ‌త్య‌కు గురైన ట్రంప్ స‌న్నిహితుడు, కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ స్మారక సభలో క‌లుసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. వీరిద్ద‌రూ ఒకరి పక్కన ఒకరు కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు. ఈ విష‌యాన్ని వైట్ హౌస్ సోషల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. ఎలన్ మస్క్, ట్రంప్ ఉన్న ఫోటోతో పాటు మ‌స్క్ ఖాతాను జోడించి "చార్లీ కోసం" అని రాశారు. ట్రంప్, ఎల‌న్ మ‌స్క్ తొలిసారి బ‌హిరంగంగంగా స‌మావేశం కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాగా, ఈ స్మార‌క స‌భలో కిర్క్ స‌తీమ‌ణి ఎరికా, అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్, త‌దిత‌ర ప్ర‌ముఖులు కూడా పాల్గొన్నారు.

గతంలో మస్క్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ అధిపతిగా పని చేసిన‌ప్పుడు ట్రంప్ విధానాలపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ట్రంప్ ఆర్థికంగా బాధ్యతారాహిత్యంతో వ్య‌వ‌హ‌రిస్తార‌ని విమ‌ర్శిస్తూ రాజీనామా చేశారు. ఆ తర్వాత మస్క్ ట్రంప్‌పై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. దీనికి ట్రంప్, మస్క్ కంపెనీలతో ఫెడరల్ కాంట్రాక్టులను రద్దు చేస్తామని బెదిరించారు. ట్రంప్‌, మ‌స్క్‌ల‌కు వ్య‌క్తిగ‌తంగా కిర్క్‌తో మంచి సంబంధాలున్నాయి. కిర్క్ స్మారక సభలో వీరిద్దరూ కలవడంతో వారి మ‌ధ్య‌ సంబంధాల్లో మ‌రింత మార్పు వ‌స్తుంద‌ని స్ప‌ష్టం అవుతోంది. ఈ స్మార‌క స‌భ‌కు అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. చార్లీ కిర్క్ జీవితాన్ని ప్ర‌తి ఒక్క‌రూ గౌర‌వించాల‌న్నారు. కిర్క్ విశ్వాసం, దేశం కోసం పోరాడిన స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. చార్లీ కోసం తిరిగి అమెరికాను గొప్పగా నిర్మించాల‌ని, ఈ విష‌యంలో ఎప్ప‌టికీ వెన‌క్కి త‌గ్గ‌కూడ‌ద‌ని, ఎవ్వ‌రికీ భయపడకూడద‌ని వాన్స్ అన్నారు. కిర్క్‌ను దేశభక్తుడిగా, ధృడ సంక‌ల్పం ఉన్న‌ వ్యక్తిగా అభివర్ణించారు. అతని మరణం తర్వాత కొందరు కిర్క్‌ను దూషించడం, అతని హత్యను సమర్థించడం జరిగిందని వాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు.

హంత‌కుడిని క్ష‌మించేసిన కిర్క్ సతీమ‌ణి

సెప్టెంబర్ 10న ఉటా వ్యాలీ యూనివర్సిటీలో జ‌రిగిన ఓ బ‌హిరంగ కార్య‌క్ర‌మంలో కిర్క్ హ‌త్య‌కు గుర‌య్యాడు. టైలర్ రాబిన్సన్ అనే వ్య‌క్తి కిర్క్ ను కాల్చి చంపాడు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల‌న్న డిమాండ్‌లు వ్య‌క్తమ‌య్యాయి. చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ ఈ స్మార‌క స‌భ‌లో నిందితుడిని క్షమిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. "నేను అతన్ని క్షమిస్తున్నాను, ఎందుకంటే క్రీస్తు కూడా అలాగే చేశాడు. ద్వేషానికి సమాధానం ద్వేషం కాదు" అని ఎరికా అన్నారు. ఆమె యేసు మాటలను ఉటంకిస్తూ, "తండ్రీ, వారిని క్షమించు, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు" అని వ్యాఖ్యానించారు.

గ‌త‌ ఎన్నిక‌ల్లో రిపబ్లికన్ పార్టీకి మ‌ద్ద‌తుగా ఎల‌న్ మ‌స్క్ ట్రంప్ కోసం ప్ర‌చారం చేశారు. ట్రంప్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాక కూడా ఇద్ద‌రి మ‌ధ్య స‌త్సంబంధాలు కొన‌సాగాయి. అనంత‌రం ప‌లు వ్య‌క్తిగ‌త విబేధాల‌తో ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెరిగింది. ఇటీవ‌ల ట్రంప్ అమెరికాలో టెక్ దిగ్గ‌జాల కోసం ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన విందుకు కూడా ఎల‌న్ మ‌స్క్ గైర్హాజ‌ర‌య్యారు. అయితే, ఈ కార్య‌క్ర‌మానికి త‌న‌కు ఆహ్వానం అందింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఇప్పుడు తాజా భేటీతో వీరి బంధం మ‌ళ్లీ బ‌ల‌ప‌డుతున్న‌ట్లు స్ప‌ష్టం అవుతోంది. అంతే కాకుండా కన్జర్వేటివ్ భావజాలం మరింత బలపడనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కిర్క్ స్మార‌క స‌భ‌లో ట్రంప్‌, మ‌స్క్ భేటీ - Tholi Paluku